పేదింటి నక్షత్రాలు

Special story to poor children's education - Sakshi

చింపిరి బట్టలు వేస్కొని ఎంత గట్టిగా ఎగిరినా.. చేతికి నక్షత్రాలు అందుతాయా?చింపిరి ఒంటికే గానీ ప్రతిభకు కాదు కదా!పేదింట్లో ఉండి, మట్టిలో మాణిక్యాలుగా మారి.. పైన తారకలే అసూయ పడేలా మెరుపులు మెరిసిన..  పదకొండు రాకెట్‌ల కథలివి!

పేదరికం ఒక్కొక్కరికి ఒక్కోరకంగా పరీక్షలు పెడుతుంది. పెద్దవాళ్లు ఈ పరీక్షల్లో నిలబడితేనే పిల్లలు జీవితంలో నెగ్గేది. రెక్కాడితే గాని డొక్కాడని;  కూలి, నాలి చేస్తే తప్ప జానెడు పొట్ట నిండని çపరిస్థితుల్లో పిల్లలను చదివించాలన్న ధ్యాస తల్లిదండ్రులకు ఉండదు. మరికొందరు పిల్లలకు చదువుకోవాలని ఉన్నా, వారికి చదివించే దిక్కు ఉండదు. కొందరికి తల్లి ఉంటే తండ్రి లేక, మరికొందరికి తల్లిదండ్రులు ఇద్దరూ లేక చదువుకోవాలన్న కోరిక తీరదు. ఇలాంటి కష్టాల మధ్యలో చదువు ఆపేసిన బాలికలను అక్కున చేర్చుకుంటోంది కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ). ఈ పాఠశాలల్లో చేరిన పేద, అనాధ బాలికలు ఆకాశమే హద్దుగా అంచలంచలుగా ఎదుగుతున్నారు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదవాలన్న తపన ఉండాలే కాని ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాదని నిరూపిస్తున్నారు. జీవితంలో ఇక చదవలేమనుకున్న స్థితి నుంచి తమ విద్యను కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరిలో కొందరు ఇటీవల ఏకంగా యు.ఎస్‌.లోని ‘నాసా’ను సందర్శించి వచ్చారు. ఆ పిల్లల ప్రతిభకు దక్కిన గుర్తింపు అది.

ప్రతిభకు ప్రత్యేక ఆహ్వానం
చిత్తూరు జిల్లాలోని కసూర్బా పాఠశాలల్లో చదువుకునే తొమ్మిది మంది బాలికలు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఇదే పాఠశాలల్లో చదువుతున్న బాలికలు ఇద్దరు సైన్సులో కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన నాసా అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సులో పాల్గొనేందుకు అర్హత సాధించి, ప్రత్యేక ఆహ్వానం పొందారు. ఇప్పటి వరకు కార్పొరేట్‌ స్కూళ్లకు చెందిన విద్యార్థులు మాత్రమే ఈ పోటీలకు ఎంపికైన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. కాని తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు సాసా సదస్సుకు ఎంపికై రికార్డు సృష్టించారు. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈనెల 21న హైదరాబాదులోని అమెరికన్‌ కాన్సులేట్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా ఈపదకొండు మందీ అత్యున్నత ప్రతిభను కనబరిచారు. దీంతో వీరందరికీ కాన్సులేట్‌ వీసాను మంజూరు చేసింది. ఈ సందర్భంగా అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కెథరీ అడ్డా కూడా విద్యార్థినుల ప్రతిభను ప్రశంసించారు. పట్టుదల ఉన్న పేద విద్యార్థినులను కలవడం గొప్పగా భావిస్తున్నానని చెప్పిన ఆమె ‘చీర్స్‌ టు ఇండియా’ అంటూ అమెరికన్‌ కాన్సులేట్‌ నుంచి అధికారిక ట్వీట్‌ చేయడం విశేషం.

