
చూశారుగా.. విద్యాబాలన్‌ని! ‘సన్నగా ఉంటేనే చీర’ అనే ఫీలింగ్ మీలో ఉంటే.. ఆ ఫీలింగ్‌ని చుట్టచుట్టి.. వాషింగ్ మెషీన్‌లో పడేయండి. మీరు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా... కట్టే చీరను బట్టి అందం వస్తుంది. కడుపు నిండా తినండి. ఒంటి నిండా కట్టండి హెల్దీగా.. హ్యాపీగా ఉండండి.
► పెద్ద అంచు ప్లెయిన్ కంచిపట్టు చీరమీద వెజిటబుల్ కలర్స్‌తో కలంకారీ డిజైన్ వేశారు. మనం సాధారణంగా కంచిపట్టు అనగానే జరీ చూస్తాం. కానీ, కలంకారీతో ఇలా లుక్ మార్చేయవచ్చు. ఈ చీరలు ఏ వేడుకలోనైనా స్పెషల్‌గా కనిపించేలా చేస్తాయి.
► బెనారస్ ఆరెంజ్ నెట్‌కి నలుపురంగు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన బార్డర్‌ను జత చేశారు. లైట్‌గానూ అదే సమయంలో రిచ్‌లుక్‌తో కనిపించాలనుకున్నప్పుడు ఈ స్టైల్ బాగుంటుంది. ప్లెయిన్ శారీకి, సంప్రదాయ డిజైన్‌ని జత చేస్తే పార్టీకి ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చినట్టే!
►బంగారు, గులాబీరంగు కలిస్తే వచ్చే మెరపు చీర అందాన్ని పెంచింది. దీనికి మోచేతుల వరకు ఉండే సెల్ఫ్ బ్లౌజ్ ఆకర్షణీయంగా మార్చింది. దీనికి మరింత వన్నెతీసుకురావడానికి పేటల హారం, చెవులకు జూకాలు, చేతికి కంకణంతో సింపుల్ అండ్ సూపర్బ్ అనిపించేలా గెటప్‌ని తీసుకొచ్చారు.
►మన చేనేతలు ఎప్పుడైనా హుందాతనాన్ని తీసుకు వస్తాయి. ఎక్కడైనా ప్రత్యేకంగా కనిపించా లనుకుంటే బ్లాక్ అండ్ వైట్ చీర ఎంపిక సరైన ఆప్షన్. పాలనురగను తలపించే తెలుపు, బ్లాక్ బార్డర్‌తో ఆకట్టుకునే ఈ కోరాసిల్క్ శారీకి బ్లౌజ్ డిజైన్ మహారాణి కళను తీసుకువచ్చింది.
►ఇది హాఫ్ అండ్ హాఫ్ ప్రింటెడ్ శారీ! పూర్తి కాంట్రాస్ట్‌గా ఉన్న రెండు ముదురు రంగు కాంబినేషన్ ఫ్యాబ్రిక్స్‌ని ఎంచుకొని, కుచ్చిళ్ల పార్ట్ రంగుని పల్లూ మీద త్రికోణంలో ప్రింట్‌గా వేయించుకుని
ఇలా శారీ లుక్ పూర్తిగా మారిపోయేలా డిజైన్ చేసుకోవచ్చు.
► నైట్ పార్టీస్‌కి ఇలా రెడీ అవ్వచ్చు. బ్లాక్, గ్రే రెండు కలర్స్ షేడెడ్‌గా ఉండేవి ఎంచుకుంటే రిచ్‌గా, స్టైలిష్‌గా, స్లిమ్‌గా కనిపిస్తారు. పైగా తేలికగా ఉండటం వల్ల రాత్రి సమయాల్లో హెవీగా అనిపించదు. పార్టీని ఎంజాయ్ చేయచ్చు. స్లిమ్‌గా కనిపిస్తున్నారు అనే కితాబులూ కొట్టేయవచ్చు.
► కంజీవరం అంచు, మధ్య పార్ట్ కోరా సిల్క్‌తో డిజైన్ చేసిన చీర ఇది. దీని వల్ల చీర మరీ హెవీగా కనిపించదు. తేలికగా ఉండాలనుకుంటే ఇలాంటి చీర మంచి ఎంపిక. దీనికి సెల్ఫ్ బ్లౌజ్ ధరించడంతో మరింత నిండుతనం చేకూరింది. ఈ చీర మీదకు టెంపుల్ జ్యూయల్రీ బాగా నప్పుతుంది.