మూసిన తలుపులు

Chalapathi Rao died in suspicion - Sakshi

 క్రైమ్‌ స్టోరీ

మహబూబ్‌ బాషా

ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించాడు. అదొక పడకగది. అందులోని సామాన్లన్నీ పొందికగానే ఉన్నాయి. గది మధ్యలోని మంచంపై ఇంటి యజమాని చలపతిరావు వెల్లకిలా పడుకుని ఉన్నాడు. కాని ఆయన నిద్రపోవడం లేదు. శాశ్వత నిద్రలో ఉన్నాడు. చలపతిరావుకి డెబ్బయ్యేళ్లు ఉంటాయి. నగరంలో ఆయనకు రెండు రెడీమేడ్‌ బట్టల షాపులు ఉన్నాయి. నగర శివార్లలో ఉన్న ఈ ఇల్లు ఆయన స్వార్జితం.చలపతిరావు భార్య రెండేళ్ల కిందటే క్యాన్సర్‌తో చనిపోయింది. భార్య పోయాక ఆయన తన రెండు షాపుల్నీ ఇద్దరు కొడుకులకు అప్పగించి, తాను ఇంటికే పరిమితమయ్యాడు. పెద్దకొడుకు రాజేష్‌కి ఐదేళ్ల కిందట పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్‌కి తాగుడు అలవాటు ఉంది. ఇదే విషయమై తండ్రీ కొడుకుల మధ్య నెల్లాళ్ల కిందట పెద్ద గొడవే జరిగింది. రాజేష్‌ తండ్రి మీద అలిగి, ఇల్లు వదిలేసి భార్యాపిల్లలతో అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. చిన్నకొడుకు రమేష్‌కి ఇంకా పెళ్లి కాలేదు. ప్రస్తుతం తండ్రికి తోడుగా అతనొక్కడే ఉన్నాడు.

 ఆ రోజు ఉదయం ఏడుగంటలకు చలపతిరావు ఫ్యామిలీ డాక్టర్‌ ఫోన్‌ చేసి, చలపతిరావు అనుమానాస్పద స్థితిలో మరణించాడని చెప్పడంతో ఇన్స్‌పెక్టర్‌ విజయ్‌ సిబ్బందితో సహా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ నిపుణులు పరీక్షిస్తుండగా, ఓ మూల కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తున్న రమేష్‌ని ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ పలకరించాడు. ఏం జరిగిందో చెప్పమన్నాడు. ‘‘సార్‌! నిన్న రాత్రి పనిమనిషి వంట చేసి వెళ్లిపోయాక నేను, నాన్నగారు భోజనాలు చేశాం. నాన్నగారు పది గంటలకల్లా తన గదిలోకి వెళ్లి పడుకున్నారు. నేనొక అరగంట టీవీ చూసి నా గదిలోకి వెళ్లి పడుకున్నాను. తెల్లవారాక పనిమనిషి వచ్చి కాలింగ్‌ బెల్‌ కొడితే నేను లేచి వెళ్లి తలుపు తెరిచాను. నిజానికి రోజూ నాన్నగారే తలుపు తెరిచేవారు. ఆయన ఎందుకు లేవలేదో చూడ్డానికి నేను ఆయన గదిలోకి వెళ్లాను. నాన్నగారిని ఎంత లేపినా లేవలేదు. నేను ఆందోళన చెంది మా ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోన్‌ చేశాను. ఆయన వచ్చి పరీక్షించి, నాన్నగారు పోయారన్నారు. తర్వాత ఆయనే ఫోన్‌ చేసి మిమ్మల్ని పిలిచారు.

