స్త్రీలోక సంచారం

women empowerment - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

జార్ఖండ్‌లోని కుంతీ జిల్లాలో ఈ నెల 19న ఐదుగురు సామాజిక మహిళా కార్యకర్తలపై జరిగిన సామూహిక లైంగిక దాడి కేసును విచారించేందుకు ముగ్గురు జాతీయ మహిళా సంఘం సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. ఉపాధి వలసలు, మానవ అక్రమ రవాణాల పై సామాజంలో అవగాహన కల్పించడం కోసం కుంతీలో ఉన్న ఓ ఎన్జీవో  మహిళా కార్యకర్తలు కొచాంగ్‌ గ్రామంలో వీధి నాటకాలు ప్రదర్శిస్తున్నప్పుడు మోటార్‌బైక్‌ల మీద వచ్చిన ఐదుగురు యువకులు వారిని అపహరించి, వారిపై లైంగిక దాడి చేయడమే కాకుండా వీడియో తీసి.. పోలీసులకు చెబితే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్‌ చేశారు ::: రాజకీయ సమావేశాల కోసం చైనా బయల్దేరిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్న సమాచారం చివరి నిముషం వరకు రాకపోవడంతో తన పర్యటను రద్దు చేసుకున్నారు.

మమతతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక మంత్రి, ఇతర విభాగాలకు చెందిన అధికారులు మొత్తం 50 మంది జూన్‌ 22న చైనా వెళ్లవలసి ఉండగా ప్రయాణ సమయం దగ్గరపడుతున్నప్పటికీ కోల్‌కతాలోని చైనీస్‌ కాన్సులేట్‌ జనరల్‌ నుంచి వారికి ఎటువంటి సమాచారమూ అందలేదు ::: అమెరికా నావికాదళం చరిత్రలోనే అతిపెద్ద ‘లంచం’ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు నిర్ధారణ కావడంతో çశరణ్‌ రేచల్‌ గురుశరణ్‌ కౌర్‌ (52) అనే ప్రవాస భారతీయురాలికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ‘ఫ్యాట్‌ లియోనార్డ్‌’ కుంభకోణంగా పేరు మోసిన ఈ వ్యవహారంలో శరణ్‌తో పాటు మరి కొంత మంది అధికారులకు కూడా కోర్టు శిక్ష విధించింది ::: ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వలసల సమస్యను ఒక్క సమావేశంతో తేల్చేయడం ‘ఐరోపా సమాఖ్య’కు సాధ్యం కాదని జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కల్‌ అన్నారు. ఇందుకోసం ద్వైపాక్షిక, త్రైపాక్షిక, అవసరమైతే బహుపాక్షిక సంప్రదింపులు, సమావేశాలు, సదస్సులు అనేకసార్లు జరగవలసి ఉందని.. 28 దేశాల ఐరోపా సమాఖ్యలో ఒక సభ్యురాలిగా ఉన్న జర్మనీకి ప్రతినిధిగా మెర్కెల్‌ ఈ ప్రకటన చేశారు ::: ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ పోటీలను కవర్‌ చేయడానికి వచ్చిన కొలంబియా మహిళా జర్నలిస్టు జూలియత్‌ గోన్‌జలెజ్‌ థెరాన్‌ను ఒళ్లు తెలియని ఉత్సాహంలో ముద్దు పెట్టుకున్న రష్యన్‌ క్రీడాభిమాని ఆమెకు క్షమాపణ చెబుతూ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. జర్మనీ టీవీకి కరస్పాండెంట్‌గా పని చేస్తున్న ఆ యువతి ఈ వీడియోపై స్పందించి తనను క్షమించిందనీ, ఇక ఈ విషయాన్ని మర్చిపొమ్మని కూడా చెప్పిందని నెట్‌లో అతడు ఇంకో పోస్ట్‌ కూడా పెట్టాడు.

ప్రపంచంలో ఇంత వరకు మహిళా డ్రైవర్‌లను అనుమతించని ఏకైక దేశం సౌదీ అరేబియా ఆదివారం నుంచి ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో మొదటి రోజు సౌదీ నగరంలోని ప్రధాన రహదారులపై మహిళలు తమ డ్రైవింగ్‌తో వాహనాలను స్వేచ్ఛా విహంగాలుగా మార్చేశారు ::: టెక్సాస్‌లోని నిర్బంధ గృహాల్లో ఉన్న బాలల్ని పరామర్శించి, అక్కడి పరిస్థితులను గమనించేందుకు వెళుతూ అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌.. ‘ఐ రియల్లీ డోన్ట్‌ కేర్, డు యు?’ అనే అక్షరాలున్న జాకెట్‌ను «ధరించడంపై ప్రపంచవ్యాప్తంగా అనేక అర్థాలు, విపరీతార్థాలు, విమర్శలు, విశ్లేషణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వరుసలోనే.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆరు నెలల గర్భిణి మీరా రాజ్‌పుట్‌ (బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ భార్య) మెలానియా జాకెట్‌ పైన ఉన్న అక్షరాలను ఉద్దేశిస్తూ, ‘నిజంగానా!’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యంగ్యంగా కామెంట్‌ పోస్ట్‌ చేశారు ::: ఎంటీవీ రియాలిటీ షో ‘స్పి›్లట్స్‌విల్లా’ షూటింగ్‌ కోసం ఉత్తరాఖండ్‌లో ఉన్న బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ అస్వస్థతకు గురి కావడంతో ఉధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లా కాశీపూర్‌లోని ‘బ్రిజేష్‌ ఆసుపత్రి’లో చేర్చారు. కొద్దిపాటి జ్వరం, కడుపునొప్పితో బాధపడుతున్న లియోన్‌కు గ్యాస్ట్రోఎంటరైటిస్‌ సమస్యకు చికిత్స చేస్తున్నట్లు ఆసుపత్రిలో ఆమె కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న డాక్టర్‌ మయాంక్‌ అగర్వాల్‌ మీడియాకు వెల్లడించారు ::: 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top