చాలామంది బయటకు చెప్పరు...నేను చెబుతున్నాను!


 కొవ్వొత్తి ... తాను కరుగుతూ... చుట్టూ ఉన్నవారికి వెలుగునిస్తుంది.

 షకీలా కూడా అంతే.

 తన కోసం కన్నా...

 తనను నమ్ముకున్నవారి కోసమే అష్టకష్టాలు పడింది.

 పైకి సీతాకోక చిలుకలా కనిపించే ఈ గొంగళి పురుగు లాంటి

 గ్లామర్ ప్రపంచంతో ఇరవై ఏళ్ళుగా అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంది.

 ఫైనల్‌గా తనకు మిగిలింది... ‘సెక్సీ క్వీన్’ అనే బిరుదు మాత్రమే.

 సెంటు స్థలం లేదు... సొంత ఇల్లు కూడా లేదు...

 నమ్మినవాళ్ళే నట్టేట ముంచారు...

 ఒంటరిగా వచ్చింది.. ఒంటరిగా మిగిలింది...

 అందరికీ ఆమె ఎద ఒంపులే కనిపిస్తాయి.

 కానీ, ఆ గుండెల మాటున గడ్డకట్టిన కన్నీటి సంద్రం ఎవరికీ కనిపించదు..

 ‘ఎ’ సర్టిఫికెట్ తార అనిపించుకున్న షకీలా

 తన లైఫ్‌ను ‘ఎ’ టూ ‘జెడ్’ ఆవిష్కరించింది.


చాలా రోజుల తరువాత మళ్ళీ తెర మీదకొచ్చారు. ఇంత గ్యాప్ ఎందుకని?

షకీలా: (ఠక్కున అందుకుంటూ...) నిజంగానే గ్యాప్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఇప్పటికి అయిదేళ్ళ పైగా నాకు తెలుగు సినిమాల ఆఫర్లు లేవు. అయితే, తమిళ, మలయాళ, కన్నడాల్లో చేస్తున్నా. నాలుగేళ్ళుగా కన్నడంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నా. తెలుగులో లాగా ఏదో కామెడీ కోసమని పెట్టే పాత్రలు కాక, పూర్తిగా భిన్నమైన పాత్రలు పోషిస్తున్నా. ఇతర భాషల్లో ఇన్ని పాత్రలు చేస్తున్నప్పటికీ, తెలుగులో నన్నెందుకు పిలవడం లేదో తెలియదు.

     

అసలు ఇప్పటి దాకా ఏయే భాషల్లో సినిమాలు చేశారు?

షకీలా: తెలుగు, తమిళ, మలయాళ, కన్నడాల్లో కలిపి దాదాపు 300కు పైగా సినిమాల్లో చేశా. హిందీలో ‘హత్యారా’ అని ఒకే సినిమాలో నటించా.  

     

ఇప్పుడు ఉన్నట్టుండి దర్శకత్వం వైపు ఎందుకు వచ్చారు?

షకీలా: ఎవరైనా ఎల్.కె.జి తరువాత యు.కె.జి. చదువుతారు కదా! అలాగే, నేను కూడా ఆర్టిస్టు నుంచి దర్శకురాలినయ్యా. ఆర్టిస్టుగా మొదలైన నేను అక్కడే ఎందుకు ఆగిపోవాలి. నా ఈ 20 ఏళ్ళ నట జీవితంలో ఎంతోమంది దర్శకులనూ, వాళ్ళు పనిచేసే విధానాన్నీ దగ్గర నుంచి గమనించా. ‘నేనెందుకు దర్శకత్వం వహించకూడద’ని పదేళ్ళుగా నా మనసులో ఉంది. నిజం చెప్పాలంటే, అప్పటి నుంచి అవకాశం రాలేదు. ఏవో ప్రయత్నాలు చేయడం, అవి మొదట్లోనే ఆగిపోవడం జరిగింది.

     

మరి ఒకేసారి తెలుగు - హిందీల్లో ఇప్పుడు మాత్రం ఛాన్సెలా వచ్చింది?

