పుస్తక సమీక్షణం


అద్వైతపు వెన్నముద్ద

 ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్, ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా, కాచిగూడ, హైదరాబాద్.

 పేజీలు: 284; వెల: 120

 

 పుస్తకం    :    సాగర ఘోష కావ్యం - సామాజికాద్వైతం

 జానర్    :    నాన్‌ఫిక్షన్/సిద్ధాంత గ్రంథం

 రచన    :    డా॥తలారి వాసు

 

 తెలుగు పద్యం ప్రాభవాన్ని కోల్పోతుందనే భావన ఆధునిక కవుల మెదళ్లను తొలుస్తున్న నేటి సమాజంలో  పద్య ప్రాశస్త్యాన్ని ప్రభావిత పరచే విధంగా హృద్యంగా రాస్తూ, అవధాన ప్రక్రియ ద్వారా, ఉపన్యాసాల ద్వారా పద్యానికి ప్రాణం పోస్తున్నవారు డా॥గరికపాటి నరసింహారావు. పద్యం రాయడంలోను, చెప్పడంలోను ప్రావీణ్యత ఉండాలే కాని, బతుకు తెరువుకు పద్యం పనికొస్తుందని నిరూపించిన మహాసహస్రావధాని. వీరి కావ్యం ‘సాగర ఘోష’. 1116 పద్యాలతో భారతీయ తాత్త్విక చింతనా నేపథ్యంలో, జగద్గురు ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతానికి అద్దం పట్టే విధంగా, సామాజిక భౌతిక పర్యావరణ కలుషితాలను ఎత్తి చూపుతుంది.

 

 ‘సాగర ఘోష’ కావ్యంలోని సామాజికాద్వైతం దర్శింపజేస్తూ సిద్ధాంత గ్రంథాన్ని రాశారు డా॥తలారి వాసు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 2010లో డాక్టరేట్ పట్టం పొందిన సిద్ధాంత గ్రంథమిది. పరిజ్ఞానం, పరిపక్వత రెండూ కలిగిన వాసు, దశమాంతరంగాలు గల ఈ కావ్యాన్ని పరిశోధనతో చిలికి షష్ఠ్యాంతరంగాలుగా వడగట్టి సామాజికాద్వైతాన్ని వెన్నముద్దగా అందించారు. సాగర ఘోష కవితా లోతులు, రీతులు తెలియాలంటే ఈ సిద్ధాంత గ్రంథాన్ని పఠించాల్సిందే!

 - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

 

 మ్యాజిక్ సృజన

 పేజీలు : 160

 వెల: 150

 ప్రతులకు:  విశాలాంధ్ర, నవోదయా పుస్తక కేంద్రాలు

 

 పుస్తకం    :     హృదయంలో ఉదయం (నవల)

 రచన    :    డా.జి.సురేశ్‌బాబు

 

 విషయం    :    ఒక రచయిత సృజన ప్రపంచం అతని మనస్సు తిరుగాడిన లోకాలలోంచి బహిర్గతమవుతుంది. ఓ రకంగా ఆ రచన ఆ రచయిత అవగాహనా పరిధిని పాఠకులకు పరిచితం చేస్తుంది. ఒక్కోసారి రచయిత చూడలేకపోయిన ప్రపంచాన్ని ‘భ్రమ’గానైనా ఆ రచన వ్యక్తీకరిస్తుంది. దీనినే క్రిస్టఫర్ కాడ్వెల్ ‘ఇల్యూజన్’ అన్నది. సరిగ్గా, ఈ ఇల్యూజన్‌ను వాస్తవికతలో ముంచి ఆధ్యాత్మిక లోకంలోకి ప్రయాణింపజేసే నవల ఇది. చిత్రమైన నవల. పాఠకుడి అవగాహనాపరిధిని విశాలం చేసేది కూడా. కాళిదాసు, శ్రీశ్రీ, చలం, కృష్ణశాస్త్రి, యండమూరి లాంటి కవులు, రచయితలు పరిచయమవుతారు.

