జంగం సిస్టర్స్‌ గీతావధానం

Special Story About Jangam Sisters From Vijayawada - Sakshi

అష్టావధానం గురించి విన్నాం. శతావధానం చూశాం. ఈ గీతావధానం ఏమిటి? భగవద్గీత భారతీయుల ఆధ్యాత్మిక సంపద. ఇంకా చెప్పాలంటే ప్రపంచ జనులకు మార్గదర్శి. జీవన సందేశి. భగవద్గీతను ఔపోసన పట్టిన ఇద్దరు అక్కచెల్లెళ్లు గీతావధానం చేస్తున్నారు. మనీష, శిరీష... అనే ఈ అక్కచెల్లెళ్లు ‘జంగం సిస్టర్స్‌’గా గతంలో గణితావధానం చేశారు. ఇప్పుడు గీతావధానం చేస్తున్నారు. ఆపైన నాట్యావధానం కూడా చేస్తారట. ఆ ప్రతిభకు పరిచయం ఇది.

‘‘నేను దూరవిద్యలో తెలుగు ఎంఏ చేస్తున్నాను. సాహిత్య అవధానాలు ఇప్పటికే చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాన్నగారు మాతో రుక్మిణీ కల్యాణం, గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలు కంఠస్థం చేయించారు. తెలుగులో ఇప్పటివరకు సుమారు రెండు వేల పద్యాలు నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటున్నాను. మనుచరిత్ర, మేఘసందేశం కావ్యాలు సంపూర్ణంగా కంఠపాఠం అయ్యాయి. మా నాన్నగారే మా గురువు. ప్రభుత్వ సంగీత కళాశాలలో సంగీతం సర్టిఫికెట్‌ కోర్సు చేశా. మా బాబయ్య జంగం విజయకుమార్‌ మాకు బాల్యం నుంచే కూచిపూడి నాట్యం నేర్పించారు. నేను డాన్స్‌లో డిప్లొమా పూర్తి చేశాను. త్వరలో ఎం.ఏ చేద్దామనుకుంటున్నాను’ అంటూ వివరించారు జంగం సిస్టర్స్‌లోని అక్క మనీషా చక్రవర్తి. అవధానం తెలుగువారి సాహిత్య ప్రక్రియ. ఎనిమిది మంది పృచ్ఛకులతో చేస్తే అది అష్టావధానం. ఈ విధంగా శతావధానం, సహస్రావధానం వరకు చేస్తారు. ఇది తెలుగువారికి సొత్తు. ఇందులోనే గణితావధానం, నేత్రావధానం, నాట్యావధానం వంటి ఎన్నో ప్రక్రియలు కూడా తెలుగువారిని అలరిస్తున్నాయి. వీటన్నిటికీ భిన్నంగా ‘భగవద్గీత అవధానం’ చేస్తున్నారు జంగం సిస్టర్స్‌.

‘నేను పదో తరగతితో చదువు ఆపేశాను. నా ఐదోఏటే మా బాబయ్య మా అక్కకు, నాకు నాట్యం, నాట్యశాస్త్రం కూడా మా బాబయ్యే నేర్పించారు. నాట్యశాస్త్రంలో మొత్తం ఆరువేల శ్లోకాలు ఉన్నాయి. అందులో 3500 శ్లోకాలు కంఠతా నేర్చుకున్నాను. 2021 ఉగాది నాటికి ఆరు వేల శ్లోకాలూ కంఠస్థం చేసి నాట్యావధానం చేయాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఇలా ఏదో ఒకటి సాధన చేయటమే పరమావధిగా సాగుతున్నాం. మా అక్క సాహిత్య అవధానం చేస్తుంటే, నేను నాట్యావధానం చేయడానికి సన్నద్ధురాలిని అవుతున్నాను. అక్క ఐదోతరగతి చదువుతున్నప్పుడు మొట్టమొదటి గణితావధానం చేసింది. నేను మాత్రం ఏడో తరగతిలో మొదలుపెట్టాను. ఇద్దరం కలిసి ఇప్పటివరకు పది అవధానాలు చేశాం’ అని చెబుతారు చెల్లాయి శిరీష. గణితావధానంలో క్యాలండర్‌ మెమరీ అంశాన, ఏ సంవత్సరంలో ఏ తారీకు నాడు ఏ వారం వచ్చిందో చెబుతారు. దత్తపది పేరున పన్నెండు అంకెల సంఖ్యను 7, 13 అంకెతో గుణిస్తే ఎంత వస్తుంది లేదా భాగిస్తే ఎంత వస్తుంది... వంటివి చెబుతారు. చిన్నప్పటి నుంచే తండ్రి జంగం చక్రవర్తి పిల్లలకు యోగా నేర్పించారు. అలాగే పద్యాలు కూడా ఆయనే నేర్పించారు. నాట్యానికి సంబంధించి సంగీత పరిజ్ఞానం అవసరం కనుక, ఈ పిల్లలిద్దరికీ సంగీతం నేర్పించారు. ‘ప్రస్తుతం నేను వయొలిన్‌ నేర్చుకుంటున్నాను, చెల్లి మృదంగం నేర్చుకుంటోంది’ అంటూ తమ గురించి చెప్పుకొచ్చారు జంగం సిస్టర్స్‌. – సంభాషణ: వైజయంతి పురాణపండ ఫోటోలు: నడిపూడి కిషోర్, సాక్షి, విజయవాడ

