సారీ శారద

Story about Lockdown changes husband behavior - Sakshi

లాక్‌డౌన్‌లో భర్తలు ఏం చేస్తున్నారు? ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్నారు. ఇంటి పనిలో సాయపడుతున్నారు. ఇంటి వారితో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. కాని ఆ భర్త టెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. వేధిస్తున్నాడు. మందు కోసం మెలి తిరిగిపోతున్నాడు. ఆమెను బాధిస్తున్నాడు. అతను మారాడా? లాక్‌డౌన్‌ అతణ్ణి మార్చిందా?

‘ఆపు. ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకోను’ అన్నాడు కొడుకు. ‘ఏం చేస్తావ్‌’ హుంకరించాడు భర్త. ‘ఏం... చూపించనా ఏం చేస్తానో’ ముందుకు వచ్చాడు కొడుకు. ‘రేయ్‌’ హడలిపోతూ కేక పెట్టింది ఆమె.
‘ఎందుకురా మీ ఇద్దరూ నా ప్రాణం తింటారు. మీ వల్ల నేను చచ్చేలా ఉన్నాన’ ఏడ్చిందామె. కొడుకు వెనక్కు తగ్గాడు. అతడు కూడా నోరు మూసుకున్నాడు. ఇద్దరూ వారి వారి గదుల్లో దూరారు. కాని హాల్లో ఆమె ఊపిరాడని భావనతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
∙∙
కొడుకు సైకియాట్రిస్ట్‌తో వీడియో కాల్‌లోకి వచ్చాడు.
‘డాక్టర్‌. మీరే మా అమ్మను కాపాడాలి’ అన్నాడు.
‘వివరాలు చెప్పండి’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.

‘మా అమ్మ తీవ్రంగా డిప్రెషన్‌లో ఉంది. చాలా భయపడుతూ ఉంది. మా నాన్న ఆల్కహాలిక్‌. లాక్‌డౌన్‌ వల్ల మందు దొరకడం లేదని చాలా అలజడి సృష్టిస్తూ వచ్చాడు. చీటికీమాటికీ మా అమ్మను విసుక్కుంటున్నాడు. విత్‌డ్రాయల్‌ సింప్టమ్స్‌ వల్ల మొన్న నాలుగు రోజుల పాటు హాస్పిటల్‌లో మా నాన్నను అడ్మిట్‌ చేస్తే అక్కడే ఉండి మా అమ్మ సేవ చేసింది. అయినా మా నాన్న మారలేదు. ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మా అమ్మకు ఈ ప్రెజర్‌ ఉంది. దాంతోపాటు హాస్పిటల్‌లో ఉన్నందువల్ల తనకు కరోనా వచ్చేసుంటుందని భయపడుతోంది. మా అమ్మకు నేను ఒక్కగానొక్క కొడుకును. నాకెక్కడ కరోనా వస్తుందోనని ఇంకో భయం. ఇవన్నీ కలిసి మా అమ్మను కుంగదీస్తున్నాయి. మీరే కాపాడాలి’ అన్నాడు కొడుకు.
‘అలా అయితే మీ అమ్మతోపాటు మీ నాన్నకు కూడా కౌన్సెలింగ్‌ ఇవ్వాలి’
‘ఆయన ఎటుపోయినా çపర్వాలేదు డాక్టర్‌. మా అమ్మను కాపాడండి’ అన్నాడు కొడుకు.
‘అదేంటి. అలా అంటావు?’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.
కొడుకు కాస్త పాజ్‌ తీసుకొని అన్నాడు–
‘ఆయన మా నాన్న కాదు డాక్టర్‌. మా అమ్మకు రెండో భర్త’.
∙∙
శారదకు ఇరవై ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. మేనమామ వరుసైన వ్యక్తితో జరిపించారు. వయసు తేడా ఉంది. అతనికి శారదతో ఎటువంటి మానసికమైన అనుబంధం ఏర్పడలేదు. నిలకడ లేని మనిషి. శారద ఉద్యోగం మీద ఆధారపడాలని చూసేవాడు. ఇవన్నీ చూసి శారద ఐదేళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకుంది. అప్పటికే ఆమెకు కొడుకు పుట్టాడు. విడాకుల తర్వాత దాదాపు పన్నెండు పదమూడేళ్ల పాటు కొడుకే లోకం అనుకుంది. కాని ఆ ఒంటరి బతుకు ఆమెను లోలోపల పీల్చి పిప్పి చేసింది. ఇంటి పనితో ఆఫీస్‌ పనితో కొడుకును చూసుకోవడంలో అలసిపోయింది. ఉద్యోగానికి రాజీనామా చేసింది. సరిగ్గా ఆ సమయంలోనే కృష్ణారావు పరిచయం అయ్యాడు. అతను కూడా డైవొర్సీ. ఇంటికి వస్తూ పోతూ శారదతో, ఆమె కొడుకుతో చనువు పెంచుకున్నాడు. శారద జీవితంలో అతని పరిచయం కొంత ఉత్సాహం తెచ్చింది. కొడుకు అది గమనించాడు. కుంగిపోయిన తల్లి కొంత మామూలు మనిషి కావడానికి ఇతడు సహకరిస్తాడనుకున్నాడు. అందుకే రెండో పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ఓకే చెప్పాడు. కృష్ణారావు, శారద ల పెళ్లి జరిగిపోయింది. అతడు మంచివాడే. ఉద్యోగం కూడా శ్రద్ధగా చేస్తాడు. కాని అతనికి తాగుడు వ్యసనం ఉందని పెళ్లి తర్వాత తెలిసింది. తల్లీ కొడుకు ఇద్దరూ హతాశులయ్యారు. కాని, అప్పటికే సరిదిద్దుకోలేని విధంగా వారతన్ని తమ జీవితంలోకి తెచ్చేశారు.
∙∙
లాక్‌డౌన్‌ దేశం మీదే కాక ఆ ఇంటి మీద కూడా కఠిన సమయాన్ని తెచ్చింది. బయట అన్నీ బంద్‌ అయ్యాయి. అతనికి మందు బంద్‌ అయ్యింది. విత్‌డ్రాయల్‌ సింప్టమ్స్‌తో అతని ప్రవర్తన మారింది. అప్పటికే గుర్రుగా ఉన్న కొడుకు దీంతో ఇంకా గుర్రుగా మారాడు.
‘అమ్మా.. అతన్ని వదిలేయ్‌. ఇంటి నుంచి పంపేయ్‌’ అని తల్లి మీద ఒత్తిడి పెంచారు.
‘ఒరే... ఒక పెళ్లి అలా అయ్యిందని అతి కష్టం మీద ఇంకో పెళ్లి చేసుకున్నాను. ఏదో బలహీనత ఉందని దీనిని ఎక్కడ పాడు చేసుకునేదిరా’ అని ఆమె బాధ.
ఇటు కొడుకు నుంచి ఒత్తిడి, అటు భర్త పెట్టే బాధ, దానికి తోడు హాస్పిటల్‌లో ఉండి రావడం వల్ల కరోనా వస్తుందనే భీతి... ఇవి ఆమెను పీల్చి పిప్పి చేస్తున్నాయని గ్రహించాడు సైకియాట్రిస్ట్‌.
∙∙
సైకియాట్రిస్ట్‌.. ముందు శారదతోటి ఆ తర్వాత కొడుకుతోటి మాట్లాడాడు.
‘శారద గారూ.. మీరు కరోనా భయాన్ని తీసేయండి. అది వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ప్రయారిటీ మీ భర్తకు ఇవ్వాలి. అతణ్ణి మీరు మనస్ఫూర్తిగా స్వీకరించాలి. అతడు మీతో మనస్ఫూర్తిగా కలిసిపోవాలి. అప్పుడే మీ కుటుంబం నిలుస్తుంది. దానికి ప్రాముఖ్యం ఇవ్వండి’ అన్నాడు.

