చందమ్మమ్మ | Sakshi
Sakshi News home page

చందమ్మమ్మ

Published Sun, Apr 21 2019 12:22 AM

Funday news story of the week 21-04-2019 - Sakshi

మాకు దూరమై అప్పుడే ఏడాది అయిపొయింది. ఇవాళ ఎందుకో పదే పదే అమ్మమ్మ జ్ఞాపకాలు చుట్టుముడుతున్నయి. తెలియకుండానే కళ్ళనుండి జారిపోతున్న కన్నీళ్లు అమ్మమ్మను మరింత గుర్తుచేస్తున్నాయ్‌. గోడ గడియారం వైపు చుస్తే రాత్రి పావు తక్కువ రెండు అవుతుంది. దిగులుగా నిట్టూర్చి, ఎంతకీ నిద్ర పట్టని ఈ రాత్రి త్వరగా తెల్లారిపొతే బాగుండునని అనుకుంటూ ...మంచంపై నుండీ లేచి వెళ్లి బాల్కనీలో ఊయలలో కూర్చున్నా!పౌర్ణమిరోజు కావడంతో వెన్నెల వెదజల్లుతోంది.చల్లని వెన్నెలలో స్నానం చేసినట్లు మనసుకు ఒక్కసారిగా హాయిగా అనిపించిది. బాల్కనీలో గోడవారగా అమర్చిన కుండీలో  నాకిష్టమైన విరజాజి తీగ ‘ఆకుపచ్చని ఆకాశంలా’ నిండుగా కనిపించింది. తీగల చివర మెరిసే నక్షత్రాల్లా అక్కడక్కడా తెల్లని జాజి పూలు. మరో పక్క గుత్తులు గుత్తులుగా విరబూసిన రాధాష్ణ పూలతీగ, తమ కమ్మటి సువాసనలతో నా మనోవేదన కాస్తయినా తగ్గించాలని ఆరాట పడుతున్నట్లున్నాయి పిచ్చివి.చిన్నప్పటి నుండీ వెన్నెలన్నా, వర్షంమన్నా, పువ్వులు, పక్షులూ సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ అన్నీ నాకు ఆత్మీయ నేస్తాల్లా కనిపిస్తాయి. అలా తదేకంగా....తన్మయత్వంగా, చందమామనే చుస్తూ కూర్చున్న నాకు, చందమామ నాకుదగ్గరగా వస్తున్నట్లు అనిపించిది. నమ్మలేనట్లు చూశాను. ఆశ్చర్యం! చందమామలో ‘అమ్మమ్మ’ ముఖం!ఆనందంతో మనసు కేరింతలు కొట్టింది. పసిపాపలా గెంతులు వేసింది. అచ్చం అదే ముఖం. వాడిపోయి ముడుతలు పడ్డ శరీరం, వంగిపోయిన నడుము, బో....సి చెవులు??  బోసి మెడ, చేతులూ...??  ఆశ్చర్యంతో రెట్టించిన ఆనందంతో చందమామను తడుముతూ అడిగాను, ‘‘అమ్మమ్మ ! నువ్‌ ఇప్పుడు చందమ్మమ్మవా.?... నువ్వేనా అస్సలు?? నమ్మలేకుండా ఉన్నానే’ని అడిగా సంబరంగా. చందమ్మమ్మ చల్లగా నవ్వింది. 

