చెవిన ఇల్లు కడుతున్న మేస్త్రి

Special Story About Maestri Bobjee Of His Helping Towards Poor People - Sakshi

విప్లవ వీరుడు.. అల్లూరి. విప్లవ చిత్రాల కార్మికుడు.. ఆర్‌.నారాయణమూర్తి. మేస్త్రి బాబ్జీకి వీళ్లిద్దరూ ఆదర్శం. ఆ వీరుడి సమర శీలత.. ఈ కార్మికుడి సేవాభావం.. బాబ్జిని నడిపిస్తున్నాయి. చాలాదూరం నడిచాడు. ఇప్పుడు ‘చైతన్యరథం’ ఎక్కాడు. లాక్‌డౌన్‌ కష్టాలను తీరుస్తూ.. కరోనాతో కేర్‌ఫుల్‌గా.. సాటివారితో కనికరంగా ఉండమని చెబుతున్నాడు.

లాక్‌డౌన్‌తో చాలామందికి ఉద్యోగాలకు, ఉపాధికి దూరమై ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏరోజుకారోజు జీవనాధారం వెదుక్కునే చిరుజీవులకైతే పనులే లేకుండా పోయాయి. ఎన్నో కుటుంబాలు పస్తులుంటున్నాయి. అలాంటి వారిని తనకు చేతనైనంతలో ఆదుకునేందుకు ముందుకొచ్చాడు తూర్పుగోదావరి జిల్లాలోని కోటనందూరు గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ లక్కాకుల బాబ్జీ. బాబ్జికి విప్లవ చిత్రాల నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి అంటే అభిమానం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కరోనా కష్టకాలంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు కదిలాడు. ‘అల్లూరి సీతారామరాజు సేవా కమిటి’ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటినుంచి తన మేస్త్రీ మిత్రులను కూడగట్టి వారిచ్చే ఆర్థిక తోడ్పాటుతో తూర్పు, విశాఖ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులు పంచిపెడుతున్నాడు. కోటనందూరు.. తూర్పు–విశాఖ జిల్లాలకు సరిహద్దు గ్రామం.

లాక్‌డౌన్‌ బాధితులకు ఆహార సరుకులు పంపిణీని ప్రారంభిస్తున్న కోటనందూరు పోలీస్‌ అధికారులు
ఏజెన్సీలో ఉన్నవారు తమ అవసరాల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. లాక్‌డౌన్‌ సమయంలో కాలినడకన అలా వస్తున్న ఎంతోమంది బాటసారులు ఆకలితో బాధపడడం చూసిన బాబ్జి వారి కోసం కూడా ఆహార పంపిణీ చేపట్టాడు. అంతేకాదు, వైరస్‌ విస్తరించకుండా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఇప్పుడు నగరాలు, గ్రామాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు కార్యోన్ముఖుడయ్యాడు. తన పాత ద్విచక్ర వాహనాన్ని చైతన్యరథంగా మార్చి మైక్‌ పట్టుకుని సామాజిక దూరం పాటించాలని చెబుతున్నాడు. పరిశుభ్రత పాటించడం ద్వారానే వైరస్‌ను నిరోధించగలం అని అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పటికి దాదాపు 200 గ్రామాలతో పాటు విశాఖపట్నం, కాకినాడ నగరాల్లో ప్రచారం చేశాడు. బాబ్జీ ఇలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి జిల్లాల్లోని కోటనందూరు, అల్లిపూడి గ్రామాల్లో ఆనాడు తిరిగారు. ఆ విషయాన్ని చెప్పేందుకు బాబ్జి గతంలో ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో సీతారామరాజు విగ్రహాలను ఏర్పాటు చేయించి ఆనాటి చరిత్రను నేటి విద్యార్థులకు తెలిసేలా చేశాడు. తనెంతో అభిమానించే ఆర్‌. నారాయణమూర్తి గత ఏడాది జరిగిన ఓ కార్యక్రమంలో తనను అభినందించడం బాబ్జిలోని సామాజిక సేవా భావనను మరింత పురికొల్పింది.
– నానాజీ అంకంరెడ్డి, సాక్షి, హైదరాబాద్‌

ఇది నా బాధ్యత

ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోంది. ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ తోటివారికి సాయం చేస్తున్నారు. నా స్థాయిలో నేను చేయగలిగినంత సాయం అందిస్తున్నాను. ‘కుదిరితే సాయం చేయి గాని ఎవరికీ కీడు తలపెట్టకు’ అని నా గురువు ఆర్‌. నారాయణమూర్తి గారు చెప్పారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. – మేస్త్రీ బాబ్జీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top