తెలివిటీగలు..ప్రైజ్‌ మనీ రూ. 35 లక్షలు..!

Scripps National Spelling Bee Champions Indian Americans Since 2008 - Sakshi

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తమ ఉనికిని చాటుకోవడంలో భారతీయులు ఎల్లప్పుడూ ముందుంటారు. ప్రతిష్టాత్మకమైన ‘స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ’ పోటీల్లో గత దశాబ్దకాలంగా అమెరికాలోని భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలవడమే ఇందుకు నిదర్శనం. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వెనక్కినెట్టి మరీ మన చిన్నారులే విజేతలుగా నిలుస్తూ.. భారత మేధా స్థాయిని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. కఠిన పదాల ఉచ్ఛారణను అనుసరించి వాటి స్పెల్లింగ్‌ చెప్పడం ఈ పోటీ ప్రధాన లక్షణం.

మొదటి విన్నర్‌ ఫ్రాంక్‌
స్పెల్లింగ్‌ బీ అనే పదం 1875లో మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం అయింది. విద్యార్థుల్లో పోటీతత్త్వాన్ని పెంచేందుకు ‘ద కొరియర్‌ జర్నల్‌’ అనే వార్తా పత్రిక 1925లో ‘యునైటెడ్‌ స్టేట్స్‌ స్పెల్లింగ్‌ బీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాషింగ్టన్‌లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ పోటీలో ఫ్రాంక్‌ నౌహసర్‌ అనే పదకొండేళ్ల పిల్లాడు తొలి విజేతగా చరిత్రకెక్కాడు. గ్లాడియస్‌ (లాటిన్‌లో ఖడ్గం అని అర్థం) అనే పదానికి సరైన స్పెల్లింగ్‌ చెప్పి ట్రోఫీని అందుకున్నాడు. అమెరికాలోని కెంటెకీలో జన్మించిన ఫ్రాంక్‌ తదనంతర కాలంలో అమెరికన్‌ పేటెంట్‌ లాయర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. జర్మన్‌ సంతతికి చెందిన ఆయన మార్చి 11, 2011లో మరణించారు.

‘స్పెల్‌బౌండ్‌’ డాక్యుమెంటరీ
1941లో ‘స్క్రిప్స్‌ హవార్డ్‌ న్యూస్‌ సర్వీస్‌’.. స్పెల్లింగ్‌ బీ స్పాన్సర్‌షిప్‌ బాధ్యతలు చేపట్టింది. అప్పటినుంచి ఈ పోటీని ‘స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ’ గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఏటా విధిగా నిర్వహించే ఈ పోటీల్లో 2008 నుంచి భారత సంతతి విద్యార్థులే విజేతలుగా నిలుస్తుండడం విశేషం.  అయితే భారతీయులకు స్పెల్లింగ్‌ బీపై మక్కువ ఏర్పడింది మాత్రం ‘స్పెల్‌బౌండ్‌’ అనే డాక్యుమెంటరీతోనే అంటారు ఆంత్రపాలజిస్టులు. 

లక్షా ఇరవై వేల పదాలు
టెక్సాస్‌కు చెందిన విజయ్‌ రెడ్డి అందరిలాగే తన కొడుకు చేతన్‌ను స్పెల్‌ బీ చాంపియన్‌గా చూడాలనుకున్నారు. ఎన్నో ఆశలతో పోటీలో అడుగుపెట్టిన చేతన్‌.. ఏడవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే కొడుకును తీర్చిదిద్దే క్రమంలో ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌పై ఆసక్తి పెంచుకున్న విజయ్‌ స్వయంగా ఓ కోచింగ్‌ సెంటర్‌ను నెలకొల్పారు. దానికి ‘జియోస్పెల్‌’ అని నామకరణం చేసి ఇప్పటి వరకు ముగ్గురు భారత సంతతి విద్యార్థులను చాంపియన్లుగా నిలబెట్టారు. సులభ పద్ధతిలో బోధనకై దాదాపు లక్షా ఇరవై వేల పదాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేశారు. అదే విధంగా తరచుగా పరీక్షలు నిర్వహించడం ద్వారా.. తన అకాడమీ విద్యార్థులకు పోటీ నేషనల్స్‌కు సన్నద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్‌రెడ్డి పర్యవేక్షణలో కోచింగ్‌ తీసుకున్న కార్తిక్‌ నెమ్మాని గతేడాది స్పెల్‌ బీ చాంపియన్‌ ట్రోఫీ అందుకోగా.. ఈ ఏడాది అభిజయ్‌ కొడాలి ఆ ఘనత సాధించాడు. కొడుకు కోసం స్పెల్‌ బీపై మక్కువ పెంచుకున్న విజయ్‌రెడ్డి ప్రస్తుతం దానిని పూర్తిస్థాయి బిజినెస్‌గా మలచుకుని.. విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు.

తనయుడు చేతన్‌తో విజయ్‌ 

ప్రైజ్‌ మనీ రూ. 35 లక్షలు
కాగా తాజాగా జరిగిన స్పెల్లింగ్‌ పోటీల్లో భారత సంతతి విద్యార్థులు చాంపియన్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన రిషిక్‌ గంధశ్రీ (13), మేరీల్యాండ్‌కు చెందిన సాకేత్‌ సుందర్‌(13), న్యూజెర్సీకి చెందిన శ్రుతికా పధి (13), టెక్సాస్‌కు చెందిన సోహుం సుఖ్తంకర్‌ (13), అభిజయ్‌ కొడాలి(12), రోహన్‌ రాజా (13), క్రిస్టఫర్‌ సెర్రావ్‌(13), అలబామాకు చెందిన ఎరిన్‌ హొవార్డ్‌ (14)లు విజేతల జాబితాలో ఉన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, కెనడా, ఘనా, జమైకా తదితర దేశాల నుంచి వచ్చిన దాదాపు 562 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, 8 మందిని నిర్ణేతలు విజేతలుగా ప్రకటించారు. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. కాగా ఇద్దరి కన్నా ఎక్కువ మందిని విజేతలుగా ప్రకటించడం 94 ఏళ్ల స్పెల్‌బీ చరిత్రలో ఇదే తొలిసారి. వీరిలో ఒక్కొక్కరు దాదాపు రూ.35 లక్షల చొప్పున నగదును, బహుమతులను గెలుచుకున్నారు.

భారతీయుల్లో  పోటీ తత్త్వం : షాలినీ శంకర్, ఆంత్రోపాలజిస్టు 

వలసదారులుగా పరాయి దేశంలో ఉన్నప్పటికీ.. మాతృభాషతో పాటు ఇతర భాషలపై పట్టు సాధించాలనే ఆసక్తి భారతీయుల్లో మెండుగా ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌ విభాగాల్లో అగ్రపథాన నిలిచే ఇండో అమెరికన్లలో చాలా మంది స్పెల్లింగ్‌ బీని ఎంతో ప్రతిష్టాత్మంగా భావిస్తారు. తమ పిల్లలను ఈ పోటీల్లో భాగస్వామ్యం చేయడాన్ని గర్వంగా ఫీలవుతారు. అంతేకాదు స్పెల్‌ బీ పోటీల్లో ఛాంపియన్లుగా నిలిచిన విద్యార్థులు ఇతర అంతర్జాతీయ స్పెల్లింగ్‌ పోటీల్లోనూ విజేతలుగా నిలుస్తున్నారు.
– సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top