అటూ ఇటూ ఊగుతూ......‘‘అవును బిడ్డా! మీ అమ్మమ్మనేరా’’ అంది ప్రేమగా. చల్లగాలికి ఎగిరే నా ముంగురులు అమ్మమ్మ సవరిస్తూన్నదేమో అన్న భావన కలిగి అప్రయత్నంగా క్షణకాలం కళ్ళు మూసుకుని  తెరిచా.అమ్మమ్మా! నిన్ను తలచుకుంటే  వెంటనే నాకు గుర్తొచ్చేది నీ సాగిపోయిన చెవులకు ఉన్న నీ పెద్ద పేద్ద గంటీలే...నీ మెడలో మెరిసే బంగారు గుండ్లూ..చేతులకి వెండి కడియాలు...ఏమైనయే అవి? చిన్నప్పటి నుండీ ఎప్పుడూ నిన్నిట్ల బోసిగా చూడలేదే నేనూ’’ అంటుంటే... పక పకా నవ్వి అమ్మమ్మ ఇలా అంది... ‘‘పిచ్చి పిల్లా!  అసలు మనిషి బతికి ఉంటేనే వాటి కోసంఆశగా చూస్తుంటరు. సచ్చినంక వదుల్తార్ర.?’’ అంటూ మళ్ళి నవ్వింది. నవ్వులో కూడా అమ్మమ్మ కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర... ‘‘అది సరేగని బిడ్డా ఏందిరా? ఇవాళ పొద్దుగాళ్‌ సంధీ నన్నే యాద్జేస్తన్నవ్‌?  అంత మంచిదే గదా బిడ్డా?’’ పిల్లలు గిట్ల మంచిగున్నార్ర?‘ అంటూ చందమ్మమ్మ  ప్రేమగా అడిగే సరికి నాకు కన్నీళ్ళు ఆగలేదు.‘‘హా! అందరూ బాగున్నారు.. చందమ్మమ్మా! ఇవాళ నువ్‌ చాల గుర్తోచ్చావు తెల్సా’’ అన్నాను ఏడుస్తూ.‘‘తెల్సు బిడ్డా! నీ మనసు నాకు తెల్వదా... అందుకే సముదాయిద్దం అని గిటొచ్చిన. ఊకె గిట్ల బాధపడతరా ఎవ్వళ్ళన్న?’’ మందలింపుతో కూడిన ప్రేమకి కదిలిపోయాను. ‘‘అదికాదు అమ్మమ్మా! నువు ఎప్పుడూ అనేదానివి గుర్తుందా! ‘ఇంత దూరంల ఉన్నవ్‌! నా సావుదలకైనా అందుతవో, లేదో’ అని. నువు అన్నట్లే  అయింది కదానే. నిన్ను కడసారి చూడలేకపోయిన అని, ఇప్పటికీ ఎంత విల విల లాడిపోతున్ననో తెల్సా?’’ అంటూ మళ్ళి ఏడ్చాను.‘‘ఊకో బిడ్డా ఏడ్వకు‘అంటూ.....‘నిన్ను ఊకుండ బెట్టి పొదామనే నీ కండ్లకనవడ్డా...నీకు నేనంటే పాణం కాదా ర! అందుకే నన్ను నువు అట్లా ‘పాణం లేకుండా‘ చూడక పోవుటే నయమనిపిస్తది నాకైతే’’ అంది నన్ను బుజ్జగిస్టూ.

