అఖిల భూత మహాప్రేత ఐకాస జిందాబాద్! | All past the dead   Engrossed in yourself Zindabad! | Sakshi
Sakshi News home page

అఖిల భూత మహాప్రేత ఐకాస జిందాబాద్!

May 31 2014 11:53 PM | Updated on Nov 6 2018 7:53 PM

అఖిల భూత మహాప్రేత  ఐకాస జిందాబాద్! - Sakshi

అఖిల భూత మహాప్రేత ఐకాస జిందాబాద్!

ఆత్మహత్య చేసుకుని దయ్యాల్లో కలిసిపోవాలన్న కోరిక ఒకటి ఇటీవల నాలో బలంగా మొదలైంది. దీనికో కారణముంది. మొదట్నుంచీ నాకు దయ్యాలంటే సదభిప్రాయం.

నవ్వింత

ఆత్మహత్య చేసుకుని దయ్యాల్లో కలిసిపోవాలన్న కోరిక ఒకటి ఇటీవల నాలో బలంగా మొదలైంది. దీనికో కారణముంది. మొదట్నుంచీ నాకు దయ్యాలంటే సదభిప్రాయం. చిన్నప్పట్నుంచీ చదివిన చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర మున్నగు పుస్తకాల ద్వారా వాటికి దయ్యాశీలత ఎక్కువనీ, బహు స్నేహపూర్వకమైనవనీ  సాహిత్యముఖంగా గ్రహించాను. అవి తమ దయ్యాదృష్టులతో అడవిలో చిక్కుకుపోయినవారికి దారి చూపించడం వంటి సహాయాలు చేయడం, అత్తల బారిన పడ్డ అమాయికపు కోడళ్లపై దయ్యాదాక్షిణ్యాలు చూపి వారిని ఆరడి పెట్టే అత్తలకు బుద్ధి చెప్పి కాపురాలు చక్కదిద్దడం, మారుటితల్లి పెట్టే బాధలనుంచి ఆడబిడ్డలను రక్షించడం వంటి పనులు చేస్తాయని బాలసాహిత్యం ద్వారా కొంత తెలుసుకున్నాను. అంతేకాదు... దుర్మార్గుల పనిపట్టి వాళ్లను సన్మార్గంలో పెట్టడం, పేదసాదలకు నిధులూ, నిక్షేపాలూ గట్రా చూపి వాళ్లు సుఖంగా బతికేలా చేయగల దయ్యాగుణం కూడా వాటి సొంతమన్న దృష్టాంతాలూ నాకు తెలుసు. కాబట్టి వాటి దయ్యార్దహృదయాలను ప్రస్తుతిస్తూ, వాటి ఘనతను కీర్తిస్తూ గతంలో కొన్ని వ్యాసాలూ అవీ రాసి ఉన్నాను కూడా.

 ఇక చచ్చి దయ్యమైతే గాలి నిండిన స్విమ్మింగ్‌పూల్లాంటి ఈ లోకంలో హాయిగా తేలుతూ, తుళ్లుతూ శ్రమలేకుండా సాగిపోవచ్చనే ఆశ కూడా నాలో ఉంది. చచ్చాక... చచ్చినా దేవత మాత్రం కాకూడదనే బలమైన అభిప్రాయమూ ఉంది. ఎందుకంటే... ఆకాశంలో అటూ ఇటూ పరుగులు పెడుతూ, ఎవరైనా గొప్పపనులూ గట్రా చేస్తే పైనుంచి పూలవర్షం కురిపించడానికి వీలుగా పూలబుట్టలు మోయడం తప్ప దేవతలకు వేరే పనేమీ ఉండదు. ఈ మోతబరువుల ఈతిబాధలు నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. అదే దయ్యాలకు అలాంటి బాదరబందీలేమీ ఉండవు.

 అయితే విజ్ఞులైన నాలాంటి వారు తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకూడదనీ, కాస్త ముందువెనకా ఆలోచించాలనీ మరోసారి అనుకున్నా. ‘దూరపు గోరీలు నునుపు’ అన్న సామెత ఉండనే ఉంది కదా. అందుకే దయ్యం అవ్వడం వల్ల ఉండే మంచి చెడులను బేరీజు వేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ ఆలోచనతో  దయ్యాల గురించి కాస్త లోతైన అధ్యయనం మొదలుపెట్టా. దయ్యాలు చాలా మంచివి అన్న అంశంపై నాకు ఎలాంటి భిన్నాభిప్రాయాలూ లేవు. అయితే... దయ్యాల సామాజిక పరిస్థితుల గురించి కర్ణాకర్ణిగా కొంత తెలిశాక పునరాలోచనలో పడ్డ మాట మాత్రం కాస్త వాస్తవం.

 దయ్యాలన్నీ ఒకటి కావనీ... వాటిలోనూ అనేక సామాజిక వర్గాలున్న విషయం తెలిసి కాస్త విచలితుడినయ్యా. దయ్యాలూ, భూతాలూ, పిశాచాలూ, శాకినీ, ఢాకినీ, కామినీ, మోహినీ... లాంటి వర్గాలున్నాయని తెలిసి బాధపడ్డా. మనుషుల్లో ఉండే అగ్ర, నిమ్న జాడ్యాలు దయ్యాల్లోనూ ఉండాలా అని విచారించా. పైగా పతంజలిగారి రచనలు చదివాక గుండుదయ్యాలూ, జుట్టు దయ్యాలూ, పిలకదయ్యాలూ ఉంటాయనీ, వాటిలోనూ కొన్నింటి తాము అగ్రవర్ణ దయ్యాలమనే ఫీలింగ్ కొన్నింటికి ఉంటుందని తెలిశాక మనసుకు కష్టమనిపించింది. అంతేనా... పతంజలి వారి వీరబొబ్బిలి ‘కూరొండుకు తినడానికి దయ్యాలు పనికొస్తాయా, లేదా’ అంటూ తర్కించింది. ఈ విషయమై తమ ఛీఫ్ షెఫ్ వంట్రాజుతో సంప్రదించాలని అనుకుంది. ఎంత పతంజలిగారి కుక్కయితే మాత్రం దయ్యాలను అది కూరొండుకు తినడానికో, కైమా కొట్టుకుని తినడానికో, వేపుడు చేసుకోడానికో పనికొస్తాయా లేదా అంటూ బలిపశువుల్లా చూసిందంటే దయ్యాల దయ్యనీయ పరిస్థితేమిటో ఆలోచించవచ్చు. ఇక అల్లావుద్దిన్ ఓ దయ్యాన్ని తన అద్భుతదీపంలో అరెస్టు చేసి దాంతో కట్టుబానిసలాగా వెట్టిచాకిరీ చేయించుకున్నాడని తెలిసి బాధేసింది. ఇక గురజాడ వారి దాఖలా ప్రకారం ఆ రోజుల్లో పూజారి గవరయ్య లాంటివారు దయ్యాలను సీసాల్లో బంధించేవారని తెలిసి తెగ బాధపడ్డా. మొగుడు దయ్యం, పెళ్లాం దయ్యం ఒకే సీసాలో ఉంటే చిన్న చిన్న దయ్యప్పిల్లలు పుడతాయేమోనంటూ లుబ్ధావధాన్లు కూతురు మీనాక్షి ఆందోళన పడింది కూడానూ. దయ్యాలను బానిసల్లా చూడకుండా వాటిల్లోనూ సమానత్వం అందరూ కోరే రోజు రావాలని మనస్ఫూర్తిగా భావించా.

 ఇక ఇప్పుడు నాకున్న భయమల్లా ఒక్కటే. దయ్యాల సామాజిక జీవనానికి సంబంధించిన ఈ వివరాలన్నీ నేను బయటపెట్టడం వల్ల వాటి మనోభావాలేమైనా దెబ్బతింటాయేమో! అయితే చచ్చాక చచ్చినా దేవత కాకూడదనీ, చచ్చి దయ్యమే కావాలన్న నా కోరికను టెంపరరీగా వాయిదా వేసుకున్నా. ఎందుకంటే మనుషులతో పోలిస్తే దయ్యాలు మంచివన్న మాట మినహాయిస్తే అక్కడ కూడా సామాజిక వర్ణవివక్షా, వర్గవివక్షా ఉన్నాయి కాబట్టి నేను చచ్చే లోపు ‘అఖిలభూత మహాప్రేత ఐక్య కార్యాచరణ సమాఖ్య’ ఒకటి స్థాపించి, దయ్యాల్లో గల వర్గభేదాలను సమూలంగా తుదముట్టించాలని భావిస్తున్నా. అప్పటివరకూ విశ్వపిశాచ సమానత్వం వికసించేలా, సకల భూత సమభావన పరిఢవిల్లేలా విప్లవిస్తాను. నా ఉద్యమం ఫలించాక... ఆ తర్వాత ఇక దయ్యాల్లో దయ్యాన్నై, భూతాల్లో భూతన్నై, ప్రేతాల్లో ప్రేతాన్నై, పిశాచాల్లో పిశాచాన్నై ఆ దయ్యాలోకంలో చిరకీర్తిని గడిస్తాను. అందుకే ఈ కథకు శుభం కార్డు వేయడం లేదు. అప్పటివరకూ దిసీజ్ నాట్ ‘దయ్యెండ్’!
 - యాసీన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement