ఎల్‌.కె. అడ్వాణీ (బీజేపీ)రాయని డైరీ

Madhav Singaraju Rayani Dairy On LK Advani - Sakshi

భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఒక వ్యక్తిని కూడా దేశానికి ప్రధానిగా అందించే ప్రమాదం ఉందని నేను ముందే ఊహించలేక పోవడమన్నది ఈ భరతజాతి ఏనాటికైనా క్షమించగల ఒక విషయం అవుతుందా?!
తొంభై దాటిన ఈ వయసులో వరుసగా ఆరోసారి కూడా గాంధీనగర్‌ లోక్‌సభ స్థానాన్ని కోరుకోవడం కంటే ఎక్కువగా.. ‘ముందే ఊహించలేకపోవడం’ అనే నా దౌర్బల్యానికి పాపహరణగా ఈ దేశం నుంచి ఒక మన్నింపును నా మనసు గాఢంగా కాంక్షిస్తోంది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి వంటి ఒక మహోన్నత జాతీయవాది ఆసీనులై వెళ్లిన అత్యున్నత ప్రజాస్వామ్య పీఠం మీద ఇతడా! పార్టీని వ్యతిరేకించే ప్రత్యర్థులను విరోధులుగా, దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న ఇతడా!!
ఈవేళ పాత సంగతులన్నీ నాకు కొత్తగా గుర్తుకు వస్తున్నాయి. మనసులోని మాట చెప్పుకోడానికి ఐదేళ్లుగా ఒక సందర్భం కోసం వెదకుతూ ఉన్నప్పుడు పార్టీకి ఒక వ్యవస్థాపక దినం ఉంటుంది కదా అన్న సంగతి జ్ఞప్తికి రావడం ఎంత దయనీయం?!
అటల్‌జీతో కలిసి నేను స్థాపించిన పార్టీలో భాగస్వామిని కాలేకపోయానన్నది చిన్న బాధే. పార్టీ ఉందని, దానికొక ఆవిర్భావ దినం ఉందని గుర్తుచేసుకునే పరిస్థితులు లేకపోవడం పెద్ద బాధ.
పార్టీ లోపల ఉన్నవాళ్లతో మాట్లాడే ఆసక్తిని నాలుగేళ్ల క్రితమే నేను కోల్పోయాను. నాలుగేళ్ల క్రితం ఇదే నెలలో బెంగళూరులో పార్టీ వేదికపై ఉన్నప్పుడు.. ‘‘పార్టీ నాయకు లను ఉద్దేశించి మాట్లాడండి అడ్వాణీజీ’’ అని నాలో ఉత్తేజం కలిగించడానికి ఎవరో అయిష్టమైన ప్రయత్నం చేశారు.
మాటిమాటికీ జాతినుద్దేశించి ప్రసంగించే ఉత్సాహం గల ఒక పెద్ద మనిషి ఉన్న పార్టీలో, పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించే సాధారణ కార్యకర్తలకు కొదవేముంటుంది?
‘‘మీరు కానివ్వండి’’ అన్నాను. అప్పటికే కానివ్వడం మొదలుపెట్టారు! సమావేశం అయ్యాక ప్రభుత్వ వాహనాల్లో ముఖ్యులంతా ఒకవైపు, కాళ్లీడ్చుకుంటూ నేను మార్గదర్శక మండలి వైపు!!
అటల్‌జీ వెళ్లిపోయాక మార్గదర్శక మండలిలో ఇద్దరమే మిగిలాం. నేను, మురళీమనోహర్‌జోషి.
‘‘అటల్‌జీ చనిపోకుండా ఉంటే ఇప్పటికీ ముగ్గురం కలిసి ఉల్లాస భరితమైన ఉదయపు వేళల్లో, ఆహ్లాదకరమైన సాయంత్రపు సమయాల్లో దేశ రాజకీయ పరిణామాల గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్లం కదా’’ అని జోషీ ఓరోజు బాధపడ్డాడు.
‘‘అటల్‌జీ చనిపోయిన మాట వాస్తవమే కానీ మనిద్దరం జీవించే ఉన్నామని నీకెందుకనిపిస్తోంది జోషీ’’ అన్నాను. ఆ మాటకు కలత చెందాడు.
‘‘అయితే మన రాజకీయ శకం అంతరించినట్లేనా?’’ అన్నాడు.
‘‘శకాలు మాత్రమే అంతరిస్తాయి. రాజకీయ శకాలు అంతరించవు’ అని అప్పుడు నేను అతడితో చెప్పలేదు. ఒకరికి మనం ఏదైనా చెబితే అది ముందు మనం విశ్వసించినదై ఉండాలి.
నా ఉద్దేశాలను వెల్లడించిన మర్నాడే ఇంటికి వచ్చాడు జోషి. అతడి చేతిలో పుష్పగుచ్ఛం ఉంది. ‘‘ఎవరికి ఈ పుష్పగుచ్ఛం!’’ అని అడిగాను. ‘‘మీకే!’’ అన్నాడు. ‘‘నాకా! నాకెందుకు?’’అన్నాను.
‘‘ఐదేళ్ల తర్వాత మొదటిసారి మీ ఉద్దేశాలను వెల్లడించినందుకు కాదు. ఐదేళ్ల తర్వాతనైనా వెల్లడించినందుకు’’ అన్నాడు! అతడి కళ్లలో విప్లవ భావాల్లాంటివేవో కదలాడుతున్నాయి.
‘‘అడ్వాణీ జీ.. ఏళ్లుగా మీరు సిట్టింగ్‌ ఎంపీ. ఐదేళ్లుగా నేనూ సిట్టింగ్‌ ఎంపీ. ఇద్దరికీ టిక్కెట్‌లు రాలేదు. నిలబడవలసిన టైమ్‌ కూడా రాలేదంటారా?’’ అన్నాడు జోషీ.
మాధవ్‌ శింగరాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top