అబ్బురపడిన ‘నాసా’!
దేశంలోని కస్తూర్బా పాఠశాలలు కేంద్ర ప్రభుత్వపు ‘సర్వశిక్ష అభియాన్‌’ కిందికి వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర డైరెక్టర్‌ అయిన జి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కెజిబీవీ రాష్ట్ర కార్యదర్శి పార్వతిదేవి, జిల్లా  బాలికాభివృద్ధి అధికారి శ్యామలాదేవిలతో కలిసి పదకొండు మంది విద్యార్థినులూ ఈ నెల  23న హైదరాబాదులోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో  నుంచి అమెరికా వెళ్లి,  నాసాను సందర్శించారు. ‘అంతరిక్షంలో ఆవాసాలు’ అనే అంశంపై తాము రూపొందించిన నివేదికలను ఆ సదస్సులో ప్రదర్శించారు. అలాగే స్టాన్‌ఫోర్డు యూనివర్శిటీ, కాలిఫోర్నియాలోని సైన్సు కేంద్రం, డిస్నీలాండ్‌లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చారు. 

 

నాసా వెళ్లొచ్చిన కెజీబీవీ విద్యార్థినులు
కె.ప్రీతి: బంగారుపాళెం మండలానికి చెందిన కె.ప్రీతి బైరెడ్డిపల్లె కెజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి చిన్నతనంలోనే గుండెపోటుతో మరణించాడు.  తల్లి మమత దినసరి కూలి. ప్రీతి ‘సఫిషియంట్‌ ప్లేస్‌ ఇన్‌ స్పేస్‌’ అనే అంశంపై నాసాకి పేపర్‌ ప్రజంటేషన్‌ చేసింది. గ్రహ కశలాలు భూమిని తాకడం వల్ల రాక్షస బల్లులు అంతరించినట్లుగానే మానవులు కూడా కాలక్రమంలో భూమిపై అకస్మాత్తుగా ఆవాసాన్ని కోల్పోతారు కనుక అంతరిక్షంలో నివాస స్థలాలపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని నివేదిక పొందుపరిచింది. ఐఎఎస్‌ కావడమే తన లక్ష్యమని ప్రీతి అంటోంది. టి.సాయిశ్రీ: రొంపిచెర్ల కెజీబీవీలో ఏడవ తరగతి చదువుతున్న టి.సాయిశ్రీ తండ్రి శ్రీరాములురెడ్డి దినసరి కూలి. తల్లి సాధారణ గృహిణి. ఈమె ‘అగ్రికల్చర్‌ ఇన్‌ స్పేస్‌’ అనే అంశంపై నాసాకు పేపర్‌ ప్రజంట్‌ చేసి మన్ననలు పొందింది. డాక్టర్‌ కావాలన్నదే తన లక్ష్యమని సాయిశ్రీ అంటోంది. 

ఎం.పూజ: కె.వి.పల్లె కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న పూజ తండ్రి నాగిరెడ్డి దినసరి కూలి. తల్లి సాధారణ గృహిణి. ‘ట్రాన్స్‌ఫోర్టు ఇన్‌ స్పేస్‌’అనే అంశంపై పూజ నాసాలోని సదస్సులో పేపర్‌ ప్రజంట్‌ చేసి  అక్కడి అధికారులచే శభాష్‌ అనిపించుకుంది.  సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడమే తన లక్ష్యమని అంటోంది. 

జి.దివ్య: కె.వి.పల్లె కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న జి.దివ్య తండ్రి జి.దామోదర్‌రెడ్డి దినసరి కూలి. తల్లి సా«ధారణ గృహిణి.  ‘మెటీరియల్‌ యూజ్‌డ్‌ ఇన్‌ స్పేస్‌’ అనే అంశంపై సాసా సదస్సులో పేపర్‌ ప్రజంట్‌ చేసి అక్కడి అధికారుల  ప్రశంసలు పొందింది.  పోలీసు అధికారి కావడమే తన ధ్యేయమని దివ్య చెబుతోంది. 

