పేదరికమే నీ రహస్య కవల

New Book Shilpi Somaya Gowda Secret Daughter - Sakshi

కొత్త బంగారం

1984. పల్లెటూరైన ధనౌలో పేదరికంలో మగ్గే కవిత, జసూ దంపతులకు మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది. ‘జసూ పిల్లని పారేస్తాడు’ అని అనుభవపూర్వకంగా తెలిసిన కవిత, పుట్టిన బిడ్డకు ‘ఉష’ అన్న పేరు పెడుతుంది. ‘తన తల్లిదండ్రులెవరో తెలియకపోయినా ఇబ్బంది లేదు. కనీసం, పిల్ల బతికే అవకాశం ఉంటుంది’ అనుకుని, భర్తకు తెలియనీయకుండా దూరాన్న ఉండే అనాథాశ్రమానికి కూతుర్ని అప్పగిస్తుంది. క్రిష్ణన్‌ (క్రిస్‌) బొంబాయి ధనిక కుటుంబానికి చెందిన న్యూరో సర్జన్‌. భార్య సోమర్, 30లలో ఉన్న అమెరికన్‌ డాక్టర్‌. వైద్యపరమైన సమస్య వల్ల పిల్లల్ని కనలేకపోతుంది. క్రిస్‌ తల్లి సలహాతో– దంపతులు, అనా«థాశ్రమంవారు ‘ఆశ’ అని పిలిచే, సంవత్సరం వయస్సున్న ఉషను దత్తత తీసుకుని, కాలిఫోర్నియా తీసుకు వెళ్తారు.

భారతీయుడిని పెళ్ళి చేసుకున్నప్పుడు కనిపించకపోయిన సాంస్కృతిక తేడా ఆశను పెంచడంలో ఎదురవుతుంది సోమర్‌కు. ఆశాను స్కూలు నుండి తెస్తున్నప్పుడు, ఇతర తల్లులు ఆమెను కేవలం ‘ఆశా తల్లి’ గా మాత్రమే గుర్తిస్తారు. స్కూల్‌ మీటింగులకు సోమర్‌ వద్ద సమయం ఉండదు. ‘తల్లి అవడం, నా వృత్తి కూడా నన్ను నిర్వచించలేకపోతున్నాయి. రెండూ నాలో భాగమే. కానీ కలవలేకపోయాయి’ అంటుంది. తల్లి నిర్లక్ష్యం నడుమ పెరిగిన ఆశ జర్నలిస్టు అయి, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో శిక్షణ పొందడానికి మొట్టమొదటిసారి బోంబే వచ్చి, క్రిస్‌ తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. మురికివాడల గురించి పత్రికకు రిపోర్ట్‌ చేస్తున్నప్పుడు, మొదట తన జీవసంబంధమైన తల్లిదండ్రుల ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది.

వారు తనని అనాథాశ్రమంలో పెట్టి, మెరుగైన జీవితాన్ని అందించకపోయుంటే, తను ఇప్పటికీ ఆ వాడల్లోనే ఉండేదని అర్థం చేసుకున్నప్పుడు తన ప్రయత్నం విరమించుకుంటుంది. అయితే, వారింకా తన గురించి బెంగ పడుతున్నారేమో అన్న అక్కరతో వారికోసం ఒక ఉత్తరం వదులుతుంది ‘సీక్రెట్‌ డాటర్‌’ నవల్లో. యీ లోపల ‘క్రిస్, నేనూ– సరస్సుకి రెండు వైపులా ఉన్న ఒడ్డుల మీద నిలుచున్నాం. మధ్యనున్న దూరాన్ని తగ్గించే శక్తి ఇద్దరికీ లేదు’ అనుకునే సోమర్, క్రిస్‌ విడాకులు పుచ్చుకుంటారు. దీనికి సమాంతరంగా నడిచే జసూ దంపతుల కథలో, కవితకు విజయ్‌ పుట్టాక వారు బోంబేకి మారుతారు. కవిత తన ‘రహస్య కూతురు’ గురించి మరచిపోదు. జసూ కూతురి గురించి తెలుకున్నప్పుడు, భార్యతో: ‘తన పేరిప్పుడు ఆశ. అమెరికాలో పెరిగింది. పత్రికలకు రాస్తుంటుంది. ఇది రాసినది తనే. మనతో ఉంటే తనిలా ఎదగగలిగేదా!’ అంటూ, పత్రికలో ఉన్న కాలమ్‌ చూపిస్తాడు. ‘నా పేరు ఆశ’ అని మొదలుపెట్టిన ఉత్తరాన్ని కవితకు అందిస్తాడు. 

తాత మరణించినప్పుడు, ‘మనం సృష్టించుకున్న కుటుంబమే మనల్ని కన్నదానికన్నా ఎక్కువ ముఖ్యమవుతుంది’ అని క్రిస్‌ ముందు ఆశ ఒప్పుకుంటుంది. ‘ఒక డాక్టరుగా, నా వృత్తి వల్ల నేను గర్వపడలేదు. ఒక భార్యగా, నేనేమీ చేయలేదు. తల్లిని అసలే కాను. నా లోకాన్ని ఎవరో తలకిందులా తిప్పేశారు’ అనుకున్న సోమర్‌– భర్తా, కూతురితో రాజీ పడుతుంది. కవిత, జసూ కూడా ఒకరికి మరొకరి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచుకుంటారు. ఆడపిల్లలు గుదిబండలు అనుకునే భారతదేశపు ఆలోచనా ధోరణిని చక్కగా చిత్రిస్తారు రచయిత్రి శిల్పి సోమయ గౌడ. ఇండియాను విమర్శించరు కానీ ఆధునిక భారతదేశంలో ఉండే లింగ అసమానతలను చూపుతారు. దత్తతకు ఉన్న సాంస్కృతిక గుర్తింపునూ,  స్త్రీల పాత్రనూ విడమరచి చెప్తారు. ముప్పై భాషల్లోకి అనువదించబడిన రచయిత్రి యీ తొలి నవలను మోరో/హార్పర్‌ కాలిన్స్, 2010లో పబ్లిష్‌ చేసింది. 
 కృష్ణ వేణి
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top