ఆ తర్వాత శారద భర్తతో మాట్లాడాడు.
‘కృష్ణారావు గారూ... నిన్న మొన్నటి దాకా మీరు ఒంటరి. ఇప్పుడు మీ జీవితంలో భార్య ఉంది. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకని ఒక కొడుకు కూడా ఉన్నాడు. మీరు ఇదంతా పాడు చేసుకుంటున్నారు. మీ వ్యసనాన్ని అదుపు చేసుకోవడానికి లాక్‌డౌన్‌ మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇన్నాళ్లు కంట్రోల్‌ చేసుకున్నారు. హాస్పిటల్‌ దాకా కూడా వెళ్లొచ్చారు. మెల్లగా దాని నుంచి బయట పడండి. ఒక మందు సీసా కావాలో... ఆనందాన్ని ఇచ్చే ఇద్దరు కుటుంబ సభ్యులు కావాలో ఆలోచించుకోండి. బయట ప్రపంచమంతా ఒత్తిడిలో ఉంటే, ఇంట్లో ఒత్తిడి ఇవ్వడం ఇంగితం ఉన్నవారు చేయాల్సిన పనేనా? మీరేం చిన్నపిల్లాడా?

అందమైన కుటుంబ జీవితంలోనే అసలైన మత్తు ఉందని ఎప్పటికి గ్రహిస్తారు?’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.
లాక్‌డౌన్‌ సడలించారు. వైన్‌షాపులు ఓపెన్‌ చేశారు. ఆ రోజు ఉదయాన్నే బయటకు వెళ్లిపోయాడు కృష్ణారావు. శారద, ఆమె కొడుకు టెన్స్‌ అయిపోయారు. డీలా పడిపోయారు.
గంట తర్వాత వచ్చాడు కృష్ణారావు– రెండు కిలోల చేపల కవర్‌తో.
‘మందు కోసం వెళ్లాననుకున్నావా? సారీ. ఇంకెప్పుడూ నా జీవితంలో అది ఉండదు’ అని మెచ్చుకోలుగా చూస్తున్న కొడుకు భుజం మీద చేయి వేశాడు కృష్ణారావు. ఆ ముగ్గురి మధ్య ఉన్న మానసికమైన లాక్‌డౌన్‌ ఆ రోజుతో ముగిసిపోయింది.

మీ వ్యసనాన్ని అదుపు చేసుకోవడానికి లాక్‌డౌన్‌ మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇన్నాళ్లు కంట్రోల్‌ చేసుకున్నారు. హాస్పిటల్‌ దాకా కూడా వెళ్లొచ్చారు. మెల్లగా దాని నుంచి బయట పడండి. ఒక మందు సీసా కావాలో... ఆనందాన్ని ఇచ్చే ఇద్దరు కుటుంబ సభ్యులు కావాలో ఆలోచించుకోండి. బయట ప్రపంచమంతా ఒత్తిడిలో ఉంటే మీరు ఇంట్లో ఒత్తిడి ఇవ్వడం ఇంగితం ఉన్నవారు చేయాల్సిన పనేనా?’ 

– సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top