రెండు పైసలు దక్షిణ అడిగారు నా గురువు

Patience with joyful courage with sai baba - Sakshi

చెట్టు నీడ 

రాధాబాయ్‌ దేశ్‌ముఖ్‌ అనే భక్తురాలు బాబా వద్ద మంత్రోపదేశం పొందాలనే ఆత్రుతతో షిరిడీ వచ్చింది. బాబాకు తన మనసులోని మాట చెప్పి తన చెవిలో మంత్రం ఊదాల్సిందేనని మొండిపట్టు పట్టింది. మంత్రం చెప్పకపోతే ఉపవాసాలుండి చచ్చిపోతానంది. బాబా ఆమెతో ఇలా అన్నారు. ‘‘అమ్మా! నాకు తల్లివంటి దానివి. నేను చెప్పేది శ్రద్ధగా విను. నా గురువు మిక్కిలి దయార్ద్ర హృదయులు. చాలాకాలం ఆయనకు సేవ చేశాను. వారి వద్ద ఉపదేశం పొందాలనేది నా ఆశ. అలా పన్నెండేళ్లు గురుసేవలో తరించాను. కానీ వారు నా చెవిలో ఏ మంత్రమూ ఊదలేదు. వారి సాంగత్యంలో నాకు అన్న వస్త్రాలకు లోటు లేదు. వారు నన్ను అడిగినది రెండే రెండు పైసల దక్షిణ. అందులో ఒక పైసా నిష్ఠతో కూడిన భక్తి. దీనినే శ్రద్ధ అంటారు. రెండోపైసా సబూరి. అంటే సంతోష స్థైర్యాలతో కూడిన సహనం. ఈ ప్రపంచమనే సాగరాన్ని ఓర్పు అనే ఓడ సురక్షితంగా దాటిస్తుంది. సబూరి అత్యంత ఉత్తమ లక్షణం. అది పాపాల్ని తొలగిస్తుంది. కష్టాలను ఎడబాపుతుంది. సబూరి అనేది సుగుణాలకు గని. మంచి ఆలోచనలకు పెన్నిధి. శ్రద్ధ, సబూరి అక్కచెల్లెళ్ల వంటివి. 

నా గురువు నా నుంచి ఏమీ ఆశించలేదు. సర్వకాల సర్వావస్థల్లోనూ కేవలం దృష్టి చేతనే నన్ను అనుగ్రహించేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున, పిల్ల తాబేళ్లు మరో ఒడ్డునా ఉంటాయి. తల్లి పిల్లలకు పాలివ్వడం, ఆహారం పెట్టడం చేయదు. కేవలం తల్లి ప్రేమాస్పద దృష్టి సోకి పిల్లలు పెద్దవుతాయి. నా గురువు నాపై అదే ప్రేమ చూపేవారు. తల్లీ! నా గురువు నాకే మంత్రమూ ఉపదేశించలేదు. అలాంటప్పుడు నేను నీకెట్లు మంత్రం ఊదగలను? గురువు మయమైన తాబేలు చూపే మనకు సంతోషాన్నిస్తుందని గుర్తుంచుకో. మంత్రం కాని, ఉపదేశం కాని ఎవరి నుంచీ పొందాలని ప్రయత్నించకు. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు. నీ వైపు నేనట్లే చూస్తాను. నీవు తప్పక పరమార్థం పొందుతావు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అబద్ధం చెప్పను. నిజం కానిది మాట్లాడను. ఆరు శాస్త్రాల్లో ప్రావీణ్యం, అష్టాంగ యోగాల్లో సాధన అవసరం లేదు. గురువుపై సంపూర్ణ ప్రేమ, విశ్వాసాలను ఉంచు. సర్వమూ చేయువాడు గురువే. అతనే కర్త అని నమ్ము. ఎవరైతే గురువును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారో వారు ధన్యులు’’అని బాబా తన ఉపదేశాన్నిచ్చారు. రాధాబాయి బాబా మాటలను శ్రద్ధగా వింది. అర్థమైందన్నట్లుగా భక్తితో చేతులు జోడించింది. 
– డా. కుమార్‌ అన్నవరపు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top