 
															చప్పని టిప్పణాలు!
భారతీయ ధర్మానికి స్మృతులు, శ్రుతులు పరమ ప్రమాణాలు. వేదాలు మూడింటినీ శ్రుతులు అంటారు. శ్రుతుల తర్వాత స్మృతులు ప్రామాణికాలు. ధర్మశాస్త్రాలను స్మృతులంటారు.
	 గ్రంథం చెక్క
	 
	 భారతీయ ధర్మానికి స్మృతులు, శ్రుతులు పరమ ప్రమాణాలు. వేదాలు మూడింటినీ శ్రుతులు అంటారు.  శ్రుతుల తర్వాత స్మృతులు ప్రామాణికాలు. ధర్మశాస్త్రాలను స్మృతులంటారు. ఇవి పద్ధెనిమిది ఉన్నాయి. మనుస్మృతి వీటిలో సుప్రసిద్ధం. ఆపస్తంబ, ఆశ్వలాయన స్మృతులు తెలుగునాట ప్రచారమైనవి. ఈ ధర్మశాస్త్రాలకు కూడా టిప్పణాలు ఉన్నాయి. యజుర్వేదులకు ఆపస్తంబ ధర్మసూత్రాలూ, సామవేదులకు గౌతమ ధర్మసూత్రాలూ అనుసరణీయాలు.
	 
	 ధర్మశాస్త్రాలకూ, వేదాలకూ పూర్వులు చేసిన టిప్పణాలు చప్పనివని వేమన గారి నిర్ణయం. ఉప్పూకారం లేని ఆహారాన్ని చప్పిడి అంటాం. చప్పమాటలు అంటే రసహీనము, నిస్సారం అని అర్థం. వేదాలు, ధర్మశాస్త్రాల తరువాత భారతీయులు గౌరవించేది వేదాంతాన్నే.
	 
	 బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత కలిసి ‘ప్రస్థాన త్రయం’ అనే పేరున వేదాంతంలో ముఖ్యమైనవి. బాదరాయణుడు రచించిన బ్రహ్మసూత్రాలకు అన్ని వేదాంత శాఖల వాళ్ళూ భాష్యాలు రాశారు.
	 
	 వేదశాస్త్రములను విరివిగా దా నేర్చి
	 వాదమాడు వాడు వట్టి వాడు
	 సారమైన గురుతు సాక్షిగా నెంచడు
	 విశ్వదాభిరామ వినురవేమ
	 
	 వేదశాస్త్రాలు విరివిగా చదువుకున్నవాడైనా అతని వాదనలు శుష్కవాదనలు ఎందుకవుతాయో వేమన గారు కారణం చెబుతారు.
	 
	 వేదాంతులకు శ్రుతి ఒక్కటే ప్రమాణం. హేతువాదులైన లోకాయతులకు లోకమే ప్రమాణం. వేదాంతులు తర్కానికి ప్రతిష్ఠ (నిలకడ) లేదంటారు. లోకాయతులు అనుమానాది ప్రమాణాలను అంగీకరించక కేవలం ప్రత్యక్ష ప్రమాణాన్నే అంగీకరిస్తారు.
	 - ఆరుద్ర ‘వేమన్న వేదము’ నుంచి.
	 (రేపు ఆరుద్ర వర్ధంతి)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
