బ్లాక్ మ‌నీ

Funday crime story 17-03-2019 - Sakshi

క్రైమ్‌ స్టోరీ

తమ మేడ టెర్రస్‌ పైనుంచి బైనాక్యులర్స్‌తో చుట్టుపక్కల దృశ్యాలు చూస్తున్నాడు కిరణ్‌. ఇంటర్‌ చదువుతున్న వాడికి దుబాయ్‌ నుంచి మేనమామ గిఫ్ట్‌గా తెచ్చిచ్చాడు. ఈసారి హైదరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ జరిగినప్పుడు వెళ్లి బైనాక్యులర్స్‌లో నుంచి గేమ్‌ చూడాలని వాడి కోరిక. అందుకే రోజూ పేపరు చూస్తున్నాడు క్రికెట్‌ మ్యాచ్‌ ఎప్పుడా అని.  ఆ రోజు సాయంకాలం చీకటి పడుతూ ఉండగా కనిపించిన దృశ్యం ఆసక్తిగా గమనించాడు. రత్నయ్య రైస్‌ మిల్లు వెనుకభాగంలో దాదాపు ఎకరం స్థలం ఖాళీగా ఉంది. అదంతా పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా ఉంటుంది. రత్నయ్య, అతని కొడుకు వెంకట్‌ పలుగు పారలు తీసుకుని గొయ్యి తవ్వుతున్నారు. అక్కడొక చెక్కపెట్టె ఉంది. గొయ్యి తీసిన తర్వాత చెక్కెపెట్టెను అందులో పెట్టి పూడ్చారు. రోజూ న్యూస్‌పేపర్‌ చదువుతున్న కిరణ్‌కి ఏదో అర్థమైంది. వాళ్లుంటున్న హిందూపురంలో రత్నయ్య పెద్ద షావుకారు. రైసు మిల్లు, సినిమా హాలు, మెయిన్‌ రోడ్డులో హోటల్, గ్యాస్‌ ఏజెన్సీ వగైరా వ్యాపారాలు ఉన్నాయి. ఈసారి ఎలక్షన్స్‌లో ఎమ్మెల్యేగా నిలబడతాడని చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి చాలా డబ్బు కావాలి. అయితే, ఎలక్షన్లప్పుడు ఐటీ వాళ్లు, ఈడీ వాళ్లు రైడింగులు చేసి, లెక్కలు చూపని డబ్బును సీజ్‌ చేస్తున్నారు. కాబట్టి రత్నయ్య బ్లాక్‌ మనీ పెట్టెలో పెట్టి పాతిపెట్టాడన్నమాట.

కిరణ్‌కి గొప్ప రహస్యం కనిపెట్టానన్న ఉత్సాహంతో ఛాతీ ఉబ్బింది. ఈ సంగతి ఎవరికైనా చెబితే గాని మనశ్శాంతి కలగదు. అందుకని వాడి క్లోజ్‌ ఫ్రెండ్‌ బ్రహ్మానందం దగ్గరకు పరుగెత్తాడు. ‘‘ఒరేయ్‌ బ్రహ్మం! నేనొక సీక్రెట్‌ కనిపెట్టాను.’’ ఎగై్జట్‌ అవుతూ చెప్పాడు. ‘‘సీక్రెటా? ఎవరిది?’’ ‘‘రత్నయ్యది..’’ అని తను బైనాక్యులర్స్‌తో చూసిన దృశ్యం గురించి చెప్పాడు. ‘‘ఔన్రోయ్‌! నువ్వు చెప్పింది నిజమే. ఈసారి రత్నయ్య నిలబడతాడనీ, ఎన్ని కోట్లయినా ఖర్చు పెడతాడనీ మా నాన్న చెబుతుంటే విన్నాను’’ అన్నాడు బ్రహ్మం. ‘‘ఈ సంగతి పోలీసులకి ఫోన్‌ చేసి చెప్తే సరి. రత్నయ్య తిక్క కుదురుతుంది. గోతిలో దాచిన డబ్బంతా పోలీసులు పట్టుకుపోతారు’’ అన్నాడు కిరణ్‌. ‘‘ఆ పని చేద్దాం. ఇంట్లో మీ అమ్మ దగ్గరున్న సెల్‌ఫోన్‌ పట్టుకురా. పోలీసులకు ఫోన్‌ చేద్దాం..’’ అన్నాడు బ్రహ్మం. ‘‘అమ్మో! వద్దురా.. ఆ నంబర్‌ పోలీసులకు తెలిసిపోతుంది. ఇంటికి వచ్చి ఏమైనా అడుగుతారేమో! అమ్మ గొడవ పెడుతుంది. లేనిపోని గొడవ ఎందుకు?’’ ‘‘సరే! పోలీసులకు ఎలా తెలియజేద్దాం?’’ ‘‘ఐడియా’’ ‘‘ఏంట్రా?’’ ‘‘యాదగిరి బడ్డీ కొట్టు దగ్గర కాయిన్‌ బాక్స్‌ ఉంటుంది. అందులోంచి చేద్దాం. ఏ గొడవా ఉండదు.’’ కిరణ్‌ ఐడియా బ్రహ్మానికి నచ్చింది. యాదగిరి బడ్డీకొట్టు దగ్గరకు వెళ్లారు. యాదగిరి వచ్చిన వాళ్లకు సిగరెట్లు, చాక్లెట్లు వగైరా అమ్ముతూ బిజీగా ఉన్నాడు. బ్రహ్మం ఒక పక్కగా ఉన్న కాయిన్‌ బాక్సు నుంచి పోలీస్‌ స్టేషన్‌ నంంబర్‌కి రింగ్‌ ఇచ్చి, రూపాయి కాయిన్‌ వేశాడు. రింగైన కాసేపటికి పోలీస్‌ స్టేషన్‌లో ఫోన్‌ ఎత్తారు. ‘‘హిందూపురం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌..’’ ‘‘రత్నయ్య మిల్లు వెనుక బ్లాక్‌ మనీ పూడ్చి పెట్టాడు’’ వణుకుతున్న గొంతుతో చెప్పాడు బ్రహ్మం. బ్రహ్మానికి ఎందుకో ఆ సమయంలో భయం కలిగింది. తను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వింటారేమో అని వణుకు వచ్చింది. తనే పోలీసులకు బ్లాక్‌ మనీ సంగతి చేరవేసినట్లు తెలిస్తే రత్నయ్య తనని పట్టుకుని చంపుతాడు. అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తూ గొంతు తగ్గించి నెమ్మదిగా చెప్పాడు.