భగవద్గీత అవధానం...
1. శ్లోకం – సంఖ్య: భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఏ అధ్యాయంలో ఏ శ్లోకం సంఖ్య అడిగితే ఆ శ్లోకం చెప్పాలి.
2. న్యస్తాక్షరి: ఒక శ్లోకంలో అక్కడక్కడ అక్షరాలు ఇస్తారు. చివరకు మొత్తం శ్లోకం చెప్పాలి
3. దత్తపది: ఒక పదం చెప్పి, ఆ పదం ఏ శ్లోకంలోదో, ఎన్నో అధ్యాయంలోదో అడిగితే, దానికి సమాధానం చెప్పాలి. 
4. పాద వ్యతిక్రమం: శ్లోకం తీసుకుని ఏదో ఒక పాదం చెబుతారు. ఆ పాదం ఉన్న శ్లోకం అప్పచెప్పాలి.
5. శ్లోకధార: ఒక అధ్యాయంలో వారు ఒక సంఖ్య చెబుతారు. అంటే రెండు అనే సంఖ్య చెబితే ఆ అధ్యాయంలోని 2, 12, 22, 32 అలా ఆ సంఖ్యల శ్లోకాలు అప్పచెప్పాలి.
6. శ్లోకార్థ తాత్పర్యం: ఏ శ్లోకం అడిగినా దానికి అర్థం తాత్పర్యం చెప్పాలి
7. శ్లోక ఆరోహణ అవరోహణం: ఐదు లేదా పది శ్లోకాలు అడుగుతారు. వాటిని కింద నుంచి పైకి లేదా పై నుంచి కిందకు అప్పగించాలి.
8. ప్రస్తుతి ప్రసంగం: భగవద్గీత మీద అడిగే ప్రశ్నలకు చమత్కార సమాధానాలు చెప్పాలి.

గిడుగు వారి జయంతిని పురస్కరించుకుని, మా పిల్లలు వాళ్ల స్నేహితులతో కలిసి ‘శతకసేన’ పేరున మొత్తం 108 పద్యాలు కంఠస్థం చేస్తున్నారు. వారికి సర్టిఫికేట్లు ఇస్తున్నాం. మా పిల్లలు పిల్లలు జావళీలకు నృత్యం సమకూర్చి ప్రదర్శనలు ఇస్తున్నారు. పిల్లలు ఈ మార్గంలో వెళ్లడానికి నా భార్య వాసవి ఒక మౌన సైనికురాలిగా సహకరిస్తోంది. ఈ భగవద్గీత అవధాన కార్యక్రమంలో మా పిల్లలు ఎనిమిది మంది పండితులను అవధానం ద్వారా ఢీ కొట్టబోతున్నారు. గతంలో అత్యంత క్లిష్టమైన గణితావధానం నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకున్నారు. ఎంతోమంది మా పిల్లలకు ఆశీస్సులు, శుభాకాంక్షలు అందిస్తున్నారు. నేను పంచకావ్యాలను యక్షగానాలుగా రాశాను.

మనుచరిత్రలో పెద్దమ్మాయి ప్రవరాఖ్యుడిగా, చిన్నమ్మాయి వరూధినిగా నటిస్తున్నారు. పిల్లలిద్దరూ ‘నాట్యవేద అకాడెమీ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌ స్థాపించి’ నృత్య దర్శకత్వం కూడా చేస్తున్నారు. భగవద్గీత ధర్మబద్ధంగా జ్ఞానసముపార్జనకు తోడ్పడుతుంది. అందుకే అందులోని 700 శ్లోకాలు పిల్లలకు నేర్పాను. 72 ఏళ్ల వయసులో యడ్లవల్లి మోహన్‌రావు అనే పండితుడితో ఈ ప్రక్రియలో భగవద్గీత అవధానం చేయించాను. ఆయన తనకు వయసు మీద పడుతుండటంతో, ఈ ప్రక్రియను వేరేవారికి కూడా నేర్పమన్నారు. అప్పుడు మా పిల్లలకు నేర్పాను. వారు ఇప్పుడు ప్రథమంగా ఈ రోజు అవధానం చేస్తున్నారు. భగవద్గీతను రెండు నెలల పాటు సాధన చేశారు. మూడో నెలలో అవధాన క్రమంలో వాళ్ల చేత సాధన చేయించాను.
– జంగం శ్రీనివాస చక్రవర్తి, (ఈ చిన్నారుల తండ్రి), తెలుగు పండితులు, విజయవాడ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top