దైనందిన జీవితంలోని ఆశనిరాశలు

The Story Of Among Strange Victims Novel - Sakshi

కొత్త బంగారం 

‘ఎమాంగ్‌ స్ట్రేంజ్‌ విక్టిమ్స్‌’ నవల్లో, ప్రధాన పాత్ర అయిన రోడ్రీగో తెలివైనవాడు. కాకపోతే, మధ్యలోనే చదువు ఆపేస్తాడు. తనది కాదనిపించే జీవితాన్ని గడుపుతూ– మెక్సికోలో ఉన్న తన అపార్టుమెంట్లో, పెచ్చులూడుతున్న గోడలని చూడ్డంలోనే సంతృప్తి పొందుతుంటాడు. విమర్శించబడకుండా గడిపే నిదానమైన జీవితం అతడికి ఇష్టం. ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో తిరగాడే కోడిని గంటల తరబడి చూస్తుంటాడు. ‘నా జీవితంలో జడత్వం నిండి ఉంది. ఒక శనివారం తరువాత వచ్చే మరిన్ని శనివారాల పునరుక్తే అది’ అనుకుంటాడు. 

మ్యూజియమ్‌లో కాపీ ఎడిటరుగా ఉద్యోగం దొరికినప్పుడు అయిష్టంగానే చేరతాడు. ‘నాలెడ్జ్‌ అడ్మినిస్ట్రేటర్‌’ అని తనకు తాను నియమించుకున్న హోదాలో, ‘ఎన్నో గంటలు– ప్రెస్‌ రిలీజులు, కరపత్రాలు’ రాస్తుంటాడు. నాలుగు భాగాలుగా ఉండే ఈ నవల్లో, ‘పెళ్ళి చేసుకోవడం మహాపరాధం’ అని తల్లి ఏడెలా చెప్తుందని తెలిసిన తరువాత కూడా, యాదృచ్ఛికంగా సిసీలియాను పెళ్ళి చేసుకుంటాడు. ‘సిసీలియాతో కలిసి జీవించడం నన్ను నేను పెట్టుకుంటున్న హింసే. నా పట్ల ఆమె తిరస్కారం వారం వారానికీ పెరుగుతోంది’ అనుకుంటాడు. 

ఆర్థిక సంక్షోభం వల్ల ఉద్యోగం పోయినప్పుడు, భార్యను తప్పించుకోడానికి తమ ఊర్లో ఉన్న తల్లి వద్దకి వెళ్తాడు. ఏడెలా పీహెచ్‌డీతో పాటు అనేకమైన డిగ్రీలు ఉన్న స్త్రీ. అక్కడ తల్లి ప్రేమికుడైన స్పెయిన్‌ దేశస్తుడు మార్సేల్లో కనిపించినప్పుడు, రోడ్రీగోకి ‘ఆలస్యంగా నిద్రలేచి, లోబట్టలు మాత్రమే వేసుకుని, సీసానుండే నేరుగా చీదరపుట్టించే పాలు తాగడానికి వంటింట్లోకి వెళ్ళే సౌకర్యం’ లేకుండా పోతుంది. తల్లికీ, మార్సేల్లోకీ మధ్య ఉన్న అన్యోన్యత చూసిన తరువాత, భార్య గుణాలని పునఃపరిశీలిస్తాడు రోడ్రిగో. సిసీలియా– జోనాథన్‌ లివింగ్‌ సెగల్‌ పుస్తకాలు చదవడం అతనికి కంపరం కలిగిస్తుంది.

ఆమె నమ్మే స్వయం సహాయక గురూలు అతనికి నచ్చరు. మార్సేల్లో– రోడ్రీగోకి డ్రగ్స్, టెకిలా, హిప్నాటిజం లాంటివి పరిచయం చేసినప్పుడు, కథ విపరీత మలుపులు తిరుగుతుంది. వారిద్దరి స్నేహం, రోడ్రీగోను తనమీద తను జాలిపడ్డంనుంచి బయట పడేస్తుంది. ‘ఒంటరితనం ఎప్పుడూ ఒక్కటే. ఒంటరివారు ఒకేలా ఉండరు. ఇతరుల ఎదుట బయటపడకుండా మనం నిగ్రహించుకునే మాటలని, ఎవరూ విననప్పుడు మనం బయటకి చెప్పుకున్నప్పుడు, దానికుండే విలువ భిన్నమైనది’ అన్న నిశితమైన పరిశీలనలు పుస్తకం పట్ల కుతూహలాన్ని హెచ్చిస్తాయి.  

‘తన దైనందిన జీవితాన్నే గుచ్చిగుచ్చి పరిశీలించుకునే నిరాశావాది, దాన్ని ప్రేమించగలడా? జీవితాన్ని సంతోషంగా గడపడానికి అవసరం అయినది ఏది!’ అన్న ప్రశ్నలు వేస్తుంది ఈ నవల.
నవల ముగింపు–బాగా చదువుకున్న, ఉన్నత వర్గాలకి చెందినవారి గురించిన మానసిక అధ్యయనంలా అనిపిస్తూ, కథకున్న పోగులన్నిటినీ కలిపి కడుతుంది. వీరు, తమలో గట్టిగా పాతుకుపోయున్న అభిప్రాయాల ప్రకారమే బతకడం వల్ల, ఆ మొండితనమే తమని అవిటివారిగా చేస్తోందని గుర్తించరంటారు మెక్సికన్‌ రచయిత డేనియల్‌ సల్దాన్యా పేరిస్‌.

కోడిని ఖాళీ స్థలంలో చూడ్డం కూడా ఒక విధమైన భాగస్వామ్యమే అంటారు. తనతో తానూ, ప్రపంచంతోనూ సంధానం కనుక్కోడానికి ప్రయత్నించే వ్యక్తి గురించిన హాస్య కథ ఇది. ఈ స్పానిష్‌ నవలని ఇంగ్లిష్‌లోకి అనువదించినవారు క్రిస్టీనా మెక్‌స్వీనీ. 2016లో ‘బెస్ట్‌ ట్రాన్స్‌లేటెడ్‌ బుక్‌ అవార్డ్‌’కు లాంగ్‌లిస్టు అయిన ఈ నవలని ప్రచురించింది కాఫీ హౌస్‌ ప్రెస్‌. 
    - కృష్ణ వేణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top