హిచ్‌షాక్ | alfred hitchcock birth anniversary on 13th august | Sakshi
Sakshi News home page

హిచ్‌షాక్

Aug 10 2014 12:51 AM | Updated on Aug 13 2018 4:19 PM

హిచ్‌షాక్ - Sakshi

హిచ్‌షాక్

కోడిగుడ్లను చూస్తే, హిచ్‌కాక్‌కు భయమేస్తుందట. భయం అటుండనీ, అవి తిరగబడతాయనిపిస్తుందట! ఏ రంధ్రాలూ లేని ఆ గుండ్రటి తెల్లటి ఆకారం...

సత్వం

ఆగస్టు 13న మేటి దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ జయంతి
 
సంభాషణలు కూడా శబ్దాల్లో కలిసిపోయే ఇంకోరకం శబ్దాలు మాత్రమే. కాకపోతే అవి మనుషుల నోట్లోంచి వస్తాయి.

కోడిగుడ్లను చూస్తే, హిచ్‌కాక్‌కు భయమేస్తుందట. భయం అటుండనీ, అవి తిరగబడతాయనిపిస్తుందట! ఏ రంధ్రాలూ లేని ఆ గుండ్రటి తెల్లటి ఆకారం... దాన్ని పగలగొట్టుకుని బయటకువచ్చే పసుప్చచ్చటి సొన... రక్తం కూడా ఉత్సాహం కొలిపేదిగా కనబడుతుందటగానీ, ఈ పసుపురంగు సొన మాత్రం... అమ్మో! అందుకే కోడిగుడ్డును ఆయన ఎప్పుడూ రుచి చూడలేదట! కోడిగుడ్లే కాదు, పోలీసులన్నా ఆయనకు భయమే! ‘నేను పోలీసులకు వ్యతిరేకం కాదు; వాళ్లంటే భయపడతానంతే!’ అంటాడు. కారు నడుపుతూ వెళ్తుంటే ఎక్కడ ‘చలానా’ రాస్తారేమోనని కూడా ఆందోళన చెందుతాడు.
 
దీనికి చిన్న నేపథ్యం ఉంది. ఐదేళ్లప్పుడు హిచ్‌కాక్ బాగా అల్లరిచేస్తే, వాళ్ల నాన్న ఒక నోటు రాసిచ్చి, పోలీసు చీఫు దగ్గరికి పంపాడు. దానిప్రకారం ఐదు నిమిషాలపాటు పిల్లాణ్ని సెల్‌లో పెట్టి, తాళం వేసి, మళ్లీ వదిలేశాడా అధికారి. వదిలేసేముందు, ‘తుంటరి పిల్లలను ఏం చేస్తామో చూశావు కదా’ అని హెచ్చరించడం మరిచిపోలేదు.మూలాల్ని కనుక్కుంటే సమస్య తొలగిపోతుందంటారుగానీ, తనవరకు పోలీసుల భయం అలాగే పేరుకుపోయిందంటాడు.
 
అందుకేనేమో, ఆయన సినిమాల్లో హీరోను అటు నేరస్థులూ ఇటు పోలీసులూ కూడా తరుముతుంటారు. అయితే దానికి హిచ్‌కాక్ ఇంకోలా జవాబిస్తాడు: ‘క్రిమినల్స్ తరుముతుంటే హీరో పోలీసుల దగ్గరికి వెళ్లొచ్చుకదా అనుకుంటారు ప్రేక్షకులు. పోలీసులు కూడా అతడికోసం వెతుకుతుంటే ఇక ఆ అవకాశం లేదుగా!’
 
మూకీల నుంచి సినిమారంగంలో ఉన్న ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్(1899-1980) కెరీర్ సుదీర్ఘమైనది. హింస, భయం, శృంగారం, నేరం, సస్పెన్స్ నేపథ్యంగా ఆయన తీసినవి ప్రత్యేక విశేషణంతో ‘హిచ్‌కాకియన్ మూవీస్’ అయ్యాయి. వెర్టిగో, సైకో, నార్త్ బై నార్త్‌వెస్ట్, రేర్ విండో, ద బర్డ్స్, నొటోరియస్, రెబెకా, డయల్ ఎం ఫర్ మర్డర్, ద ట్రబుల్ విత్ హ్యారీ, ఐ కన్ఫెస్, రోప్, షాడో ఆఫ్ ఎ డౌట్, స్ట్రేంజర్స్ ఆన్ ఎ ట్రెయిన్... కాలంతోపాటు ఆయన సినిమాలు ‘ఎదుగుతున్నాయి’. ‘విమర్శకులు ఎప్పుడూ నా సినిమాల్ని మొదటిసారి ఇష్టపడలేదు. సైకో విడుదలైనప్పడు ఒక లండన్ విమర్శకుడు అది నా కెరీర్ మీద మచ్చలాంటిది అన్నాడు. అదే సినిమాను ఏడాది తర్వాత క్లాసిక్ అన్నారు’ అని పేర్కొన్నాడు.
 