షకీలా: నిర్మాతలనుసమన్వయం చేసుకొని, సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్ళడం నాకు మొదట్లో తెలియదు. తీరా ఇప్పుడు సీనియర్ దర్శకుడు స్వర్గీయ కట్టా సుబ్బారావు కుమారుడు కట్టా శ్రీకర్ ప్రసాద్ వల్ల ఈ ప్రాజెక్ట్ కుదిరింది. చెన్నైలో మా ఇంటి మేడ మీద కట్టా సుబ్బారావు గారు వాళ్ళ ఆఫీస్ ఉండేది. ఆయన, మా నాన్న గారు మంచి మిత్రులు. వాళ్ళ ఇల్లు కూడా కోడంబాక్కమ్‌లోని డెరైక్టర్స్ కాలనీలోనే! అప్పటి నుంచి మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేము రాజోలులో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి, వస్తుండేవాళ్ళం. అలా మేము చాలా క్లోజ్. నేను చెప్పిన కథ విని, ఈ సినిమాను ఆర్గనైజ్ చేసింది ఆయనే. అలా నా దర్శకత్వంలో తొలి చిత్రం మొదలైంది.

     

కానీ, మునుపే ఓ మలయాళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలొచ్చాయే!

షకీలా: అవును. గత ఏడాది ‘నీలకురింజి పూత్తు’ అనే ఓ మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించాలని అనుకున్నా. ఆ కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైనది. నిజజీవితంలో నా లాగా చాలా సాహసోపేతంగా ఉండాలి. ఆ పాత్రకు రంజిత లాంటి పలువురు నటీమణులను అనుకున్నా. కానీ, ఆ పాత్రను నేనే పోషించాలని నిర్మాత పట్టుబట్టాడు. నేనేమో వేరే వాళ్ళను పెడదామన్నా. అలా అభిప్రాయభేదాల వల్ల ఆ సినిమా ఎనౌన్స్‌మెంట్‌కే పరిమితమైంది. మొదలు కాకుండానే, ఆగిపోయింది. ఆ చిత్రానికి నేను దర్శకత్వం వహిస్తానన్న సంగతి తెలిసి, కట్టా శ్రీకర్ ప్రసాద్ సోదరుడు కణ్ణా నాకు ఎంతో సాయపడ్డాడు. నాకు ఒక ట్యూటర్ లాగా అన్నీ చెప్పింది ఆయనే.

     

మీ దర్శకత్వంలోని ఈ తొలి సినిమాకు ‘పార్ట్ వన్’ అని పేరు పెట్టారట?

షకీలా: లేదు.. లేదు... అలాగని మొదట అనుకున్నాం. కానీ, ఆ పేరు పెడితే, అదేదో నా ఆత్మకథ ఆధారంగా తీస్తున్న సినిమా అనుకొనే ప్రమాదం ఉందని భావించాం. అందుకే, సరైన టైటిల్ చూసి, త్వరలోనే ప్రకటిస్తా.

     

నిజానికి, గత ఏడాది చివరలోనే ‘షకీలా ఆత్మకథ’ అంటూ మలయాళంలో మీ ఆత్మకథ పుస్తకంగా వచ్చింది కదా! ఆత్మకథ రాయాలని ఎందుకు అనిపించింది?

షకీలా: తేజ దర్శకత్వంలో ‘కేక’ చిత్రానికి పనిచేసినప్పుడు కెమేరామన్ పి.సి. శ్రీరామ్ గారు నాతో మాట్లాడుతూ, ‘నీ లాంటి అమ్మాయి నీ కథ ఏమిటన్నది రాయాలి. అది అందరికీ తెలియాలి. దాని ద్వారా నలుగురికీ ఉపయోగం’ అన్నారు. అప్పటి నుంచి నా బుర్రలో ఆ ఆలోచన తిరుగుతూ ఉంది. కానీ, నాదేమీ మహాత్మా గాంధీ జీవితం కాదు, మదర్ థెరెసా జీవితం కాదు. ప్రతి నటి జీవితంలో ఉన్నవే నా జీవితంలోనూ ఉన్నాయి, జరిగాయి. అయితే, ఒక మనిషిగా... ఆ తరువాత నటిగా నాకు ఎదురైన అనుభవాలు చెప్పడం వల్ల కొందరికైనా ఉపయోగపడతాయన్నందు వల్లే నా కథకు పుస్తక రూపమిచ్చా. కేరళలోని క్యాలికట్‌కు చెందిన అషాద్ బతేరీ అనే మంచి కవి, రచయిత నా ఆత్మకథ రాస్తానంటూ వచ్చారు. నా కథ మొత్తం ఆయనే మలయాళంలో రాశారు. నాకు మలయాళం చదవడం రాదు. అందుకే, అందులో ఏముందో నాకే తెలీదు (నవ్వులు). కానీ చదివినవాళ్ళంతా బాగుందన్నారు.  