సైదాబాను: మదనపల్లెకు చెందిన సైదాబాను పుంగనూరులోని మైనార్టీ కేజీబీవీలో  తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి మేనమామ సంరక్షణలో పెరుగుతోంది. ‘అంతరిక్షంలో పరిశ్రమలు’ అనే అంశంపై సదస్సులో పేపర్‌ ప్రజంట్‌ చేసి తన ప్రతిభను చాటుకుంది. సైంటిస్టు కావాలన్నదే తన ఆశయమని సైదాబాను అంటోంది.

కె.రెడ్డిరాణి: కలకడ కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతున్న కె.రెడ్డిరాణి తండ్రి మనోహర వ్యవసాయ కూలి. తల్లి గృహిణి. ‘గ్రోయింగ్‌ ప్లాంట్స్‌ ఇన్‌ స్పేస్‌’ అనే అంశంపై నాసా పేపర్‌ ప్రజంట్‌ చేసి అందరి అభినందనలు పొందింది. డాక్టర్‌ కావాలన్నదే తన లక్ష్యమని రెడ్డిరాణి అంటోంది.

సి.స్నేహ: గంగవరం కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న సి.స్నేహ తండ్రి సి.సుధాకర్‌రెడ్డి దినసరి కూలి. తల్లి గృహిణి. ‘ పుడ్‌ ఇన్‌ స్పేస్‌’ అనే అంశంపై నాసా సదస్సులో పేపర్‌ ప్రజంటేషన్‌ చేసింది. డాక్టర్‌ కావాలన్నదే తమ ఆశయమని స్నేహ అంది.

ఎస్‌.రోష్ని: పుంగనూరులోని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎస్‌.రోష్ని తండ్రి రెడ్డిబాషా ఆటో డ్రైవర్‌. తల్లి గృహిణి.  ‘ఎయిర్‌ ఇన్‌ స్పేస్‌ ’ అనే అంశంపై నాసా సదస్సులో పేపర్‌ ప్రజంటేషన్‌ చేసి శభాష్‌ అనిపించుకుంది. స్టీఫెన్‌ హాకింగ్‌ సిద్ధా్దంతం తమ ప్రయత్నానికి పునాదని రోష్ని అంటోంది. ఐఎఎస్‌ కావడమే తన లక్ష్యమని ఆమె చెబుతోంది.

బి.ప్రత్యూష: నిమ్మనపల్లె కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతున్న బి.ప్రత్యూష తండ్రి వెంకటరమణ సగటు ఉద్యోగి. తల్లి గృహిణి. ‘అంతరిక్షంలో వసతులు’ అనే అంశంపై నాసా సదస్సులో ఆమె పేపర్‌ ప్రజంటేషన్‌ చేసింది. వైద్యరంగంలో రాణించాలన్నదే తన లక్ష్యమని అంటోంది.

చెంచులావణ్య: నెల్లూరు జిల్లా కొల్లపట్టుకి చెందిన ఎం.చెంచు లావణ్య తడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి చెంచయ్య దినసరి కూలి. తల్లి సుజాత గృహిణి. ‘టెంపరేచర్‌’ అనే అంశంపై నాసా సదస్సులో పోస్టర్‌ ప్రజంట్‌ చేసింది. కలెక్టర్‌ కావాలన్నదే తన ధ్యేయమని చెబుతోంది.

వి.అశ్విని: నెల్లూరు జిల్లా గాంధీనగర్‌కు చెందిన వి.అశ్విని, వెంకటగిరి కేజీబీవీలో ఎనిమిదోతరగతి చదువుతోంది. తండ్రి శివశంకర్‌ప్రసాద్‌ వంట మనిషి. తల్లి శాంతి గృహిణి. నాసా సదస్సులో ‘గ్రావిటీ’ అనే అంశంపై పోస్టర్‌ ప్రజంటేషన్‌ చేసింది. డాక్టర్‌ కావాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. 
– మాడా. చంద్రమోహన్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top