త్రివిక్రమ్ శ్రీనివాస్
టాలీవుడ్‌కి మాటలు నేర్పిన మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన రేటు అమాంతం పెంచేశారు.
టాలీవుడ్‌కి మాటలు నేర్పిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన రేటు అమాంతం పెంచేశారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు పట్టుమని పది కూడా లేవు. అయినా పారితోషికం విషయంలో ఆయన రేంజ్ బాగా పెరిగిపోయింది. రచయితగా, దర్శకుడిగా సమర్థతే ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టింది. సాహిత్యంపై మంచి పట్టు ఉన్న త్రివిక్రమ్ రూపొందించిన చిత్రాలు ఆరు మాత్రమే. వాటితోనే ఆయన రేంజ్ ఓ స్థాయికి వెళ్లిపోయింది. 7వ సినిమాకు ఏకంగా 16 కోట్ల రూపాయలు తీసుకోబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. సత్తా ఉన్న రచయిత, దర్శకుడు ఆ మాత్రం పెంచడం సహజం.
త్రివిక్రమ్ తన డైలాగ్స్తో తెలుగు సినిమాను కొత్తమార్గం పట్టించారు. భారీభారీ డైలాగ్స్తో నడిచే తెలుగు సినిమా స్థితిని తన తూటాల వంటి మాటలతో పూర్తిగా మార్చివేశారు. తక్కువ మాటలతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే అర్ధవంతమైన డైలాగ్స్ రాశారు. తన మాటలను పంచ్లుగా మార్చే ప్రయోగంతో త్రివిక్రమ్ అద్వితీయమై విజయం సాధించారు. ఇంకేముంది, తెలుగు తెరకు మాటల మాంత్రికుడిగా మారిపోయాడు. 2002లో తరుణ్ హీరోగా నటించిన 'నువ్వే నువ్వే' తో మొదలు పెట్టి నిన్నటి ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేసిన 'అత్తారింటికి దారేది' వరకూ దాదాపు 11 ఏళ్లలో త్రివిక్రమ్ కేవలం ఆరు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. ఈ ఆరిటితోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయారు. ఎంత అదృష్టం కలిసి వచ్చినా, సమర్ధత ఉన్న దర్శకుడు త్రివిక్రమ్.
త్రివిక్రమ్ హీరోల జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ బన్నీ వంటి వారు మాత్రమే ఉన్నారు. అయినా టాలీవుడ్ హీరోలంతా త్రివిక్రమ్ సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారంటే అతని క్రేజ్ తెలుసుకోవచ్చు. సూపర్ హిట్ ఇచ్చిన అత్తారింటికి దారేది సినిమా తరువాత ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్తో ఓ మూవీ చేస్తున్నారు. ఆ చిత్రానికి త్రివిక్రమ్కు 12 కోట్ల రూపాయల పారితోషికంతోపాటు లాభాలలో వాటాతో కలుపుకొని దాదాపు 16 కోట్ల రూపాయలు ముడుతున్నట్లు టాలీవుడ్ టాక్.
-శిసూర్య