     

మరి, మీ ఆత్మకథను తెలుగుతో పాటు, ఇతర భాషల్లో తెచ్చే ఆలోచన ఏదీ లేదా?

షకీలా: నిజం చెప్పాలంటే, ఆ మలయాళ పుస్తకం అధికారిక ఆవిష్కరణ కూడా ఇప్పటి దాకా జరగలేదు. అయినా, ఇప్పటికే 5 వేల కాపీలు అమ్ముడైపోయింది. ఆ విషయంలో రచయితతో నేను దెబ్బలాడాను కూడా. దుబాయ్‌లో బుక్‌ఫెస్టివల్‌లో బాగుంటుందని పెట్టామనీ, అలా ఆవిష్కరణ జరగకుండానే జనంలోకి వెళ్ళిపోయిందనీ వివరణ ఇచ్చాడు. ఇప్పుడీ పుస్తకాన్ని తెలుగు, కన్నడంలో కూడా అనువదిద్దామని ప్రచురణకర్తలు అడుగుతున్నారు. మాట్లాడుకొని, ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

     

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు - ఇన్ని భాషలు స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. అసలింతకీ మీది ఏ ఊరు?

షకీలా: (నవ్వేస్తూ...) ఒక్క కన్నడం తప్ప ఈ భాషలన్నీ అచ్చంగా ఆ మాతృభాషీయులు మాట్లాడినట్లే మాట్లాడగలను. మద్రాసులో పుట్టి పెరిగా కాబట్టి తమిళం కొట్టినపిండి. మలయాళంలో నటించా... అదీ బాగా వచ్చు. ఇంగ్లీషు మీడియమ్‌లో చదివా కాబట్టి, ఇంగ్లీషు సరేసరి. ముస్లిమ్ అమ్మాయిని కాబట్టి, ఆటోమేటిగ్గా హిందీ వచ్చు. ఇక, తెలుగంటారా? అది నా మాతృభాష. మా అమ్మ చాంద్ బేగమ్‌ది నెల్లూరు. తెలుగు మాట్లాడేది. మా నాన్న చాంద్ బాషాది తమిళనాడు. ఆయనకు ఉర్దూ, తమిళమే వచ్చు. వీటి వల్ల, నాకిన్ని భాషలొచ్చు. ఇన్ని భాషా చిత్రాలతో జనానికి దగ్గరయ్యా.

     

మీ అసలు పేరే షకీలానా? పేరు చివర ‘జాన్’ అని ఉందేమిటి?

షకీలా: అవును. ఆ పేరు వెనక కూడా పెద్ద కథే ఉంది. మా అమ్మానాన్నకు మేము ఏడుగురు సంతానం. నేను అయిదోదాన్ని. నా పూర్తి పేరు ముస్లిమ్ పద్ధతిలో - షకీలా జాన్. అక్కకీ, చెల్లెలికీ మంచి పేరు పెట్టారనీ, నా పేరు నాకు నచ్చలేదనీ నాన్నతో గొడవపడేదాన్ని. అప్పుడాయన అసలు విషయం చెప్పారు. ఆయన వయసులో ఉండగా, సుశీల అనే అమ్మాయిని ప్రేమించారట. ఆ ప్రేమ సక్సెస్ కాలేదు. ఆ అమ్మాయికి గుర్తుగా, ఆ పేరు ధ్వనించేలా షకీలా అని పెట్టారట. అయితే, షకీలా జాన్ అనే ముస్లిమ్ పేరును స్కూల్ రికార్డుల్లో రాస్తున్నప్పుడు, క్రైస్తవ పద్ధతిలో జె.ఓ.హెచ్.ఎన్. - జాన్ అనే ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాశారు. నా సర్టిఫికెట్లలో, చివరకు నా పాస్‌పోర్ట్‌లో కూడా అదే ఉంది. దాంతో, అదేమిటని చాలామంది పొరపడుతుంటారు.

     

ఇంతకీ సినిమాల్లోకి ఎలా వచ్చారు?

షకీలా: మా నాన్న మద్రాసులో ‘కలై సెల్వి రిక్రియేషన్ క్లబ్’ నడుపుతుండేవారు. అందులో ఆయనకు నష్టం వచ్చింది. కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. అప్పటికి నేను ఎనిమిదో తరగతి తప్పాను. సరిగ్గా చదవడం లేదని మా నాన్న ఇంటి బయట నన్ను కొడుతుండడం చూసి, ఎదురింట్లో ఉన్న సినిమా ఆఫీసులోని మేకప్‌మ్యాన్ ఆపాడు. సినిమాల్లో నన్ను నటించమంటే, మా నాన్న సరే అన్నారు. ఆయన తీసుకువెళ్లి, చిత్ర దర్శకుడికి పరిచయం చేశారు. ఆ సినిమాలో సిల్క్ స్మితకు చెల్లెలి పాత్రతో సినిమా రంగ ప్రవేశం చేశా.   