‘ఎవరిని వారు కాపీ కొట్టుకోవడమే శైలి’ అని జోకులేసే హిచ్‌కాక్- ఎన్నో అధునాతన మెళకువల్ని సినీరంగానికి నేర్పాడు. ఆయన ఇచ్చినన్ని ఇంటర్వ్యూలు ఎవరూ ఇవ్వలేదు. మరో సుప్రసిద్ధ దర్శకుడు ఫ్రాంకోయిస్ ట్రుప్ఫాట్ ఆయన్ని చేసిన ‘50’ గంటల ఇంటర్వ్యూ సుప్రసిద్ధం. హిచ్‌కాక్ పనితీరు చాలా పద్ధతిగా ఉండేది. సెట్లో కెమెరాలోంచి చూడ్డానికి ఇష్టపడడు. తనకు కావాల్సిందేమిటో కెమెరామన్‌కు బాగా తెలుసంటాడు. అవసరమైతే ‘దీర్ఘచతురస్రం’ గీసిస్తాడు. షాట్ కంపోజిషన్ అంటే పూరించాల్సిన దీర్ఘచతురస్రమే కదా!
 
నిజానికి ఆయనకు కథ రాసుకున్నప్పుడే మానసికంగా సినిమా పూర్తయిపోతుంది! వారాలకు వారాలు స్క్రిప్టు మీద కూర్చుని, షాట్స్ కూడా విభజించి, అవసరమైన చోట బొమ్మలేసి... కాగితం మీదే మొత్తం పూర్తయిపోతుంది! కాకపోతే, ఇంగ్లండ్ నుంచి అమెరికా వచ్చాక, తన పాతపద్ధతికి కొంత సడలింపు ఇచ్చానంటాడు. ‘అంత డీటైల్డ్‌గా అమెరికన్ రచయితలు వర్కు చేయరు’.
 
అలాగే, నటీనటుల కళ్లే కథ చెప్పాలని ఆయన భావిస్తాడు. ‘సంభాషణలు కూడా శబ్దాల్లో కలిసిపోయే ఇంకోరకం శబ్దాలు మాత్రమే. కాకపోతే అవి మనుషుల నోట్లోంచి వస్తాయి.’ అలాగని, ఎక్కువ వ్యక్తీకరణల్ని కూడా ఆయన ఇష్టపడడు. ఎన్నో భావాలు ముఖంలో పలికితే- ప్రేక్షకుడు దేన్నని పట్టుకోవాలి? కాగితం మీద ఎక్కువ అక్షరాలుంటే దేన్నని చదువుతాం? తెల్లజాగా ఉంటే చదవడానికి హాయిగా ఉంటుంది.

రాతలో పదాల్ని మితంగా వాడినట్టే, నటనలోనూ వ్యక్తీకరణ మితంగా ఉండాలంటాడు. దర్శకుడు కాకపోయివుంటే హిచ్‌కాక్ మంచి సంపాదకుడు అయ్యుండేవాడేమో! కాకపోతే, ఆయనమాత్రం క్రిమినల్ లాయర్‌కు ఓటేస్తాడు. ‘విలన్ పూర్తి చెడ్డవాడు కాదు; హీరో పూర్తి మంచివాడు కాదు’ అని విశ్వసిస్తాడు కాబట్టి.
 
ఇన్ని చెబుతాడు కాబట్టి, హిచ్‌కాక్‌కు ఎలాంటి నేరబుర్ర ఉంది? ఎప్పుడైనా హత్య చేశాడా? అండీ వార్‌హోల్ ఈ ప్రశ్నలు అడిగాడు కూడా. ‘నా ఉద్వేగాలేవీ నా పాత్రలు ప్రకటించవు. నేను వాటితో ఐడెంటిఫై కాను’ అని చెబుతాడు హిచ్‌కాక్. ‘వస్తువు కన్నా నాకు శైలి ప్రధానం. అది మాత్రమే ఒకరిని కళాకారుణ్ని చేస్తుంది. ఒక చిత్రకారుడు చిత్రించాలి కాబట్టి పళ్లబుట్టను వేసినట్టుగా- నాకు కథ అనేది కేవలం సినిమాను మలుచుకోవడానికి ఒక అంశం’ అంటాడు. ఆ లెక్కన ఆయన నిజమైన కళాకారుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement