Sakshi News home page

టిడిపికి ఇప్పుడే తెల్లారింది!

Published Wed, Oct 1 2014 3:23 PM

ఎన్టీఆర్ - Sakshi

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడే తెల్లారింది.  విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరే విషయంలో అనేక విమర్శలు తలెత్తడంతో ఆ పార్టీలో ఇప్పుడే కదలిక వచ్చింది. ఎన్టీఆర్కు భారతరత్న  ఇవ్వాలని ఈరోజు జరిగిన ఏపి మంత్రి మండలి సమావేశంలో తీర్మానించారు.  అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ సంచనాలు సృష్టించిన ఘనుడు ఎన్టీఆర్. సినిమా రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజకీయ రంగంలో తెలుగు జాతి ఖ్యాతిని దశదిశల వ్యాపింపజేసిన నేత. అటువంటి నేతకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం భారత రత్న ఇవ్వలేదు.

ఇప్పుడు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ఆ పార్టీలోనే వున్నారు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. అంతే కాకుండా  కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారుగా కూడా ఆయన ఉన్నారు. ఇన్ని అనుకూలతలు ఉన్న పరిస్థితులలో ఎన్టీఆర్కు భారతరత్న రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతటి సువర్ణ అవకాశం ఉన్న సమయంలో టిడిపి అసలు ప్రయత్నాలే చేయలేదు.

భారతరత్న అవార్డు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన జాబితాలో. ఎన్టీఆర్ పేరే లేదు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గతంలో పార్టీ మహానాడులో భారతరత్న అవార్డు కోసం ఎన్టీఆర్  పేరు పంపించాలని తీర్మానం చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో  ఏర్పాటైన కమిటీ  పద్మ అవార్డుల కోసం ప్రతిపాదించిన జాబితాలో ఎన్‌టీఆర్ పేరు భారతరత్నకు సిఫారసు చేయకపోవడం అందరికి విస్మయం కలిగించింది. భారతరత్నకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన చేయలేదు. దీంతో దివంగత ఎన్‌టీఆర్‌కు భారతరత్న అవార్డు దక్కే అవకాశం లేదని ఆయన అభిమానులు బాధ వ్యక్తం చేశారు.  ప్రతిపక్షం కూడా ఈ అంశాన్ని వేలెత్తి చూపింది. ఎన్‌టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇస్తే, నిబంధనల మేరకు ఆ అవార్డును ఆయన భార్య లక్ష్మీపార్వతి అందుకోవలసి వస్తుంది. అలా ఆమె అవార్డు అందుకోవడం ఇష్టంలేక పంపలేదన్న వార్తలు వినవచ్చాయి. ఇందుకు స్పందిస్తూ ఎన్టీఆర్కు భారత రత్న ఇస్తే, దానిని అందుకోవడానికి తాను వెళ్లనని లక్ష్మీపార్వతి ప్రకటించారు. ఎన్టీఆర్కు భారత రత్న కోసం ప్రభుత్వం సిఫారసు చేయాలని ఆమె కోరారు.

అటు అభిమానుల నుంచి, ఇటు ప్రతిపక్షం నుంచి కూడా విమర్శలు రావడంతో చేసేదిలేక ముందుగా జాబితాలో పేర్కొనకపోయినప్పటికీ ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పుడు తీర్మానం చేసింది. ఈ రోజు ఏపి మంత్రి మండలి మూడు తీర్మానాలను ఆమోదించింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఢిల్లీలో స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని ఒక తీర్మానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంపై అభినందిస్తూ మరో తీర్మానం చేశారు.
**

Advertisement
Advertisement