మీతో లాభం పొంది, ఇంట్లోవాళ్ళే మిమ్మల్ని మోసం చేశారని విన్నాం. నిజమా?

షకీలా: అవును నిజమే. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే, మా అక్క పిల్లలను సొంత బిడ్డలుగా చూసుకుంటూ వచ్చా. వాళ్లను నేను పెంచలేదు కానీ, చిన్నప్పుడు నేను ఎలాగూ బాగా బతకలేదని, వాళ్లయినా దర్జాగా ఉండాలని వాళ్ల కోసం ఎంతో ఖర్చు చేశా. కానీ, మా అక్క నాకంటూ ఏదీ కొననివ్వ లేదు. ఎప్పుడూ ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది. అలా నేను సంపాదించినదంతా వాళ్ళకే ఖర్చు పెట్టా. నా వాళ్ళను నమ్మా. నా సంపాదనంతా పోగొట్టుకున్నా. నాకు అయిదేళ్ళ వయసప్పుడు మా అమ్మా నాన్న సహా మా కుటుంబమంతా మద్రాసులో ఏ ఇంట్లో అద్దెకు దిగిందో ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటున్నా. నాకంటూ ఇవాళ్టికీ సొంత ఇల్లు, స్థలం - ఏదీ లేదు.

     

కానీ, ఒకానొక దశలో మీకు భారీ పారితోషికం ఇచ్చినట్లున్నారు!

షకీలా: అవును. తొలి చిత్రం ‘ప్లే గర్ల్స్’కు నా రెమ్యూనరేషన్ రూ. 2 వేలే. కాస్తంత పేరొచ్చాక, పరిశ్రమను ఊపేసిన నా సూపర్‌హిట్ మలయాళ చిత్రం ‘కిన్నార తుంబిగళ్’ (తెలుగులో ‘కామేశ్వరి’గా అనువాదమైంది) చిత్రానికి అయిదు రోజులకు 20 వేలు. తీరా పొగమంచు తదితర కారణాల వల్ల ఆ సినిమా త్రివేండ్రం దగ్గర పొన్ముడిలో 21 రోజులు షూటింగ్ చేశారు. అలా మొదలై, నటిగా రోజుకు రూ. 2 లక్షలు, 3 లక్షల దశ దాకా ఎదిగా. కోట్లు సంపాదించా. ఇక్కడే పోగొట్టుకున్నా.

     

అంత సంపాదన పోగొట్టుకున్నానని బాధపడుతున్నారా?

షకీలా: డబ్బు పోయింది నిజమే. కానీ, నేను ఎవరికిచ్చా...? మా అక్కకు, నా రక్త సంబంధీకులకే కదా! కాబట్టి, నేను వేరెవరినో నిందించడానికి వీల్లేదు. నా అనుకొని నమ్మినవాళ్ళే ఇవాళ నన్ను పిల్లలకు దూరంగా పెట్టడం, నాతో మాట్లాడవద్దనడం బాధించింది. నా వాళ్ళను నమ్మాను. మోసపోయాను. (చేతిని గుండెల మీద ఆనిస్తూ) అదే నాకు నొప్పిగా ఉంది. అందుకే, నా దృష్టిలో మా అక్క చచ్చిపోయింది. ఏమైనా, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నాది మంచి మనసు. నేనెప్పుడూ అవతలివాళ్ళకు మేలే చేశా. ఎవరినీ ఏమార్చలేదు. కాబట్టి, ఆ అల్లా నాకు మంచే చేస్తాడు. అదే నా నమ్మకం.

     

మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా?

