నవ్విస్తూనే చురకలేసే.. కార్టూనిస్ట్

నవ్విస్తూనే చురకలేసే.. కార్టూనిస్ట్


అప్‌కమింగ్ కెరీర్ : మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పత్రికల్లో తనపై వచ్చిన కార్టూన్లను కత్తిరించి, దాచుకొనేవారట. ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్ కుంచె నుంచి జాలువారిన ‘కామన్ మ్యాన్’ విగ్రహంగా మారి, కార్టూనిస్ట్‌ల గౌరవం పెంచాడు. మనదేశంలో అన్ని భాషల్లో ప్రసార మాధ్యమాలు విస్తరిం చడంతో కార్టూనిస్ట్‌లకు గిరాకీ పెరిగింది. వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, టీవీ ఛానళ్లు వంటి వాటిలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. వార్తాపత్రికల్లో పనిచేసే కార్టూనిస్ట్ లు జర్నలిస్టుల కంటే ఎక్కువ పాపులర్ కావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం యానిమేషన్, గ్రాఫిక్స్, అడ్వర్‌టైజ్ మెంట్ రంగాలు, ఇంటర్‌నెట్, కామిక్స్ బుక్స్ ప్రచురణ సంస్థల్లోనూ కార్టూనిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది.

 పాఠకులకు నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయే కార్టూన్ వేయడం ఒక కళ. దీనికి ఎంతో ఊహా శక్తి, పరిశీలనా నైపుణ్యాలు ఉండాలి.  నిత్య జీవితంలో జరిగే సంఘటనల నుంచి తనకు పనికొచ్చే అంశాన్ని గుర్తించగల నేర్పు ఉండాలి. కార్టూన్ల ప్రధాన ఉద్దేశం.. నవ్విస్తూనే సున్నితంగా చురకలేయడం. కాబట్టి హాస్యరసాన్ని కాచి వడబోసిన వారే మంచి కార్టూనిస్ట్‌గా త్వరగా గుర్తింపు పొందగలుగుతారు.  మనదేశంలోని విద్యాసంస్థల్లో కార్టూన్ల కోసం ప్రత్యేకంగా కోర్సులు లేకపోయినా పెయింటింగ్‌లో భాగంగా వీటిపై శిక్షణ ఇస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్ సంస్థల్లో పెయింటింగ్ కోర్సులు ఉన్నాయి.   

 

 అర్హతలు

 కార్టూనిస్ట్‌గా కెరీర్‌లో స్థిరపడాలనుకొనేవారికి పదో తరగతి, ఇంటర్మీయెట్ పూర్తిచేసిన తర్వాత పూర్తిస్థాయి డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి. కొన్ని సంస్థలు స్వల్పకాలిక కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి.

 

 వేతనాలు

 ఫ్రీలాన్స్ వర్క్ చేస్తే ఒక్కో కార్టూన్‌కు రూ.250 నుంచి రూ.2000 వేల వరకు అందుకోవచ్చు. వార్తాపత్రిక లేదా మేగజైన్‌లో చేరితే ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా వేతనం లభిస్తుంది.   

 కార్టూనిస్ట్(పెయింటింగ్) కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు

  జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్

 వెబ్‌సైట్: www.jnafau.ac.in

  సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

 వెబ్‌సైట్: www.uohyd.ac.in

  పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ

 వెబ్‌సైట్: http://teluguuniversity.ac.in  

  సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్-ముంబై

 వెబ్‌సైట్: www.mu.ac.in

 

 కళ నిత్యనూతనం

 ‘‘కళాత్మకమైన కోర్సులన్నీ నిత్యనూతనమే. అయితే మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అప్‌డేట్ కావటంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఎంతబాగా సృజనాత్మకతను ప్రదర్శించగలిగితే కళాకారుడికి అంత గొప్ప పేరు, ప్రఖ్యాతులు వస్తాయి. చిత్రకళలో అవకాశాలకు కొదవలేదు. ఎప్పటికప్పుడు ప్రతిభను నిరూపించుకోవడం పైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. కార్టూనిస్ట్‌లు టీచర్స్‌గా, ఫ్రీలాన్సర్‌లుగా, మీడియా రంగంలో దేశ, విదేశాల్లో పనిచేయవచ్చు’’

 - కప్పరి కిషన్, ఆర్ట్ ఇన్‌స్ట్రక్టర్, తెలుగు విశ్వవిద్యాలయం

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top