‘‘అయినా అమ్మమ్మా నీకు ఎప్పుడూ తొందరనేనే..యముడితో కూడా గొడవేనాయే  నీకు? రమ్మంటే పదమన్నట్లు అలా వెళ్లిపోయావు? నువ్‌ ఉంటే బాగుండు అమ్మమ్మా’’....బెంగగా  అంటున్న నా ముఖాన్ని ఒక్కసారిగా చల్లగా వెన్నెల తాకి వెలిగింది...అమ్మమ్మ నన్ను ముద్దు పెట్టుకున్నదని ఊహించుకుని మురిసిపోయాను!  కాసేపాగి అంది ‘‘పిచ్చి దానా! పండుటాకు రాలాలే.. కొత్త శిగురుపుట్టాలె....ఎక్కువ ఆశపడుడు కూడా బాధగాదే బిడ్డా! నువ్వే గిట్ల నళిబిళి అయితే ఎట్లచెప్పూ’’ అంది.‘అమ్మమ్మా! నేను నీ గురించి ఏవో రాయాలని..నీకు ఎన్నో చెప్పాలని అనుకున్ననే! కానీ నా ఆశ ఏదీ తీరలేదు’’ అంటుంటే అడ్డు తగిలి...‘‘ఎండ్ల రస్తవ్‌ బిడ్డా! పుస్తకంల రస్తవా? నా గురించి?? గొప్పోళ్ళ శరిత్రలే ఇయల్రేపూ సదవట్లేగదరా! నా గురించి రాస్తే సదువుతారే?’’ అంది.‘‘ఎవ్వరి కోసమో కాదే, నాకోసం రాసుకుంట... అచ్చంగా నా కోసం మాత్రమే రాసుకుంటా. నా పిల్లలకు కమ్మని కథలుగా చెప్పుకుంటా! అబ్బా చెప్పవానే ప్లీజ్‌ ప్లీజ్‌’’ అని అడిగా గారంగా.నవ్వుతూ...‘‘సరే ఎం శేప్పాలే చెప్పు.. ఐన నీకు తెలవందేముంది రా!’’ అంది ప్రేమగా.‘‘అమ్మమ్మా! నువ్వూ తాత రెక్కల కష్టంతో ఒక ఇంటికి తోడు మూడిల్లు కట్టినరు. తాత పోయిన తర్వాత ఆ ఇళ్ళను పంచిపెడ్తివి, చివరికి ‘జామచెట్టు’ కింద గుడిసెలో ఉంటివీ. అసలది గుడిసె అనడానికి కూడా కాదు. కంది కట్టే  అడ్డుపెట్టి, పైన రేకుల కప్పు. మేం ఎమన్నా చేద్దాం అన్నా వద్దని మొండిగా అనే దానివి. చూసేటోల్లు నువ్వు మాకేదో  ఇచ్చినవ్‌ అనుకుంటరు అనేదానివి. ఎండకు ఎండినవ్, వానకు తడిచినవ్‌. మాపటికి తిందామని దాచిన అన్నం, కుక్క తింటే కుక్కను కూడా తిట్టక నీళ్ళు తాగి పన్నవ్‌. నీకు ఎవ్వరిపై కోపం లేదా అమ్మమ్మా? అసలు రాదా చెప్పు?? పైగా నువ్వు ఆ గుడిసె ముందు కాలీ జాగాలో నాటే తోటకూర, దొడ్దు చిక్కుడూ...దొండ తీగా, కనకంబరాలూ...బొడ్డు మల్లె ఎంత బాగుండే....బాయి పక్కన నాటిన దానిమ్మ అచ్చం నీ ప్రేమ లెక్కనే మస్తు తీయగ ఉంటుండే.