షకీలా: బాగా నమ్ముతా. నేను లావుగా, నల్లగా ఉంటా. అతిలోక సౌందర్యరాశినేమీ కాదు. అయినా సరే, ఇవాళ ఇన్ని లక్షల మంది అభిమానం సంపాదించి, ఈ స్థితిలో ఉన్నానంటే అది ఆ దేవుడిచ్చిన వరమే. నేను ఇస్లామ్‌ను నమ్ముతా. ఈ మధ్యే షిర్డీకి వెళ్ళొచ్చా. పదేళ్ళ వయసులో అనుకుంటా, ఓసారి తిరుపతి వెళ్ళా. మళ్ళీ ఎన్నో ఏళ్ళుగా తిరుపతి వెళ్ళాలని కోరిక. ఈ మధ్యే తమ్ముడితో కలసి, తృప్తిగా దర్శనం చేసుకొచ్చా. అయితే, దేవుడి దగ్గరకెళితే, ఫలానాది కావాలని అడగను... అడగలేను. అడగకుండానే అన్నిటిలో ఆయన ఆశీస్సులిచ్చాడు. ఇంకేం కావాలి! అయితే, ఇవేవీ తెలియని చిన్న వయసులో తిరుపతికెళ్ళినప్పుడు దేవుడి వైభోగం చూసి, ‘నిన్నే పెళ్ళి చేసుకుంటా’ అన్నాను. (నవ్వులు...)

     

తరువాత దేవుడు కాకపోయినా... దేవుడు లాంటి భర్త కావాలని మీరెప్పుడూ ఆలోచించలేదా?

షకీలా: (వెంటనే అందుకుంటూ... బాధగా...) నేనూ ఆడపిల్లనేనండీ! నాకూ మనసుంటుంది! ఇప్పటి దాకా చేసుకోలేదంటే, నాకు పెళ్ళి అవసరం లేక కాదు. నన్ను నన్నుగా ప్రేమించేవాడు రాక!

     

ఇప్పటి దాకా మీరు ఎవరినీ ప్రేమించలేదా? మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేదా?

షకీలా: ఎందుకు ప్రేమించలేదు. ఆ జాబితా చాలా పెద్దదే. నేను సిన్సియర్‌గా ప్రేమించినా, వాళ్ళు మాత్రం ప్రేమిస్తున్నామంటూనే, నా ఫ్యామిలీ వద్దని దూరం పెడుతున్నారు. వాళ్ళు నన్నే గనక నిజంగా ప్రేమిస్తే, నా కుటుంబాన్ని కూడా అక్కున చేర్చుకోవాలి కదా! అంటే, వాళ్ళు నన్ను కాదు... నా దగ్గర ఉన్న వేరే దేనినో ప్రేమిస్తున్నారన్న మాట! ఆ మోసం తట్టుకోలేక, వాళ్ళనే వదులుకున్నా.

     

ఇంతమంది దగ్గర మోసపోయిన మీకు కోపం, ద్వేషం లేవా?

షకీలా: చూడండి. ఇలాంటివన్నీ ఈ సినిమా రంగంలో జరిగేవే. కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడమూ మామూలే. సినిమాల్లోనూ చూపించారు. అందరికీ జరిగేదే నాకూ జరిగింది. కాకపోతే, చాలామంది బయటకు చెప్పరు, నేను చెబుతున్నాను. అంతే తేడా!

     

మీ ఆత్మకథలో కూడా ఇవన్నీ చెప్పారా?

షకీలా: అఫ్‌కోర్స్ చెప్పా! నేను అబద్ధాలు చెప్పలేదు, రాయలేదు. కాకపోతే, నన్ను మోసం చేసిన వాళ్ళ పేర్లేవీ బయటపెట్టలేదు. ఎందుకంటే, నేనివాళ పది మందికి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగానూ అంటే అది నా రెక్కల కష్టంతో సాధించిన విషయం. అలాంటి నేను ఇలాంటి కొందరి పేర్లు చెప్పి, నా ద్వారా వాళ్ళనెందుకు ఫేమస్ చేయాలి? అందుకే, పేర్లు చెప్పలేదు. అయితే... ఒక్క మాట. నాకు వాళ్ళు మీద కక్ష లేదు. ఎదురై పలకరిస్తే, మామూలుగానే మాట్లాడుతున్నా.

     

చిన్నప్పుడు స్కూల్‌లో ఎదురైన ‘చైల్డ్ ఎబ్యూజ్’ గురించీ ఆత్మకథలో రాశారట...

