అల... భైరిసారంగపురంలో.. | Special Story On Ala Vaikunthapurramuloo Movie Singer Suranna | Sakshi
Sakshi News home page

అల... భైరిసారంగపురంలో..

Jan 26 2020 1:34 AM | Updated on Jan 26 2020 1:34 AM

Special Story On Ala Vaikunthapurramuloo Movie Singer Suranna - Sakshi

డైరక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో సూరన్న

‘‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టుపట్టినాడా ఒగ్గనే ఒగ్గడు’’.. సిక్కోలు యాసతో యూత్‌ని ఆకట్టుకున్న ఈ పాట ఇటీవలే విడుదలైన ‘అల... వైకుంఠపురంలో...’ చిత్రంలోనిది. పాటను సినిమాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జానపద కళాకారుడు బాడ సూరన్న పాడారు. మందస మండలం భైరిసారంగపురం గ్రామానికి చెందిన సూరన్నకు బతుకునిచ్చే చదువు లేదు కానీ.. తన సిక్కోలు యాసతో జానపదాలను బతికిస్తున్నారు!

సూరన్న అసలు పేరు సూరయ్య. గంగిరెద్దుల కుటుంబం. స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు అతడిని చదివించలేదు. ముగ్గురు అన్నదమ్ములు, ఒక అక్క. 15 ఏళ్ల వయస్సులో సూరన్న జీవితం చిన్న మలుపు తీసుకుంది. అప్పట్లో ‘భూమి భాగోతం’ అనే జానపద ప్రదర్శనకు తమ ఊరు వచ్చిన వీరగున్నమ్మపురం గ్రామానికి చెందిన మజ్జి బయ్యన్నతో సూరయ్యకు పరిచయం ఏర్పడింది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల కులానికి చెందిన పదమూడు మందితో బయ్యన్న నాటకాన్ని ప్రదర్శించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నాటకం! మాటలు, పాటలు, హాస్యం కూడా బయ్యన్నే వెనుక నుంచి చెప్పేవారు. ఆ నాటకంలో సూరన్న అనే హీరో పాత్రను సూరయ్య వేస్తుండటంతో ఆయన పేరు సూరన్నగా మారిపోయింది. సుమారు 800 ప్రదర్శనలతో ఆ నాటకం మంచి ప్రాచుర్యం పొందింది!

‘తితిలీ.. తితిలీ..’
సూరన్న గంగిరెద్దులను ఆడిస్తూ.. జానపదాలను పాడుతూ, నాటకాలు వేస్తూ మంచి కళాకారుడిగా పదిమంది దృష్టిలోనూ పడ్డారు. జిల్లాను దాటి, ఇతర జిల్లాలు, ఒడిశా రాష్ట్రంలో కూడా సూరన్న ప్రదర్శనలు ఇస్తుండడంతో మంచి గుర్తింపు వచ్చింది. 350 వరకు జానపదాలకు ఆయన అవలీలగా పాడగలరు. ఇప్పటికి 200 వరకు బాణీలు కట్టాడు. తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లాకు కలిగిన నష్టాన్ని ‘తితీలీ.. తితీలీ.. తుపానమొచ్చి, ఊరు, వాడా వల్లకాడైతే.. శీకాకుళం జిల్లా సిన్నబోయిందే’ అనే తన పాట ప్రతి ఒక్కరి నోట్లో ఆడిందనీ.. ఈ పాటే తన జీవితానికి రెండో మలుపు అయిందనీ సూరన్న అన్నారు. సూరన్న సన్నాయి, సైడ్‌డ్రమ్ము, డోలు వాయిద్యాలు కూడా వాయిస్తారు. సంక్రాంతి సమయంలోనైతే సూరన్న గంగిరెద్దుల ప్రదర్శనకు ఊరూరూ నీరాజనాలు పలుకుతుంది.

సినిమా తెరపైకి
వైజాగ్‌లోని ఆడియో, వీడియో కంపెనీ ‘శ్రీమాతా మ్యూజిక్‌ హౌస్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్లు పల్లి నాగభూషణరావు, బిన్నళ నర్సింహమూర్తి సూరన్న ప్రతిభను గుర్తించి, జానపద పాటలను శ్రీమాతా స్టుడియోలో రికార్డింగ్‌ చేసి, సీడీలు, యూట్యూబ్‌లలో విడుదల చేశారు. వాటిలో.. ‘అల్లుడా గారెండొలా.. బూరెండొలా..’ అనే పాటను యూట్యూబ్‌లో చూసిన సినీదర్శకుడు చిన్నికృష్ణ.. సూరన్నను సంప్రదించి, అన్నపూర్ణ స్టుడియోలో షూటింగ్‌ జరుపుకుంటున్న ‘అల.. వైకుంఠపురంలో...’ సెట్‌కి తీసుకెళ్లారు. ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఎదుట సూరన్నతో జానపదాలను పాడించారు. దాంతో ముగ్ధులైన త్రివిక్రమ్‌ అప్పటికప్పుడు ఇదే సినిమాలో పాడే అవకాశం కల్పించారు.

దీంతో అల వైకుంఠపురంలో పోరాట దృశ్యాలకు సిక్కోలు యాసలో సూరన్న చేత ‘‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టుపట్టినాడా ఒగ్గనే ఒగ్గడు’’.. పాట పాడించారు. ఆ పాటకు సాహిత్యం ఒడిశాకు చెందిన బల్ల విజయ్‌కుమార్‌ సమకూర్చారు. మ్యూజిక్‌ డైరక్టర్‌ తమన్, అసిస్టెంట్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌ శ్రీకృష్ణ.. పాటకు ట్యూన్‌ చెప్పడంతో సూరన్న తన గళం విన్పించాడు. జానపదాన్నే నమ్ముకుని జీవిస్తున్న తనకు సినిమాల్లో అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా ఉందని ‘సాక్షి’తో అన్నారు సూరన్న.

మొట్టమొదటిసారిగా తను విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో కళాభినేత్రి వాణిశ్రీతో సన్మానం పొందానని, అనంతరం ముప్ఫైమంది వరకు ప్రముఖుల చేతుల మీదుగా సన్మానాలు, సత్కారాలు పొందానని సూరన్న చెప్పారు. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ తనకు ఓ స్పెషల్‌ కోటు బహుమతిగా ఇచ్చారని, విశాఖలో జరిగిన సినిమా సక్సెస్‌ మీట్‌ వేదికపై అల్లు అరవింద్‌ తనను హత్తుకోవడం జీవితంలో మరచిపోలేనని, ఇది శ్రీకాకుళం జిల్లాకు దక్కిన గౌరవమని ఆనందంగా అన్నారు.
– కందుల శివశంకర్, ‘సాక్షి’ శ్రీకాకుళం
కొంచాటి ఆనందరావు, ‘సాక్షి’ మందస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement