కోతుల కాలేజ్‌లో.. తనొక్కతే ఆడపిల్ల | Sakshi
Sakshi News home page

కోతుల కాలేజ్‌లో.. తనొక్కతే ఆడపిల్ల

Published Wed, Feb 21 2018 12:29 AM

women empowerment :  Inspirational story - Sakshi

‘‘అమ్మాయిలు ధైర్యంగా ఉంటే, తమకు  ఇష్టమైన రంగంలో ఎలాంటి అడ్డంకులను  ఎదుర్కొనైనా గట్టిగా నిలబడవచ్చు’’ 

స్త్రీ శక్తికి సుధామూర్తి ఒక ఎగ్జాంపుల్‌. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌గా, ఉదార హృదయురాలైన సంపన్న మహిళగా మీకు ఆవిడ తెలిసే ఉంటారు. ఆమె జీవితంలో చాలా స్ట్రగుల్‌ ఉంది. అందులో కొంతభాగాన్నైనా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మహిళలం తెలుసుకోవాలి. సుధ ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడు కాలేజీలో తను ఒక్కతే అమ్మాయి. తండ్రిని తీసుకుని సీటు కోసం సుధ కాలేజీకి వెళ్లినప్పుడు ప్రిన్సిపాల్‌ ‘కష్టం అవుతుంది కులకర్ణి గారూ’ అన్నారు. సుధ తండ్రి కులకర్ణి.. డాక్టర్‌. ‘‘డాక్టర్‌ సాబ్‌.. మీ అమ్మాయి ఇంటెలిజెంట్‌ అని నాకు తెలుసు. మెరిట్‌ కారణంగా సీటును ఇవ్వక తప్పడం లేదు. కానీ తనిక్కడ చదవడం కష్టమౌతుందని నా భయం. కాలేజీ మొత్తానికీ తనొక్కతే ఆడపిల్ల. ఇక్కడ లేడీస్‌ టాయ్‌లెట్స్‌ లేవు. లేడీస్‌ రెస్ట్‌రూమ్‌ కూడా లేదు. ఇక రెండో సంగతి. ఇక్కడి బాయ్స్‌! వయసు కదా, వాళ్లను అదుపు చెయ్యడం ఇబ్బందవుతుందేమో’’అన్నారు ప్రిన్సిపాల్‌.

సుధ వెనక్కు తగ్గలేదు. తనకు ఇంజినీరింగ్‌ అంటే ఇష్టం.పైగా తండ్రి సపోర్ట్‌ ఉంది. ఏమాత్రం సంకోచం లేకుండా కాలేజ్‌లో చేరింది. ప్రిన్సిపాల్‌ చెప్పినట్లే సుధ కాలేజ్‌ ఎంట్రీ.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లయింది.. బాయ్స్‌కి. ఆమెను చూసి విజిల్స్‌ వేసేవారు. కన్నడంలో పాటలేవో పాడేవారు. ఫస్ట్‌ బెంచ్‌ ఖాళీగా ఉండేది. అక్కడ కూర్చోడానికి లేకుండా ఇంకు పోసేవారు. అలా సుధ చాలా ఇక్కట్లు పడ్డారు. తొలి పరీక్షలో సుధ యూనివర్సిటీ ఫస్ట్‌ రావడంతో అబ్బాయిల వెర్రి వేషాలకు బ్రేక్‌ పడింది. ‘‘అమ్మాయిలు ధైర్యంగా ఉంటే, తమకు ఇష్టమైన రంగంలో ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొనైనా గట్టిగా నిలబడవచ్చు’’ అని ఆనాటి సంగతులు కొన్నింటిని ‘త్రీ థౌజండ్‌ స్టిచెస్‌’ అనే తన పుస్తకంలో రాసుకున్నారు సుధామూర్తి. సాధారణ వ్యక్తులు, అసాధారణ జీవితాలు అనే అర్థం వచ్చే ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఈ పుస్తకం గత ఏడాది జూలైలో విడుదలైంది. పెంగ్విన్‌ వాళ్లు అనుమతి ఇవ్వడంతో ఇందులోని విశేషాంశాలు ఇప్పుడు పత్రికల్లో కనిపిస్తున్నాయి. సుధ రచయిత్రి, సోషల్‌ వర్కర్‌ కూడా. 

Advertisement
Advertisement