షకీలా: అవును రాశాను. మద్రాసులో నేను సరస్వతీ విద్యాలయ, జవహర్ విద్యాలయ - ఇలా రకరకాల స్కూల్స్‌లో చదివాను. అప్పట్లో కొందరు మాస్టర్లు క్లాసులో పనిష్‌మెంట్ ఇచ్చే మిషతో నాతో అసభ్యంగా వ్యవహరించిన సంఘటనలు ఉన్నాయి. ఆ వయసులో ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియక నేను పెదవి విప్పలేదు. ఎవరితోనూ ఫిర్యాదు పూర్వకంగా ప్రస్తావించ లేదు. ఇప్పటికీ అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే, నాలా నోరు విప్పకపోతే కష్టమని చెప్పడం కోసం ఆ సంగతులు ప్రస్తావించాను. అయితే, ఎన్నో ఏళ్ళ క్రితం సంగతులు కాబట్టి ఇప్పుడెందుకు లెమ్మని ఇక్కడ కూడా పేర్లు బయటపెట్టలేదు.

     

మీ సినిమా రిలీజంటే మలయాళ స్టార్ల చిత్రాల్ని వాయిదా వేసుకున్నారంటారు...

షకీలా: అలా జరిగిందని పత్రికల వాళ్ళే రాశారు. నాకు నిజానిజాలు తెలియవు. ‘షకీలా సినిమా’ అని ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే, ‘ఆండవన్’ (తమిళంలో దేవుడు అని అర్థం) కరుణ. అప్పుడూ, ఇప్పుడూ నేను ఒకే వ్యక్తిని.

 

మరి, మీకు స్టార్ల నుంచి బెదిరింపులు రాలేదా?

షకీలా: అలాంటివి ఎప్పుడూ రాలేదు. పైగా, నాకు వాళ్ళందరితో సత్సంబంధాలుఉన్నాయి. వాళ్ళ సినిమాల్లో కూడా నటించాను. మోహన్‌లాల్‌తో ‘ఛోటా ముంబయ్’లో నటించా. నేనంటే పడకపోతే, గొడవ ఉంటే... వాళ్ళ సినిమాల్లో నన్ను నటించనివ్వరుగా! (నవ్వు...)

 

‘షకీలా చిత్రాలు’గా పేరుపడ్డ ‘అలాంటి’ సినిమాల్లో నటించాల్సి వచ్చినప్పుడు మీరు బాధపడలేదా? మీ కుటుంబ సభ్యులు ఎవరూ ఏమీ అనేవారు కాదా?

షకీలా: నేనెప్పుడూ బాధ పడలేదు. మా నాన్న ఆర్థికంగా చితికిపోయి ఉన్నప్పుడు, ఎనిమిదో తరగతి తప్పిన నేను సినీ రంగంలోకి వచ్చాను. ‘నా కుటుంబం కష్టాల్లో ఉంది. వాళ్ళను గట్టెక్కించాలి. నేను అనుకున్న మంచి జీవితం వాళ్ళకివ్వాలి’ - అప్పట్లో అదే నా ఆలోచనంతా. 1994లో సినీ రంగానికి వచ్చా. 1996 - 97లో అనుకుంటా... మా నాన్న చనిపోతూ మా అమ్మ చేయి పట్టుకొని, అమ్మనూ, తమ్ముడు సలీమ్‌నూ నాకు చూపిస్తూ, ‘వాళ్ళ బాధ్యత చూసుకోమన్నట్లు’గా సైగ చేస్తూనే, కన్నుమూశారు. వినడానికి సినిమా కథలా అనిపించినా, ఇది వాస్తవం. నా మీద ఆధారపడిన వీళ్ళకు ఏదో చేయాలనే నా తపన అంతా. అందుకే, నాకు వచ్చిన సినిమాలన్నిటిలో నటించాను. ఆ సంగతీ మా వాళ్ళకూ తెలుసు. అలా కష్టపడి సంపాదించి, మా అక్క, అన్న, వాళ్ళ పిల్లలు - అందరినీ నిలబెట్టేందుకు శ్రమించా. ‘అవసరంలో ఉన్నా’మంటూ అడిగితే చాలు... లేదనకుండా డబ్బులిచ్చా. దానధర్మాలు చేశా. కిడ్నీలు చెడిపోవడంతో మా అమ్మకు లక్షలు ఖర్చు పెట్టి, వైద్యం చేయించా. (కొంచెం బాధగా) అయినా అమ్మను దక్కించుకోలేకపోయా.

     

కానీ, మీ మీద ‘అశ్లీల చిత్ర తార’ అనే విమర్శలొచ్చాయి. సినీ రంగంలో కూడా చాలామంది మిమ్మల్ని లోకువగా చూశారు...