 మేం కూడా ఆ జానెడు గుడిసెలో నీతోనే కలిసి ఉండడానికి ఇష్టపడితే నువ్‌  ‘ఏముందని వొస్తరే నా తాన’ అంటూ ఏడ్చే దానవూ. మేం నీకోసం తెచ్చిన ఐదురూపాయల తమలపాకుల కట్టను కూడా అపురూపంగా చూసే దానివి. అడిగినోళ్లకీ, అడగనోళ్లకీ అందరికీ మా ఎంకటి బిడ్డలు వచ్చిండ్రు అని చెప్పుకుని మురిసి పోయేదానవు. ఎంత హడావుడి చేసే దానవూ? ఉట్టిపైన ఉన్న చిన్న ముంతలో నెయ్యి తీసి గరంపెట్టి, ఇంత చింతతొక్కు తీసి కరివేపాకు, ఎండు మిర్చేసీ పొనికేసి, కట్టెల పొయ్యిపై ఉడుకు ఉడుకుగా  అన్నం వండి పెట్టడాన్ని ఎంత సంబరంగా చూసేదాన్నో... నీ గుడిసెని మట్టి,పేడతో కలిపి అలికి ఎప్పుడూ ఎంత మంచిగ ఉంచేదానివి. ఆ చిన్న జాగాలో ఒక పక్కగా నీ మంచం. ఆ మంచానికి నువ్‌ స్వయంగా చేత్తో కుట్టిన మచ్చర్ధాన్,  పైన చిన్న ఫ్యాను. ఓమూలన వరుసగా పేర్చిన నీ కష్టాలు దాచుకున్న సందుగలూ....గోడకు చెక్కపై పేర్చిన (నిన్ను కన్నెత్తి చూడని )నీ దేవుళ్ల పటాలు, దుమ్ము పేరుకొని ఉండేవి... అచ్చము మన బతుకుల్లాగే! కింద పడుకుంటే మాకు నేలపై గతుకుల గచ్చులోనుండీ పైకితేలిన రాళ్ళు గుచ్చుకుంటాయని ఎంతో బాధపడేదానివి. ముందుగాల సిమెంట్‌ పట్టాలతో కుట్టిన చాపలాంటిది పరిచి, తర్వాత మాకోసం  ఉతికి సందుగలో దాచిన మెత్తని బొంత తీసుకువచ్చేదానివి. అది గమ్మత్తైన లైఫ్‌ బాయ్‌ సబ్బు వాసన వచ్చేది. ఇప్పటికి నాకు లైఫ్‌ బాయ్‌ సబ్బు చుస్తే నువ్వె గుర్తోస్తవ్‌ తెలుసా!  నేల మీద బొంతతో పాటు నీ ప్రేమను కూడా పరుస్తావేమో...కదానే అమ్మమ్మా!

 పడుకోగానే నిద్ర పడ్తది. నీ ఆరాటం లో ఎంత ప్రేమ,  గుడిసెలో ఉండడం, మేడలో ఉండడం అనే మాట అటుంచి మాకు నీతో ఉండడమే ఇష్టమే! కానీ...నీకు అలా ఉండాల్సివచ్చినందుకు ఎప్పుడూ బాధ వేయలేదా?? పైగా నా గుడిసే అని గర్వంగా చెప్పు కుంటావు?   కాసేపు మౌనం తర్వాత అమ్మమ్మ మాట్లాడం మొదలు పెట్టింది ...‘గంతే కదానే బిడ్డా! మనకు లేదే అనుకుంటేనే అసలు రంథి...! మనకు ఉన్నది గిదే అనుకుంటే మనసుకు జర కుదార్థమైతది. ఆ గుడిసెలో ఒక దినమా, రెండు దినాలా ? పద్దెనిమిది ఏండ్లు ఉన్నకదానే....ముందు గా గుడిసె కూడా నాకు ఉండెనా??....మసీదులోనే ఒక మూలుంటననీ..ఆడనే ఇంత ఉడక బెట్టుకుంటనని చారెడు బియ్యం గింజలు,వొక గిన్నె చేతిలో పట్టుకు పోతుంటే గా గౌండ్లాయన, గదేనే .. మన ధమ్మంజయ్య పెద్ధబాపు లేదా గాయన తమ్ముడు గొల్లోల వాడకట్టుల వుంటడు ఆయన ఎదురోచ్చిండు....‘అమృతక్కా! ఏడికి పోతన్నవే...నీకీ గోస ఏందే...ఎం కర్మపాడైందే? మేంమంత లేమాయే నీకు? మాఇంట్ల ఉండని’ కొడుకు వాళ్ల ఇంటికి కొంచవోయిందు బిడ్డ.ఆడ వాళ్ళింట్లనే ఒక అరల ఎనిమిది నెలలున్న. 