‘‘రత్నయ్యా! ఏ రత్నయ్య?’’‘‘రైసు మిల్లు ఓనర్‌ రత్నయ్య బ్లాక్‌ మనీ ఏంది?’‘‘ఔను. చెక్కపెట్టెలో బ్లాక్‌ మనీ పెట్టి, రైసు మిల్లు వెనుక ఖాళీ స్థలంలో గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. నేను చూశాను.’’‘‘నువ్వు చూశావా? ఎవరు నువ్వు?’’బ్రహ్మం రిసీవర్‌ ఠక్కున పెట్టేశాడు. కిరణ్‌ చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కెళ్లాడు. ‘‘నువ్వెవరు? అని పోలీసులు అడుగుతున్నర్రా. నేను మాట్లాడకుండా పెట్టేశాను.’’ అన్నాడు ‘‘మంచి పని చేశావు. మన పేరు ఎలా చెప్తాం. మనల్ని పట్టుకుంటారు.’’ అన్నాడు కిరణ్‌.ఇప్పుడు కిరణ్‌కి సంతృప్తి కలిగింది. ఏదో ఘనకార్యం సాధించినంత ఆనందంగా ఉంది. రేపు పోలీసులు గొయ్యి తవ్వి బ్లాక్‌ మనీ అంతా పట్టుకుపోతారు. రత్నయ్య లబోదిబోమని మొత్తుకుంటాడు. అదంతా టీవీల్లో చూపిస్తారు. భలే..!

