గోపురం భగవంతుని పాద నూపురం! | There are Many Features in Every Part of the Temple | Sakshi
Sakshi News home page

గోపురం భగవంతుని పాద నూపురం!

Published Sun, Apr 7 2019 12:21 AM | Last Updated on Sun, Apr 7 2019 12:21 AM

There are Many Features in Every Part of the Temple - Sakshi

ఆలయం అంటేనే సకలదేవతలు అక్కడ కొలువుంటారని భక్తుల నమ్మకం. ఆలయంలోని ప్రతి భాగంలోనూ అనేక విశేషాలు ఉన్నాయి. వాటి అధిదేవతలు కొందరు ఉన్నారు. ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికి వీటిపై కనీస అవగాహన అవసరం. ఆలయాన్ని, ఆలయ భాగాలనూ సాకల్యంగా తెలుసుకోవడం వలన మనకు మరింత ఆధ్యాత్మికత అలవడి భగవదనుగ్రహాన్ని పొందగలుగుతాం.ఉదాహరణకు గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, వాహన మండపం, రంగమండపం, పరివారదేవతలు, కోష్ఠదేవతలు, శిఖరం, విమానం ఇలా అనేక భాగాలున్నాయి. వీటి గురించి ప్రతి భక్తుడూ తెలుసుకోవాలన్న సత్సంకల్పంతో ఇకపై సాక్షి వారం వారం ఆలయంలోని అనేక భాగాలను గురించిన సమగ్ర సమాచారాన్ని అందించనుంది. వాటిలో ముందుగా ఆలయ గోపురం గురించి తెలుసుకుందాం. ఆలయం లేని ఊరిలో  క్షణం కూడా ఉండరాదంటున్నాయి మన ఆగమాలు. భగవంతుడు సదా నివాసముండే చోటే ఆలయం.

అనంత విశ్వమంతా నిండిన భగవంతుని ఉనికిని ఒకచోట చేర్చి, ఆలయం నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించి, సదా అందులో సాన్నిధ్యం కల్పించి భక్తుల్ని బ్రోవమని కోరుతారు అర్చకులు. ఈ సమాజంలో మనిషిని సన్మార్గంలో నిలిపేవి రెండు ఒకటి గుడి, రెండు బడి. నిజానికి పూర్వం బడులు కూడా గుడిలోనే ఉండేవి. ఆలయం కేవలం అర్చనాదులకే పరిమితం కాలేదు. విద్యను నేర్పే పాఠశాలగా, ఆకలి తీర్చే అన్నశాలగా, సంస్కృతిని నిలిపే కళాకేంద్రంగా, ప్రజలసమస్యలను తీర్చే న్యాయస్థానంగా, వసతిని కల్పించే వాసస్థానంగా, ప్రకృతి ఒడిదుడుకులు సమయంలో రక్షణాకేంద్రంగా, సకల వృత్తులవారికీ పని కల్పించే ఉద్యోగ కేంద్రంగా నిలిచింది. ఇలా ఆలయం మానవుని జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. 

కాలిగోపురమే గాలి గోపురంగా
ఆలయంలోని అణువణువునా భగవంతుని ఉనికిని గుర్తించాలి. అయితే, ఆలయం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది గోపురం. చాలా ఎత్తుగా, అనేక అంతస్తులతో, అనేక శిల్పాలతో, చూడగానే భక్తుడికి ఒక పవిత్ర భావాన్ని కల్పించి, మరికాసేపట్లో దేవుడిని దర్శనం చేసుకుంటామనే ఆనందాన్ని కలిగిస్తుంది గోపురం. గోపురాన్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి.ఆలయానికి తొలివాకిలి గోపురం. దీనికే ద్వారశాల అనే పేరు కూడా ఉంది. ద్వారం పైన నిర్మించే నిర్మాణం కనుక ఇది ద్వారశాల. మరికొందరు గాలిగోపురం అని చెబుతుంటారు. గోపురం లోపలికి రాగానే వాతావరణం ఎంత వేడిగా ఉన్నా చల్లటిగాలి వీస్తుంది. బహుశా అందువలన అందరూ ఇలా అంటారని భావించవచ్చు. కానీ నిజానికి ఆలయంలోని ప్రతిభాగం భగవంతుని శరీరభాగంగా కీర్తిస్తున్నాయి ఆగమాలు. అలా గోపురం భగవంతుని పాదాలుగా కీర్తించబడుతున్నాయి. కాలిగోపురం కాలక్రమేణా గాలిగోపురం అయిపోయింది. మనం ప్రయాణాలలో ఉన్నప్పుడు దూరంగా ఆలయం ఉనికిని తెలిపేది ఆలయగోపురమే.

అలా గోపురం కనిపించిన వెంటనే చాలా మంది నమస్కారం చేస్తారు. ఆ నమస్కారం భగవంతునికి తప్పక చేరుతుందని పెద్దలు చెబుతారు. ఎందుకంటే, గోపురానికి నమస్కరిస్తే భగవంతుని పాదాలకు నమస్కరించినట్లే.గోపురం ఒక నిర్మాణం మాత్రమే కాదు. అది పౌరాణిక విజ్ఞానాన్ని తెలిపే పాఠశాల. గోపురంపై అనేక పురాణ ఘట్టాలు శిల్పాలుగా నయనానందకరంగా చెక్కబడి ఉంటాయి. గోపురాలకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి అతి పెద్ద గోపురాలను నిర్మించింది మాత్రం పాండ్యురాజులే. మధురైలోని మీనాక్షీ ఆలయ గోపురాలే అందుకు నిదర్శనం.హంపీ విరూపాక్ష దేవాలయంలో గోపురానికి సంబంధించిన ఒక విశేషం ఉంది. ఆలయంలోని ఒకచోట  తూర్పు రాజగోపురం నీడ తల్లకిందులుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో గల నరసింహ స్వామి ఆలయ గాలిగోపురం కూడా ఎత్తయిన గాలిగోపురాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది. 

కందుకూరి  వేంకట సత్యబ్రహ్మాచార్య,
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement