నగ ధగలు... నయా వగలు | Light Weight jewellery New Trend In this Wedding Season | Sakshi
Sakshi News home page

నగ ధగలు... నయా వగలు

Mar 14 2018 8:54 AM | Updated on Aug 3 2018 3:04 PM

Light Weight jewellery New Trend In this Wedding Season - Sakshi

నగల.. వగలు మారుతున్నాయి. కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. సిటీలో జ్యువెలరీ ప్రియులు ఇప్పుడు ‘లైట్‌’ ఆభరణాలను ఇష్టపడుతున్నారు. ఒంటి నిండా దిగేసుకునే నగలకు బదులుగా... హెవీగా కనపడుతూనే లైట్‌గా ఉండే జ్యువెలరీ ట్రెండ్‌గా మారింది. గ్రాండ్‌గా కనపడుతూనే శరీరానికి చిరాకు కలిగించని ఆభరణాలను ఎక్కువ మంది యువతులు కోరుకుంటున్నారు. వీరిఅభిరుచులకు అనుగుణంగా జ్యువెలరీ డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. వేళ్లకు పెట్టుకునే ఉంగరాల నుంచి చెవి రింగులు, బుట్టాలు, మణికట్టు గొలుసులు, ముక్కు పుడకలు, వివిధ రకాలు హారాలు, వడ్డాణాలు కూడా ఇప్పుడు కొత్త రీతిలో తయారవుతున్నాయి.  వేసవితోపాటు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో సిటీలో లైట్‌ జ్యువెలరీకి ఆదరణ బాగా పెరిగింది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌తో పాటు సమ్మర్‌ కూడా కలిసొచ్చింది. దీంతో వేడుకలు జరుపుకునే వారితో పాటు వాటికి హాజరయ్యే ఆభరణాల ప్రియులు సీజనల్‌ జ్యువెలరీ గురించిఅన్వేషిస్తున్నారు. గ్రాండ్‌గా కనపడుతూనే శరీరానికి చిరాకు కలిగించని, హెవీగాఅనిపించని ఆభరణాలను కోరుకుంటున్నారు. వీరి అభిరుచులకు అనుగుణంగా జ్యువెలరీ డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. భారీ ఆభరణాలకు బదులుగా రూపుదిద్దుకుంటున్న ఇవి... ఒకనాటి చిన్న సైజ్‌ ఆభరణాలను భారీగా మార్చేయడం విశేషం.  

సాక్షి, సిటీబ్యూరో: అందాన్ని మెరిపించేందుకు కావొచ్చు.. హుందాగా కనిపించేందుకు కావొచ్చు.. స్టేటస్‌ సింబల్‌ కావొచ్చు... విభిన్న రకాలుగా ఆభరణాన్ని తమ ఆహార్యంలో భాగం చేసుకోవడం సిటీజనులకు సర్వసాధారణంగా మారింది. ఇక వెడ్డింగ్‌ సీజన్‌లో ఈ సరదా శిఖరాలను తాకుతోందని చెప్పడానికి ప్రస్తుతం జ్యువెలరీ షోరూమ్స్‌ దగ్గర కనపడే రద్దీ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అయితే ఇదే సమయంలో ఒంటి నిండా దిగేసుకునే ఆభరణాలకు బదులుగా... హెవీగా కనపడుతూనే లైట్‌గా ఉండే జ్యువెలరీ ఇప్పుడు సిటీలో ట్రెండ్‌గా మారింది.  

మాంగ్‌ టీకా..
బంగారు పూల జడల గురించి మర్చిపోండి. ఇప్పుడు తలపై భాగంలో పెట్టుకునే మాంగ్‌ టీకా అనే ఆభరణం దాని స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. గోల్డ్, డైమండ్‌ ఫ్లాట్, డైమండ్‌ కుందన్‌... ఇది రూ.30వేల నుంచి రూ.2లక్షల దాకా ఉంటుంది. ఫ్యాన్సీగా  కూడా వాడతారు.

హెవీ నుంచి లైట్‌కి..  
కొన్ని ఆభరణాలు భారీగా ఉండాల్సినవి నాజుకుగా మారుతున్నాయి. ఒకప్పుడు మెడ అంటే భారీగా ఉండే బంగారు గొలుసులకు కేరాఫ్‌. అయితే ఇప్పుడు మెడలో ధరించేందుకు బీడ్స్‌తో రూపొందుతున్న నెక్లెస్‌లు వచ్చాయి. పచ్చలు, కెంపులు, పగడాలు, ముత్యాలతో సైడ్‌ పెండెంట్స్, మిడిల్‌ పెండెంట్స్‌ పెట్టి త్రీలైన్, ఫోర్‌లైన్‌ బీడ్స్‌తో డిజైన్‌ చేస్తున్నారు. చూడడానికి పెద్దగా కనపడతాయి.. కానీ ధరిస్తే హెవీగా అనిపించవు. ఇన్‌స్టాంట్‌ రిచ్‌ లుక్‌ అందించే ఇవి రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి.  

సైజ్‌ జీరో...
ఒకప్పుడు వడ్డాణం ధరిస్తే.. దాని నుంచి ఇంకో ఆభరణం మీదకి దృష్టి మళ్లడానికి చాలా టైమ్‌ పట్టేది. అంత భారీగా ఉండేవి. అయితే ఇప్పుడు లైట్‌ వెయిట్‌ వడ్డాణం వచ్చేసింది. దీనిలో కండోలి స్టైల్‌ వడ్డాణం అనేదైతే..  ఒకవైపు మాత్రమే ఉంటుంది. అలాగే మెడలోకి, నడుముకి రెండు రకాలుగానూ ఉపయోగించుకునేంత నాజూకైన నెక్లెస్‌ కమ్‌ వడ్డాణం కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇది రూ.4లక్షల నుంచి ప్రారంభమై ఆపైన ఉంటుంది.