’’ అన్నాడు రమేష్‌.అక్కడే ఉన్న డాక్టర్, పనిమనిషి రమేష్‌ మాటల్ని సమర్థించారు. ‘‘మృతుని శరీరం కొద్దిగా రంగు మారింది. ఆయనపై విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అనుమానంతో నేను మీకు ఫోన్‌ చేశాను’’ అన్నాడు డాక్టర్‌. విజయ్‌కి ఒక విషయం అర్థం కాలేదు. ఇంటి ముఖద్వారానికీ, పెరటి వాకిలికీ లోపలి నుంచి గొళ్లెం వేసి ఉంది. అలాంటప్పుడు హంతకుడు ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు? హత్య చేసి బయటకు ఎలా వెళ్లాడు? అసలిది హత్య కాదేమో! చలపతిరావు గుండెపోటు వల్ల మరణించి ఉంటాడేమో అనుకున్నాడు. తండ్రి మరణవార్త తెలియగానే చలపతిరావు పెద్దకొడుకు రాజేష్‌ తన భార్యతో కలసి అక్కడకు వచ్చాడు. తండ్రి శవం పక్కన కూర్చుని భోరున ఏడవసాగాడు. తర్వాత తమ్ముడు రమేష్‌ని చూడగానే కోపంగా లేచాడు. ‘‘ఈ దుర్మార్గుడే నా తండ్రిని చంపాడు. వీడు నా సొంత తమ్ముడు కాదు. వీడొక అనాథ. నాన్నగారు జాలిపడి వీణ్ణి దత్తత తీసుకున్నారు. పెంచిన తండ్రినే పొట్టన పెట్టుకున్నాడు. వీణ్ణి ప్రాణాలతో వదలను’’ అంటూ రాజేష్‌ రమేష్‌ని కొట్టబోయాడు. పోలీసులు జోక్యం చేసుకుని రాజేష్‌ని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. 

ఫోరెన్సిక్‌ నిపుణులు శవాన్ని పరీక్షించడం ముగించి, విషప్రయోగం వల్ల చలపతిరావు మరణించాడని ధ్రువీకరించారు. ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ఇల్లంతా గాలించాడు. స్టోర్‌రూమ్‌లో ఒక క్లోరోఫాం బాటిల్‌తో పాటు దూది, విషం సీసా, వాడిన సిరంజీ దొరికాయి. హత్య ఎలా జరిగిందో విజయ్‌కి బోధపడింది. హంతకుడెవరో అర్థమైంది. వెంటనే రమేష్‌ని అదుపులోకి తీసుకున్నాడు.∙∙ పోస్ట్‌మార్టం రిపోర్టులో హత్య రాత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది. ముందుగా క్లోరోఫాంతో స్పృహ తప్పించి, తర్వాత సిరంజ్‌తో విషాన్ని ఇంజెక్ట్‌ చెయ్యడం వల్ల మరణం సంభవించింది. సంఘటనా స్థలంతో పాటు ఇంట్లోని మిగతా చోట్ల చలపతిరావు, రమేష్, పనిమనిషి వేలిముద్రలు తప్ప ఇంకెవరి వేలిముద్రలూ లభించలేదు. మరోపక్క ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ఇన్వెస్టిగేషన్‌లో రమేష్‌ నిజంగానే చలపతిరావు దత్తపుత్రుడని తెలిసింది. ఒకప్పుడు రమేష్‌ తల్లిదండ్రులు చలపతిరావు ఇంట్లో పనిచేసేవారు. రమేష్‌ చిన్నతనంలో వారిద్దరూ కరెంట్‌ షాక్‌ వల్ల మరణించారు. అనాథగా మిగిలిన రమేష్‌ని చలపతిరావు దత్తత తీసుకున్నాడు.

