ఒక రొట్టెకు పది రొట్టెలు

Ten loaves of bread for one loaf - Sakshi

చెట్టు నీడ

హజ్రత్‌ రాబియా బస్రీ ధార్మిక చింతనాపరురాలు. ఒకసారి ఐదుగురు అతిథులు ఆమె ఇంటి తలుపు తట్టారు. వచ్చిన అతిథులకు భోజన ఏర్పాట్లు చేయాల్సిందిగా సేవకురాలికి పురమాయించారు రాబియా. ‘ఇంట్లో తినడానికి కేవలం ఒకే ఒక్క రొట్టె మాత్రమే ఉంది’ అని సేవకురాలు వివరించింది. ‘ఇంట్లో ఉన్న ఆ ఒక్క రొట్టెను ఎవరికైనా దానం చేసేయి’ అని చెప్పింది రాబియా. చెప్పినట్లుగానే సేవకురాలు ఇంట్లో ఉన్న రొట్టెను దానం చేసి వచ్చింది. కాసేపటికే ఎవరో తలుపు తట్టిన శబ్దం. తలుపు తీసి చూడగా..‘ఫలానా ‘రాజుగారు తమకోసం ఆహారం పంపారు’ అనే మాటలు! ఆహార పళ్లాన్ని తీసుకుని సేవకురాలు రాబియాకు అందించింది. వాటిని తెరిచి చూడగా అందులో ఐదు రొట్టెలు ఉన్నాయి. ‘‘ఇవి మన కోసం పంపి ఉండకపోవచ్చు. పొరపాటుగా మన ఇంటికి వచ్చాయి’’ అంటూ రాబియా వాటిని రాజుగారికి తిప్పి పంపేశారు. కాసేపటి తరువాత రెండోసారి ఎవరో తలుపు తట్టిన శబ్దం. మళ్లీ ‘ఫలానా రాజుగారు తమకోసం ఆహారం పంపారు’ అనే మాటలు! వాటిని సేవకురాలు అందుకుని రాబియాకు అందించింది. ఆహార పళ్లాన్ని తీసుకుని చూడగా అందులో ఈసారి ఏడు రొట్టెలు ఉన్నాయి.

‘ఇవి మన కోసం పంపి ఉండకపోవచ్చు. పొరపాటుగా మన ఇంటికి వచ్చాయి’ అంటూ రాబియా తన సేవకురాలితో తిప్పి పంపేశారు. మరికాసేపటికి మూడోసారి తలుపుతట్టిన శబ్దం. సేవకురాలు తలుపుతట్టి చూడగా ‘ఫలానా రాజుగారు మీకోసం ఆహారం పంపారు’ అంటూ ఒక సేవకుడు ఆహార పళ్లాన్ని ఇచ్చి వెళ్లాడు. వాటిని యజమాని రాబియాకు అందించింది. పళ్లెంలో మొత్తం ఈ సారి పది రొట్టెలున్నాయి. ‘‘ఇవి ముమ్మాటికీ మన రొట్టెలే. ముందు వీటిని వచ్చిన అతిథులకు పెట్టు’’ అని సేవకురాలికి పురమాయించారు రాబియా. ‘రాజుగారి సేవకులు రెండుసార్లు ఆహారం తీసుకువస్తే వాటిని తిరిగి పంపడంలో ఔచిత్యమేమిటి?’ అని సేవకురాలు అడిగింది.‘‘ఒక పుణ్యం చేస్తే పదిరెట్ల పుణ్యఫలాన్ని ఇస్తానని అల్లాహ్‌ హామీ ఇచ్చాడు. అందుకే ఒక రొట్టె దానం చేసినందుకు గాను పది రొట్టెలు లభించేదాకా నేను తీసుకోను అని గట్టిగా సంకల్పం చేసుకున్నాను. అందుకే రాజుగారి సేవకులను మాటిమాటికీ తిప్పి పంపాను.’’ అని సేవకురాలి సందేహాన్ని తీర్చారు రాబియా. మనస్సులో ఏదైనా మంచి పని చేయాలని సంకల్పం చేసుకుంటే ఆ పని చేసినంత పుణ్యం మన కర్మల ఖాతాలో జమచేయబడుతుంది. ఆ పుణ్యాన్ని ఆచరణలో పెడితే పదిరెట్ల పుణ్యఫలాన్ని మన ఖాతాలో జమచేస్తాడు అల్లాహ్‌. ఇది దైవవాక్కు. 
– ఉమైమా సిద్దీఖా 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top