మణికట్టు మెరిసె..మోచేయి మురిసె..  
సన్నగా ఉన్నామా? లేమా అన్నట్టు ఉండే గాజులు, మణికట్టు గొలుసులు కూడా ఇప్పుడు హెవీగా మారిపోయాయి. వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చిన బ్రాడ్‌ బ్రాస్లెట్‌ లేదా బ్రాడ్‌ బ్యాంగిల్‌.. చేతులకు సరికొత్త మెరుపుల్ని అందిస్తున్నాయి. మణికట్టు దగ్గర మొదలై మోచేయి దాకా వ్యాపిస్తూ అటు బ్రాస్లెట్‌ ఇటు గాజులు రెండింటిలాగా అమరిపోయే ఇవి రూ.లక్ష ఆపై ధరల్లో లభిస్తున్నాయి.

వేళ్లకు వెలుగు...
వేళ్లకు పెట్టుకునే రింగ్‌ అంటే బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో చక్కగా అమరిపోయేది  అనుకుంటున్నారేమో... అయితే ఇవి కాక్‌టెయిల్‌ రోజులు. రూపాయి కాయిన్‌ కన్నా కాస్త పెద్దగా పెండెంట్‌ సైజ్‌లో ఉండే కాక్‌టెయిల్‌ రింగ్‌ ఇప్పుడు ట్రెండ్‌. ఈవెనింగ్‌ పార్టీస్‌కి, రిసెప్షన్స్‌... తదితర వేడుకులకు వెళ్లేటప్పుడు ధరిస్తారు. కాబట్టి.. దీనిని కాక్‌టెయిల్‌ రింగ్‌ అని పిలుస్తారు. ఇవి డైమండ్, కుందన్‌ గోల్డ్‌తో తయారవుతాయి. గోల్డ్‌ అయితే రూ.50వేల నుంచి  డైమండ్‌ అయితే రూ.లక్ష నుంచి అందుబాటులో ఉన్నాయి.  

‘చెవులూరించే’..చెవులూగించే..  
ఒకప్పుడు చెవి రింగులు అంటే ఎంత ఉండేవో తెలియంది కాదు. అంగుళం, అరంగుళం సైజ్‌కు మించేవి కావు. అయితే అదే ప్లేస్‌లో చెవులకు పెద్ద సైజ్‌లో వేలాడుతుండే షాండ్లియర్స్‌... ఇప్పుడు అమ్మాయిల హాట్‌ ఫేవరేట్‌. చెవి రింగుల స్వరూపాన్ని అమాంతం మార్చేసింది షాండ్లియర్స్‌ ట్రెండ్‌. చెవికి ఆభరణం ధరించామా? లేకపోతే ఆభరణానికి చెవిని ధరించారా! అన్నట్టు అనిపిస్తుంది. వేసవిలో చికాకు కలిగించే హెవీ జ్యువెలరీకి బదులుగా ఇవి బాగా ఆదరణ పొందుతున్నాయి. కలర్‌ స్టోన్స్‌ రూబీ, ఎమరాల్డ్, కుందన్‌లతో కళ్లు మిరుమిట్లు గొలిపేలా ముఖం మొత్తానికి అందాన్ని అందించే ఈ షాండ్లియర్స్‌లో బోలెడన్ని వెరైటీలు ఉన్నాయి. కనీసం ఒక షాండ్లియర్‌ జత రూ.లక్ష నుంచి రూ.6 లక్షల దాకా అందుబాటులో ఉన్నాయి. ఇవి 30ఏళ్ల లోపు వయసు వారికి మాత్రమే నప్పుతాయి. కాబట్టి యువతులే ఎక్కువగా వినియోగిస్తున్నారు. మధ్య వయస్కుల కోసం రూపాయి కాయిన్‌ సైజ్‌లో ఉండే పెద్ద స్టడ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

నట్‌ ఫర్‌ నోస్‌..  
నాసిక ఎంత నాజూగ్గా ఉంటుందో ముక్కుకు పెట్టుకునే నోస్‌పిక్‌ లేదా ముక్కెర కూడా అంతకన్నా నాజూగ్గా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం అలా కాదు. ఉంగరం తరహాలో ఉండే నట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అమ్మాయిల్లో విపరీతమైన ట్రెండీ ఆభరణం ఈ నట్‌. విభిన్న రకాల స్టోన్స్‌తో ముక్కును మెరిపించే ఈ నట్‌ రూ.10వేల నుంచి అందుబాటులో ఉంది.

సౌకర్యమే ప్రధానం..  
నగలు ధరించాలని కోరుకుంటూనే అదే సమయంలో సౌకర్యానికి కూడా సిటీజనులు ప్రాధాన్యమిస్తున్నారు. కొత్త కొత్త అభిరుచుల క్రమంలో డిజైనర్ల సత్తాకు నిత్యం పరీక్షలు ఎదురవుతున్నాయి. దీంతో ఆభరణాలు రకరకాల మార్పుచేర్పులకు లోనవుతున్నాయి. ఫంక్షన్లకు వెళ్లే సమయంలో హెవీగా కనిపిస్తూనే ఒంటికి మాత్రం లైట్‌గా అనిపించే ఆభరణాలను ధరించడానికి అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు.   – శ్వేతారెడ్డి,జ్యువెలరీ డిజైనర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement