భక్తి కన్నా జ్ఞానం మిన్న

Wisdom is more than devotion - Sakshi

ఇస్లాం వెలుగు

ఒకసారి షైతాన్‌ ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. వివిధ కేటగిరీలకు చెందిన అనేకమంది శిష్యులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన నివేదికలు శిష్యుల నుండి స్వీకరిస్తున్నాడు. ఒక శిష్యుడు తన కార్యకలాపాలకు సంబంధించిన నివేదికను వినిపిస్తూ,‘తాను ఈరోజు ఒక మనిషితో దొంగతనం చేయించాను.’ అన్నాడు. షైతాన్‌ మంచిపని చేశావు అని వాణ్ణి ప్రశంసించాడు. మరొకడు,’ తాను ఈ రోజు ఒక వ్యక్తిని ప్రార్థనకు వెళ్ళకుండా ఆపాను.’అన్నాడు. దానికి నాయకుడు’ మంచిపని చేశావు.’ అన్నాడు. మరొకడు లేచి, తానీరోజు ఓ కుటుంబంలో కలతలు సృష్టించాను అని వివరించాడు. దానిక్కూడా షైతాన్‌ శహభాష్‌ అని మెచ్చుకున్నాడు. . మరొకడు తన నివేదికను సమర్పిస్తూ, ‘తాను భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాను.’ అన్నాడు.‘భళా మంచిపని చేశావు’అన్నాడు. తాను ఒక మనిషిని చెడువైపునకు ఆకర్షించి అతడితో ఆ చెడుపని చేయించాను’ అన్నాడు మరొకడు. ‘‘నువ్వుకూడా మంచిపనే చేశావు’’ అన్నాడు షైతాన్‌ .ఈ విధంగా షైతాన్‌ శిష్యులు తాము చేసిన ఘనకార్యాలను ఒక్కొక్కరు వరుసగా ఏకరువు పెట్టారు.

 చివరిలో ఒక చిన్న షైతాన్‌ లేచి, ‘‘నాయకా..! నేను వీళ్ళందరి లాగా పెద్దపెద్ద దుష్కార్యాలు, పాపాలేవీ ఎవరితోనూ చేయించలేకపోయాను. కాని ఒక చిన్న పని మాత్రమే చేయగలిగాను.’’ అన్నాడు కాస్త చిన్నబుచ్చుకుంటూ.. ‘‘ఏమిటీ పెద్దపెద్ద పనులేమీ చెయ్యలేకపోయావా? చిన్నపని మాత్రమే చేశావా? చెప్పు ఆ చేసిన ఘనకార్యమేమిటో?’’ అన్నాడు షైతాన్‌.‘‘ఒక బాలుడు పాఠశాలకు వెళుతుంటే మాయమాటలు చెప్పి బడికిపోకుండా చేశాను.’’ అన్నాడు‘‘శభాష్‌ శిష్యా.. శభాష్‌ .. నువ్వు చేసిన పని చిన్నపని కాదు. అసలు పని చేసిందే నువ్వు. అసలు పని అదే. వీళ్ళందరూ చేసింది ఒకెత్తయితే నువ్వొక్కడివి చేసింది మరోఎత్తు. మనిషిని విద్యకు దూరం చేయడం అన్నిటికన్నా గొప్పపని. మనిషి విద్యావిజ్ఞానాలకు దూరమైతే, మనపని సులువవుతుంది. అంతకన్నా ఏం కావాలి? జ్ఞానానికి దూరమైతే మిగిలేది అజ్ఞానమే. ఇక తనంత తానే మనిషి పాపాల్లో, దుర్మార్గాల్లో కూరుకుపోతాడు. అంతకన్నా మనకు కావలసిందేముంది?’అంటూ షైతాన్‌ తన శిష్యుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు.నిజానికి, వేయిమంది దైవభక్తుల్ని బురిడీ కొట్టించడం కన్నా ఒక్క ఆలిమ్‌ను, ఒక్కజ్ఞానిని, పండితుణ్ణి దారితప్పించడం షైతాన్‌కు కష్టమైన పని. అందుకే షైతాన్‌ ఒక ధార్మిక విద్యార్థిని దారి తప్పించడానికి తీవ్రంగా శ్రమిస్తాడు. ధ్యానం చేయకుండా, జిక్ర్‌ చేయకుండా, నమాజులు చేయకుండా, సత్కార్యాలు ఆచరించకుండా, ఎలాంటి మంచిపనులూ చేయకుండా, దుష్కార్యాల్లో, దుర్మార్గాల్లో, పాపాల్లో మానవుడు కూరుకుపోయేలా చెయ్యడానికి షైతాన్‌ ఎంతగా శ్రమిస్తాడో, అంతకంటే అనేక రెట్లు ఎక్కువగా మనుషుల్ని విద్యా విజ్ఞానాలకు దూరం చెయ్యడానికి అవిశ్రాంతంగా, అలుపెరుగని పోరాటం చేస్తాడు. కుట్రలు, కుతంత్రాలు, మాయోపాయాలు, మోసాలకు పాల్పడతాడు.షైతాన్‌ మానవరూపంలో వచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్పి బురిడీ కొట్టిస్తాడు. అందుకే జిత్తులమారి షైతాన్‌ మాయల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముహమ్మద్‌ ప్రవక్త(స)హెచ్చరించారు.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top