పోలీస్‌ స్టేషన్‌లో కిరణ్, బ్రహ్మంల కాల్‌ రిసీవ్‌ చేసుకున్నది హెడ్‌ కానిస్టేబుల్‌ గోపీకృష్ణ. ఎస్సై రహీం దగ్గరకు వెళ్లి చెప్పాడు. ‘‘సార్‌! రత్నయ్య తన మిల్లు వెనుక ఖాళీ స్థలంలో బ్లాక్‌ మనీ చెక్కెపెట్టెలో పెట్టి, గొయ్యి తీసి పూడ్చిపెట్టాడట. ఎవడో కాల్‌ చేశాడు.’’‘‘వాట్‌! ఏ రత్నయ్య?’’‘‘హిందూపురంలో రత్నయ్య తెలియని వాళ్లెవరు సార్‌? సౌండ్‌ పార్టీ. రైసు మిల్లు, హోటల్స్, గ్యాస్‌ ఏజెన్సీలు.. చాలా బిజినెస్‌లు ఉన్నాయి.’’‘‘ఓ.. ఆ రత్నయ్యా!’’‘‘ఔను సార్‌!’’‘‘సరే! బ్లాక్‌ మనీ గొడవేంటి? రత్నయ్య గొయ్యి తీసి పాతిపెట్టడం ఏంటి? అదంతా ఎవడో కాల్‌ చేసి చెప్పడం ఏంటి? నాన్సెన్స్‌. మనకేం సంబంధం?’’‘‘ఔను సార్‌! అదంతా ఇన్‌కమ్‌ టాక్స్‌ వాళ్లు చూసుకుంటారు. వీడెవడో మూర్ఖుడిలా ఉన్నాడు. మనకు కాల్‌ చేశాడు.. ఎందుకైనా మంచిది సీఐగారికి చెప్పండి.’’ అన్నాడు హెడ్‌.‘‘అదే మంచిది’’ అని ఎస్సై రహీం ఇన్‌స్పెక్టర్‌ రూమ్‌కి వెళ్లి చెప్పాడు.‘‘పెద్దవాళ్లతో గొడవ. డీఎస్పీ సాబ్‌తో చెబుదాం. ఐటీ వాళ్లతో చెప్పాలనుకుంటే ఆయనే చెప్తాడు’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.డీఎస్పీ విని ‘‘ఇదేదో ఆకతాయి చేసిన కాల్‌. రత్నయ్య పెద్దమనిషి. గొయ్యితీసి బ్లాక్‌మనీ పాతిపెట్టడం ఏంటి? సిల్లీగా లేదూ! ఆ కాల్‌ చేసిన వాడు తవ్వి తీసుకోవచ్చుగా? మనకెందుకు చెప్పడం?’’ అన్నాడు.‘‘ఎందుకైనా మంచిది. నేను ఐటీ జాయింట్‌ కమిషనర్‌తో మాట్లాడతాను. రత్నయ్య ఐటీ గొడవలు ఏవైనా ఉంటే వాళ్లు చూసుకుంటారు’’ అన్నాడు డీఎస్పీ.‘‘సార్‌! నిప్పులేనిదే పొగ రాదు. ఇందులో ఏదో ఉంది. రత్నయ్య అంతటి పెద్దమనిషి స్వయంగా గొయ్యి తీసి పాతిపెట్టాడంటే బ్లాక్‌మనీనే సార్‌’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ కాన్ఫిడెంట్‌గా. 

ఆ రోజు ఉదయం పోలీసులు రత్నయ్య మిల్లులోకి వచ్చారు. పోలీసు కుక్క మిల్లు వెనుకభాగంలోని గొయ్యి దగ్గర ఆగింది. కాలితో మట్టిని పెళ్లగించసాగింది.ఇన్‌స్పెక్టర్‌ సైగ చేయడంతో పనివాళ్లు పారలతో గొయ్యి తవ్వారు. చెక్కపెట్టె బయట పడింది. ఒక్కసారిగా దుర్వాసన ఎగజిమ్మింది. అంతా కర్చీఫ్‌లతో ముక్కులు మూసుకున్నారు.చెక్కపెట్టె బద్దలు కొట్టారు. చంద్రమోహన్‌ శవం బయటపడింది. రెండు రోజుల కిందట చంద్రమోహన్‌ కనిపించడం లేదని అతని తండ్రి పోలీసులకు కంప్లైంట్‌ చేశాడు. చంద్రమోహన్, రాజకుమారి ప్రేమించుకున్నారు. చంద్రమోహన్‌ ఒక డ్రైవర్‌ కొడుకు. రాజకుమారి కోటీశ్వరుడైన రత్నయ్య ఏకైక కుమార్తె. కూతురు తమ కులం కాని ఒక అనామకుడిని ప్రేమించడం జీర్ణించుకోలేకపోయాడు రత్నయ్య. అతన్ని మాట్లాడదామని రైసుమిల్లుకి పిలిపించాడు. కొడుకు, తను కలిసి చంద్రమోహన్‌ని హత్య చేశారు. ఎవరికీ తెలియదులే అనుకుని మిల్లు వెనుక ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టారు.కాని రత్నయ్యకు తెలియదు నేరం దాగదని. ఎవరూ చూడటం లేదని అనుకోవడం అజ్ఞానం. పైన ఎవరో ఒకరు చూస్తుంటారు. నేరం బయట పడుతుంది.కోటీశ్వరుడు రత్నయ్య తన కూతురిని ప్రేమించిన చంద్రమోహన్‌ని హత్య చేసి, తన మిల్లు ఆవరణలోనే పాతి పెట్టాడనే వార్త హిందూపురం అంతటా శరవేగంగా వ్యాపించింది. తర్వాత టీవీ చానల్స్‌ ద్వారా ప్రపంచానికి తెలిసింది. రత్నయ్య, అతని కొడుకు హత్యా నేరంపై జైలుకెళ్లారు.
-వాణిశ్రీ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top