తన సొంత కొడుకు రాజేష్‌తో సమానంగా రమేష్‌ని చదివించాడు. తన భార్య పోయాక తనకు ఉన్న ఆస్తుల్ని ఇద్దరికీ చెరిసగం చెందేట్లు వీలునామా రాశాడు. ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ రమేష్‌పై ఎంత బలప్రయోగం చేసినా అతడు నేరాన్ని అంగీకరించలేదు. ‘‘నాలాంటి అనాథకి జీవితాన్ని ప్రసాదించిన దేవుడులాంటి మనిషిని నేనెందుకు చంపుతాను సార్‌! పైగా హత్య చేశాక అంత నిర్లక్ష్యంగా ఆధారాలు వదులుతానా?’’ అని వాదించాడు. విజయ్‌కి రమేష్‌ మాటల్లో నిజాయతీ కనిపించింది. ఎక్కడో పొరపాటు జరిగింది. మరోసారి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఏదైనా క్లూ దొరకొచ్చు అనుకుని మళ్లీ చలపతిరావు ఇంటికి వెళ్లాడు. ఇల్లంతా పరిశీలించాక పెరటి వాకిలి దగ్గరకొచ్చాడు. ఆ వాకిలి పక్కన ఒక పెద్ద కిటికీ ఉంది. పెరట్లోకి వెళ్లి ఆ కిటికీని పరిశీలించాడు. కిటికీకి ఉన్న చెక్కల ఫ్రేమ్‌ మధ్య మెటల్‌ గ్రిల్‌ బిగించి ఉంది. ఆ గ్రిల్‌కి నాలుగు మూలల్లో నాలుగు బోల్టులు ఉన్నాయి. విజయ్‌ కానిస్టేబుల్‌ చేత స్పానర్‌ తెప్పించి ఆ బోల్టుల్ని విప్పించాడు. బోల్టులు విప్పగానే గ్రిల్‌ మొత్తం కిటికీ ఫ్రేమ్‌ నుంచి వేరయిపోయింది. ఇప్పుడా ఫ్రేమ్‌ మధ్యలోంచి ఒక మనిషి సునాయాసంగా లోపలికి దూరవచ్చు.

హంతకుడు ఇంట్లోకి ఎలా దూరాడో విజయ్‌కి ఇప్పుడు బోధపడింది. హంతకుడు ఎవరో కూడా తెలిసిపోయింది. ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ వెంటనే రాజేష్‌ని అరెస్ట్‌ చేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాడు. దెబ్బలకు తాళలేక రాజేష్‌ నిజం కక్కేశాడు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి రమేష్‌ అంటే ద్వేషం. వాడు పెంపుడు కొడుకు అయినా నాన్న వాణ్ణి నాతో సమానంగా ప్రేమించేవాడు. చివరికి తన ఆస్తిపాస్తుల్లో సగం వాడికి చెందేలా వీలునామా రాశాడు. దాంతో నాకు రమేష్‌ని చంపాలన్నంత కోపం వచ్చింది. రమేష్‌ని చంపితే ఆస్తి మొత్తం నాకే వచ్చేస్తుంది. కానీ వాణ్ణి చంపితే పోలీసులు ముందు నన్నే అనుమానిస్తారు. అందుకే నాన్నని చంపేసి ఆ నేరం రమేష్‌ మీదపడేలా పథకం పన్నాను. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు రమేష్‌ హత్యానేరంపై జైలుకెళితే నా పగ చల్లారుతుంది. ఆస్తి మొత్తం నాకే వచ్చేస్తుంది. అందుకే పథకం ప్రకారం విషప్రయోగంతో నాన్నని చంపేశాను.

నిజానికి మా ఇంటి వెనుక కిటికీ గ్రిల్‌ని నేను చాలా కాలం కిందటే బోల్టులతో విప్పడానికి అనువుగా మార్పించాను. నేను తాగి ఆలస్యంగా ఇంటికెళ్లినప్పుడు నాన్న నన్ను చెడామడా తిట్టేవాడు. ఆ బాధ పడలేక ఆ కిటికీని అలా మార్పించి, రాత్రిళ్లు రహస్యంగా కిటికీ తెరిచి, ఇంట్లోకి వచ్చేవాణ్ణి. ఈ రహస్యం నా భార్యకు తప్ప ఇంకెవరికీ తెలీదు. ఆ రోజు రాత్రి ఆ కిటికీలోంచే ఇంట్లోకెళ్లి క్లోరోఫాంతో నాన్నకు స్పృహ తప్పించి, ఆయనకు విషాన్ని ఇంజెక్ట్‌ చేశాను. తర్వాత విషం సీసా, సిరంజిని స్టోర్‌రూమ్‌లో ఉంచి, వచ్చిన దారిలోనే వెళ్లిపోయాను. నా చేతులకు గ్లౌజ్‌ ఉండటం వల్ల ఎక్కడా నా వేలిముద్రలు పడలేదు. మూసిన తలుపుల వెనుక జరిగిన ఈ హత్యా రహస్యాన్ని పోలీసులు ఎన్నటికీ ఛేదించలేరనుకున్నాను. కానీ మీరు ఆ రహస్యం తెలుసుకున్నారు’’ నిరాశగా అన్నాడు రాజేష్‌?
 

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top