సాగర మథనం...  

Dvr Bhaskar puraneethi sagara mathanam In Sakshi Funday

పురానీతి

దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించి, అమృతాన్ని సాధించటానికి తయారయ్యారు.  రాక్షసులకూ అమరత్వం సిద్ధిస్తే, మనకు ఒరిగేది ఏముంది? అయితే అలా కాకుండా చేసే బాధ్యత విష్ణుమూర్తిదే కాబట్టి అంతా ఆ విష్ణువుదే భారం! అని దేవతలు విష్ణువును నమ్ముకున్నారు. పాలసముద్రంలో మందరపర్వతాన్ని కవ్వంగా నిలబెట్టి, వాసుకి మహాసర్పాన్ని తాడుగా చుట్టి, క్షీరసాగరాన్ని చిలకాలనుకున్నారందరూ. అంతవరకూ బాగానే ఉంది కాని, మందరపర్వతాన్ని తెచ్చి పాలసముద్రంలో వేయుడం ఎవరికి సాధ్యం అవుతుంది? అది మామూలు వారికి శక్యం కాని పని కదా... శ్రీ మహావిష్ణువు తానే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఆ పని నెరవేర్చి, గిరిధారి అనిపించుకున్నాడు. రాక్షసులు వాసుకి తలవైపు పట్టుకుంటామని పట్టుబట్టారు. అలాగే ఒప్పుకోండని దేవతలకు చెప్పి విష్ణువు తాను కూడా దేవతలందరి చిట్టచివర వాసుకి తోక పట్టుకున్నాడు. సాగర మథనం ప్రారంభమైంది.

క్షీరసాగర మథనం సమయంలో, రాక్షసులు దేవతలను పరిహాసం చేస్తూ, తమ భుజబలం అంతా చూపిస్తూ లాగారు. దేవతలు కూడా మేమేమీ తక్కువేమీ లేదని బలంగా లాగారు. మథనం మహావేగంతో సాగింది. ఆ రాపిడికి తట్టుకోలేక వాసుకి మహాసర్పం విషాన్ని కక్కింది. హాలాహలం జ్వాలలు విరజిమ్ముతూ చెలరేగింది. ఆ విషాగ్ని కీలలకు రాక్షసులు కొందరు మలమలమాడి మసి అయ్యారు. హాలాహల మహాగ్ని విజృంభించి లోకాన్ని దహించే ప్రమాదం ఏర్పడింది.

అందరూ హరహరా అని శివుణ్ణి ప్రార్థించారు. శివుడు హాలాహలాన్ని ఉండలా చేసి దానిని నేరేడుపండులా గుటుక్కున మింగబోయాడు. పార్వతీదేవి అది ఆయన ఉదరంలోకి చేరకుండా పరమేశ్వరుడి గొంతును మెల్లగా అదిమింది. అలా శివపార్వతులు హాలాహలాన్ని గొంతులోనే ఉంచి లోకాల్ని రక్షించారు. శివుడావిధంగా గరళ కంఠుడనిపించుకున్నాడు.  శివుడు కంఠంలోని హాలాహలం వేడికి ఉపశమనంగా చల్లని చంద్రుణ్ణి తలపై ధరించి, చంద్రశేఖరుడయ్యాడు. ప్రస్తుతానికి విషగండం తప్పింది అని ఊపిరి పీల్చుకునేంతలో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. మందరపర్వతం సముద్రంలోకి కుంగిపోసాగింది. దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు పెద్ద తాబేలుగా కూర్మావతారం దాల్చి సముద్రంలోకి ఒరిగిపోయిన మందరపర్వతాన్ని మూపున మోస్తూ పైకి తెచ్చాడు.

మహాకూర్మమై పర్వతం అటూ ఇటూ బెసక్కుండా పర్వతాగ్రంపై కూర్చొని పాదంతో తొక్కిపెట్టి ఉంచాడు. అదే సమయంలో దేవతలతో కలిసి సముద్ర మథనం చేశాడు. ఇలా బహురూపాలతో విష్ణువు కనిపించాడు. ఇక ఇప్పుడు సాగర మథనం సక్రమంగా సాగింది. క్షీరసాగరం నుంచి చంద్రుడు, లక్ష్మి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతమనే తెల్లటి ఏనుగు, ఉచ్ఛైశ్రవమనే తెల్లటి గుర్రం, సుర అనే మత్తూ, ఉత్తేజమూ కల్గించే పానీయమూ ఇంకా ఎన్నెన్నో ఉద్భవించాయి.

సురను దేవతలు స్వీకరించి సురులు అనిపించుకున్నారు. చిట్టచివరకు అమృతం సిద్ధించింది. విష్ణువు ఆయుర్వేదానికి మూల విరాట్టు అయిన ధన్వంతరి అవతారంతో, అమృత కలశాన్నీ, అనేక ఓషధులనూ ధరించి, పద్మాసనంపై కూర్చొని, సముద్రం నుంచి వచ్చాడు. లక్ష్మీదేవి శ్రీవత్సకౌస్తుభ మణులతో కూడిన వైజయంతిమాలను వేసి విష్ణువును వరించింది. విష్ణువు లక్ష్మీకాంతుడయ్యాడు. 

ఇలా ఎన్నెన్నో విశేషాలు, దైవసహాయాలు జరిగాక అమృతం సిద్ధించింది. దేవదానవుల లక్ష్యసాధన నెరవేరింది. అందుకే ఏదైనా శ్రమదమాదులతో కూడిన కార్యసాధనకు ‘సాగర మథనం’ అనే మాట పర్యాయపదంగా నిలిచింది. బృహత్తర కార్యక్రమాన్ని ఏదైనా తలపెట్టినప్పుడు దానికి ఆటంకం కలిగించే అనేక విఘ్నాలు సంభవించవచ్చు. అయినా సరే, ఓర్పుగా నేర్పుగా ఆ పనిని, మానవ ప్రయత్నాన్ని కొనసాగించాలి. అప్పుడే లక్ష్యసాధన జరుగుతుంది. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top