గాడ ఇంత ముద్ద ఉంటే తిన్నా! లేదంటే కాళ్ళు కడుపుల పెట్టుకుని మళ్సూకొని పన్నా. గుప్పుడే మీ బాపు వచ్చిండు నా తానకి ‘అత్తమ్మా మాతో ఉండరాదే? ఇట్లా ఎన్నాళ్ళు ఉంటావ్‌?’ అని అన్నడు.  నేను రాను అయ్యా ..నా బిడ్డను కూడా  ్చలకు. నేనె ఒకరి ఇంట్ల ఉన్నా అని చెప్పి మర్లగొట్టినా. బిడ్డలు వచ్చేందుకు కూడా నోచని తల్లిని అంటూ గుప్పుడు మాత్రం మస్తు ఏడుసుకొన్నా బిడ్డా! నా గోస పగోనికి కూడా రావద్దు. అట్ల ఉన్నా తొంగిచూసినోడు లేడు నన్ను...చివరికి గా అన్నల్లోకి కల్సిన కిష్ఠప్ప చేయబట్టి నాకు  ఆ గుడిసైనా తయారైంది...మేడల్లో ఉన్నా గదే..! గుడిసెలో ఉన్నా గదే!...బతికి ఉండగానే నడిచే శవం లెక్క తిరిగినా..! గివాళ నేను పైకి వచ్చినట్టే గా మేడలో ఉండే వాళ్లు అస్తరా ?రారా? చెప్పు ?’ అంది ఉబికే కన్నీరు ఆపుకుంటూ....తిరిగి తేరుకుని....‘‘నీకు ఇంకొ గమ్మత్తు ముచ్చట చెప్పన్నా! ఇంకానయం ఇక్కడకు నేనే ముందు అచ్చిన.....‘వాళ్లు’ గిట్ల ఇక్కడకు ముందు అచ్చుంటే నాకు ఈడ సూత జాగా లేకుండా చేశురో ఏమో గదానే’’....అంటూ అమృతం కురిసినట్లు ఒకటే నవ్వు......నిజంగా నీకు బాధ లేదా అమ్మమ్మా ? కానీ అమ్మమ్మా ! నేను చూడంగ సచ్చిన కొన్ని గంటలకే పాడె కట్టి, పండగ చేయుడు చూడలేదు..కనీసం నేను వచ్చే వరకు ఉంచమని ఆ ‘పెద్ద మనుషులని’ బతిమాలినా కూడా ఉంచలేదు నిన్ను..కన్నీరు కట్టలు తెగిన ప్రవాహం అయింది.

 చల్లని గాలి నా బుగ్గలు తడిమింది... అమ్మమ్మ చెయ్యి కాబోలు అనుకున్నా....! చందమ్మమ్మ ఒక క్షణం గంభీరమై మరుక్షణం ఇలా అంది....‘‘కడుపారా కనుకున్న తల్లిని కదానే బిడ్డా! శపించడం తెలవది నాకు. కానీ ...ఏనాడైనా ‘గట్ల జుశుండెడిది కాదు మా అవ్వని’ అనుకోక పోతారు?...ఆల్లకు పైసల్‌ ఉండొచ్చు రా...పైసల్‌ ఎం చేస్తాయ్‌! మా అంటేపాణాల్దీస్తయ్‌..గంతే!  ‘రేపుగిట్ల వాళ్లు ఇక్కడికిసూత నాతానకి వచ్చినా, ఈడ సుత ఇంత జాగా ఇస్తనే నేనూ’’ అంది గర్వంగా!!.మరి ఇంకేం ‘అక్కడ’ కూడా ఓ ‘జామ చెట్టు’ నాటు మరి...ఎందుకైనా మంచిది ముందు ముందు పనికొస్తది.....అంటూ అల్లరిగా నవ్వాను, తేలిక పడ్డ మనసుతో..!అందంగా నవ్వి నుదుట ముద్దు పెట్టింది అమ్మమ్మ.....‘‘మరి నే బోవన్నా ఇగ’’ అంది చందమ్మమ్మ...‘‘నీ పేరుకు తగ్గ అమృతమ్మవేనే నువ్వు...ఇపుడు మాత్రం నాకోసం వచ్చిన చల్లని వెన్నెలవు’’ అంటూ గాల్లో ముద్దులు ఇచ్చాను.... చల్లని వెన్నెల్లో నిలువెల్లా తడిచిపోతూ. 
∙శారదాదేవి 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement