ఏటా 18 కోట్ల టన్నుల ఇంటిపంటల దిగుబడి!

Organic farms are cultivated in empty places - Sakshi

అరిజోనా యూనివర్సిటీ తాజా అధ్యయనం

నగరాలు, పట్టణాల్లో ఇళ్ల మధ్య, ఇళ్లపైన ఖాళీ స్థలాల్లో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయటం ప్రపంచమంతటా విస్తరిస్తున్నది.  ఇంతకీ పట్టణ, నగర ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల ద్వారా ఏటా ఎంత పంట పండించవచ్చు? దాని విలువ ఎంత?? 10 నుంచి 18 కోట్ల టన్నుల ఆహారాన్ని ఉత్పత్తి చేయొచ్చని ఈ ఆహారం విలువ ఏకంగా 8,000 కోట్ల నుంచి 16,000 కోట్ల డాలర్లని అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ తాజాగా లెక్క తేల్చింది. ఈ అంశంపై ఇదే తొట్టతొలి సమగ్ర అధ్యయనంగా భావిస్తున్నారు. నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఆర్థిక తోడ్పాటుతో.. ఆహార, వ్యవసాయ సంస్థ గణాంకాలు.. గూగుల్‌ ఎర్త్‌ ఇంజిన్‌ సాంకేతిక సహకారంతో ఈ అధ్యయనం జరిగింది.

ఈ అధ్యయనం వివరాలను అమెరికన్‌ జియోఫిజికల్‌ యూనియన్‌కు చెందిన ‘ఎర్త్‌ ఫ్యూచర్‌’ జర్నల్‌ ఇటీవల ప్రచురించింది. సేంద్రియ ఇంటిపంటల వల్ల ప్రయోజనం చక్కని ఆహారం మాత్రమే కాదండోయ్‌.. పర్యావరణ సేవలు కూడా భారీగానే అందుతున్నాయి. అంతేకాక, పట్టణాల్లో ఇంటిపంటల చల్లదనం వల్ల ఏటా 1,400–1,500 కోట్ల కిలోవాట్‌ అవర్స్‌ మేరకు విద్యుత్తు ఆదా అవుతుంది. లక్ష నుంచి లక్షా 70 వేల టన్నుల నత్రజనిని ప్రతి ఏటా ఇంటిపంటలు మట్టిలో స్థిరీకరిస్తాయి. 4,500–5,700 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మేరకు వర్షపు నీరు వృథాగా కొట్టుకుపోకుండా ఇంటిపంటలు ఒడిసిపట్టగలుగుతాయని అంచనా.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ పర్యావరణ సేవలన్నిటి విలువ ఏకంగా 3,300 కోట్ల డాలర్లట!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top