షకీలా: ఐ డోంట్ కేర్! నేను నా కోసం, నా కుటుంబం కోసం కష్టపడ్డా. ఎవరేమనుకుంటే నాకేంటి? ఇప్పుడు నేను క్యారెక్టర్ పాత్రలు వేస్తున్నా. అయినా సరే, ఇప్పటికీ నన్ను ఏ సినీ ఫంక్షన్లకూ పిలవరెందుకో అర్థం కాదు.

     

2001లో మలయాళంలో 97 చిత్రాలొస్తే, అందులో 30 మీవే. అలా హవా నడుస్తున్న రోజుల్లోనే ఉన్నట్టుండి ‘ఆ చిత్రాల’ నుంచి తప్పుకోవడానికి కారణం?

షకీలా: నిజం చెప్పాలంటే, రకరకాల గెటప్‌లతో కూడిన భిన్నమైన పాత్రలు నాకు ఇచ్చేవారు. వారు చెప్పినట్లు నటించేదాన్ని. అయితే, రిలీజయ్యాక హాలులో వాటిని చూసే తీరిక ఉండేది కాదు. ఒకసారి ఇలాగే ఓ మంచి గెటప్‌తో, ఓ సినిమాలో నటించాను. నా మీద చక్కటి సన్నివేశాలు చిత్రీకరించారు. తీరా రిలీజయ్యాక, నా మేకప్ మ్యాన్ రవి ఆ సినిమా చూసి వచ్చాడు. సినిమా, నా పాత్ర ఎలా ఉన్నాయని అడిగితే, ‘అందులో ఎంతసేపటికీ చిన్న తువ్వాలు కట్టుకొని తిరిగే దృశ్యాలు తప్ప ఇంకేమీ లేవన్నాడు. దాంతో, నేను చాలా ఫీలయ్యాను. ఇక అప్పటికప్పుడు మద్రాసులో తమిళ జర్నలిస్టులందరినీ పిలిచి, ‘ఆ తరహా’ సినిమాల్లో నటించనంటూ ప్రకటించాను. ఇదంతా జరిగింది 2001 చివరలో! అప్పటికే నేను తీసుకున్న 23 సినిమాల అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేశాను. అలా ఆ అధ్యాయం ముగిసింది.

     

‘ఆ పాత్రల’ నుంచి క్యారెక్టర్ నటిగా ఎలా మారారు? కష్టం కాలేదా?

షకీలా: హ్యాట్సాఫ్ టు డెరైక్టర్ తేజ. ‘జయం’ (2002)లో లెక్చరర్ పాత్ర ఇచ్చి, కెరీర్‌కు కొత్త మార్గం చూపెట్టారు. ఆ విషయంలో ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే! ఆయన నాకు పెద్దన్న లాంటివాడు. అప్పటి నుంచి గత పన్నెండేళ్ళుగా మెయిన్‌స్ట్రీమ్ సినిమాల్లో క్యారెక్టర్లు వేస్తున్నా.

     

స్తవ సన్న్యాసినిగా నటించాలని కోరిక అని గతంలో చెప్పేవారు...

షకీలా: ఆ కోరిక తీరింది. మలయాళంలో ఏడేళ్ళ క్రితం రూపొందించిన ఓ చిత్రంలో అలాంటి పాత్ర చేశా. కానీ, దురదృష్టవశాత్తూ అది ఇప్పటికీ రిలీజ్ కాలేదు. సినీ నటి సంఘవి నటించిన ‘నాన్సీ’ అనే తమిళ సీరియల్‌లో కూడా అలాంటి వేషం వేశా. అది వీక్షకుల ముందుకు వచ్చింది.

     

దక్షిణాది భాషలన్నీ మాట్లాడే మీరు డబ్బింగ్ చెప్పుకొనే ప్రయత్నం చేయలేదేం?

షకీలా: చూడండి. మన పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పడం వల్ల ఆ డబ్బింగ్ కళాకారులకు కూడా రెండొందలో, మూడొందలో వస్తాయి. కుటుంబం గడుస్తుంది. వాళ్ళ కడుపెందుకు కొట్టడం? (నవ్వుతూ...) ఇప్పుడు నేను చేసే మహత్తరమైన పాత్రలకు నాకు నేనే డబ్బింగ్ చెప్పుకొంటే, నాకేమైనా జాతీయ అవార్డులొస్తాయా ఏమిటి?

 

జీవితం, గడచిన కాలం, కెరీర్ పట్ల ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా?