 

 ఉపనిషత్ వాక్యాలు హృదయంలోకి చొచ్చుకుపోతాయి. జీవితం, దాంపత్యం, అలౌకికత, ఆధ్యాత్మికత  మధ్య గిరికీలు కొట్టే మానవ మనస్తత్వాన్ని బ్యాలెన్స్ చేయాలనే రచయిత తపన నవలంతా కనిపిస్తుంది. రుషి, ఆశ, శిఖర్, నిష్ఠ, నయన, రంగాచారి, మస్తాన్, ఫరీదా, సుషుమ్న లాంటి పాత్రలు జీవితం చుట్టూ ముసిరిన హిపోక్రసీని బహిర్గతం చేస్తూ గుర్తుండిపోతారు. ఫాంటసీ అంతర్లీనంగా సహజత్వం ఉన్న ఈ నూతన ధోరణి నవల పాఠకులకు మంచి అనుభూతిని వాగ్దానం చేస్తుంది.

 - డా. నూకతోటి రవికుమార్

 

 ద్రవరూప అక్షరాలు

 ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయా

 పుస్తకం    :    నేను నా పైత్యం  రచన: శంభుమహంతి రత్నకిశోర్

 విషయం: గబ్బర్‌సింగ్ సినిమాలోని వెటకారపు ఉటంకింపునే పుస్తక టైటిల్‌గా స్వీకరించాడంటే ఆ రచయితకు నిజంగానే తిక్కేదో ఉండాలి! మణిరత్నం, వర్మ, బాల, సుకుమార్, ఎంఎస్ రెడ్డి, ఇళయరాజా, హరీష్‌శంకర్; తనకు నచ్చినవాళ్ల మీద తనకు నచ్చినట్టు రాసుకున్న కొన్ని వ్యాసాలున్నాయీ పుస్తకంలో (పుస్తకం? అట్లాస్ సైజు, ఆర్ట్ పేపర్, 18 పేజీలు). శృంగారం దేహగతమా ఆత్మగతమా లాంటి సందేహాలు; ‘సత్యం స్వప్నం మధ్య ప్రయాణమే జీవితం’ లాంటి సందేశాలు; ‘ప్రేమని పొందలేనిచోట మరణం ఆకస్మికమైనా వాంఛితమే’ లాంటి కవిసమయాలు అక్కడక్కడా! జీఎం ఫుడ్ గురించి, అమ్మాయిల 50 శాతం వాటా గురించి కూడా మాట్లాడుతాడు. ‘మా నేతల నుంచి, మా పోలీసు బాసుల నుంచి ఏమీ ఆశించకండి. రెండు నిమిషాలు మౌనం తప్ప’ అని దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల బాధితుల కోసం దుఃఖపడతాడు కూడా! తన ద్రవరూప పైత్యాన్ని ఒక నిర్మాణంలోకి తేగలిగితే మంచి ప్రోజ్ రైటర్ అవగల శక్తి ఉన్నవాడు కిశోర్.

 - ఆర్.ఆర్.

 

 కొత్త పుస్తకాలు

 వెల: 36

 ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు జీవితం- రచనలు-సమాలోచన

 సంపాదకులు: డా.వీరాచారి

 పేజీలు: 184; వెల: 90

 ప్రతులకు: అధ్యక్షుడు, అరసం వరంగల్ జిల్లా, 3-83, శ్రీవెంకటేశ్వర కాలనీ, గోపాలపురం, హన్మకొండ-15. ఫోన్: 9963610842

 

 ఒక దీపం వెలిగింది (వికలాంగుల జీవనపథం)

 రచన:

 అలపర్తి పిచ్చయ్య చౌదరి

 పేజీలు: 118; వెల: 80

 ప్రతులకు: రచయిత, 42/169, జయనగర్ కాలనీ, కడప-516002;

 ఫోన్: 08562-253734

 

 హిందూ సంప్రదాయ పండుగలు- ఉత్సవాలు

 రచన: కప్పగంతు వెంకట రమణమూర్తి

 పేజీలు: 158; వెల: 125

 ప్రతులకు: గ్లోబల్ న్యూస్, బి 2, ఎఫ్ 12, రామరాజా నగర్, సుచిత్రా జంక్షన్, సికింద్రాబాద్-67;

 ఫోన్: 9246375694

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top