షకీలా: నాకు రిగ్రెట్స్ ఏమీ లేవు. జీవితం ఎటు తీసుకెళితే అటు వెళ్ళాను. భగవంతుడు నాకంటూ ఈ దోవ ఇచ్చాడు. ఇందులో ముందుకు వెళ్ళాను. ఎప్పుడైనా, నాకు వచ్చిన పనిని నిజాయతీగా చేశాను. ఎవరినీ మోసం చేయలేదు. నావి సెక్స్ సినిమాలనీ, సాఫ్ట్ పోర్ట్ సినిమాలనీ అన్నవాళ్ళు ఇవాళ సన్నీ లియోన్ లాంటి తారలను అంగీకరిస్తున్నారు కదా! ఏమైనా, మన దక్షిణాదిలో సిల్క్ స్మిత తరువాత మళ్ళీ అంతటి సుదీర్ఘ కాలం అందరి దృష్టినీ ఆకర్షించి, వార్తల్లో వ్యక్తిగా నిలిచింది నేనే. అయామ్ హ్యాపీ.

 

మళ్ళీ జన్మంటూ ఉంటే...

షకీలా: షకీలా గానే పుడతాను. ఇప్పటి లానే మంచిగా జీవిస్తూ, పదిమందికీ చేతనైన మంచి చేస్తాను.- రెంటాల జయదేవ

 

దేవుడిచ్చిన బిడ్డనేనెప్పుడూ ఒంటరిగా లేను. నాకు భయం. ఎప్పుడూ మా అమ్మ నా పక్కనే ఉండేది. ఆమెకు ఒంట్లో బాగా లేనప్పుడు కూడా ఆమె మంచం పక్కనే పడుకొనేదాన్ని. అలాంటిది మా అమ్మ చనిపోయాక ఒంటరి నయ్యా. చుట్టాలు కూడా మొహం చాటేశారు. ‘జియారత్’ (సమాధిపై పూలు చల్లుతూ నివాళి ఇవ్వడం) చేసే దాకా కూడా ఎవరూ లేరు. మమ్మీ పోయాక కనీసం ఇంట్లో వంటైనా చేయలేదు. తినీ తినకుండా ఉండి పోయేదాన్ని. అలాంటి స్థితిలో తంగం అనే ఈ అబ్బాయి దేవుడు పంపినట్లుగా నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నాకు అచ్చం మా అమ్మలా వంట చేసేది, మందులు ఇచ్చేది వీడే. నన్ను మమ్మీ అనే పిలుస్తాడు. వాళ్ళ ఊరు వెళ్ళినా, అనుక్షణం నా బాగోగుల గురించి ఫోన్‌లో అడుగుతూనే ఉంటాడు. రెండు రోజులకని వెళ్ళినవాడు కూడా రెండు గంటల్లోనే వెనక్కి వచ్చేస్తాడు. అల్లా మీద ఒట్టు... వీడు నాకు దేవుడిచ్చిన బిడ్డ. ఇప్పుడు వీడే నాకు దిక్కు.

 

నాదగ్గరకు వచ్చిన ఒక్కొక్కరిదీ ఒక్కో కథ!ఇప్పటికి ఓ ఇరవై మంది నాకు జీవితంలో ఎదురయ్యారు. అందరూ అందరే! తెలుగు, తమిళ, మలయాళాల్లో పేరున్న ఒక హీరో నన్ను ప్రేమించానన్నాడు. అతను చిన్నప్పటి నుంచీ నాకు తెలిసినవాడు, మిత్రుడు కూడా! అయిదేళ్ళు ‘రిలేషన్‌షిప్’లో ఉన్నాం. కానీ, సదరు హీరో ఎంత దుర్మార్గుడంటే, రోజూ కొట్టి, కొట్టి హింసించేవాడు. తన ఒంటి మీద కూడా గాయాలు చేసుకొనేవాడు. శాడిస్టులా ప్రవర్తించేవాడు. అయినా మత్తు దిగిపోయాక, క్షమించమని అడిగేసరికి మెత్తబడేదాన్ని. కానీ, చివరకు అతను నాకు ద్రోహం చేశాడు. ఆ బంధం తెగిపోయింది. తరువాత తమిళనాట కొత్తగా ఏర్పడిన ఓ హీరో గారి రాజకీయ పార్టీ ప్రముఖుడు నన్ను ప్రేమించానన్నాడు. అదీ కట్ అయిపోయింది. ఇలా... ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గరలో ఓ వ్యక్తి నన్ను సిన్సియర్‌గానే ప్రేమిస్తున్నానంటున్నాడు. అదెంత కాలమో!

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top