వంటింటి కథ | Sakshi
Sakshi News home page

వంటింటి కథ

Published Thu, Jun 25 2015 11:08 PM

వంటింటి కథ

హ్యూమర్ ఫ్లస్
సుందరి, సుబ్బారావులు భార్యాభర్తలు. అయినా ఒకే మాటపై ఉంటారు. సినిమాల్లోలా ఒకే పాట పాడుతారు. ఇద్దరికీ వంటలంటే ఇష్టం. స్టార్ వరల్డ్‌లో వచ్చే మాస్టర్ చెఫ్‌తో మొదలుపెట్టి లోకల్ ఛానల్స్‌లో వచ్చే మీ ఇంటి వంట వరకూ అన్నీ చూస్తారు.
పేపర్లలోని రెసిపీలను కట్‌చేసి దాచుకుంటారు. ఉల్లిపాయల్ని ఎన్ని రకాలుగా కోస్తారో, క్యాలిఫ్లవర్‌ని ఏ రకంగా కడుగుతారో నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తారు. ఇంటికి గెస్ట్ వస్తే ఇద్దరూ పోటీపడి మాట్లాడుతారు.
 
‘‘దేవుడొక్కడే అయినా రూపాలు అనేకం అయినట్టు, కోడి ఒక్కటే కానీ, కూరలు కోకొల్లలు. చికెన్ ఉంటేనే కిచెన్‌కి అందం. కోడి లేకుండా పకోడి ఉండచ్చు. చికెన్ లేకుండా చికెన్ 65 ఉండదు. తందూరి ఎలా వండుతారంటే...’’ అని సుబ్బారావు స్టార్ట్ చేస్తే సుందరి దూరి,
 ‘‘చిల్లీ చికెన్‌లో మిర్చీ కనపడనట్టు, బటర్ చికెన్‌లో పెరుగు అంతర్లీనంగా ఉన్నట్టు దేన్నీ మనం నేరుగా చూపకూడదు, చెప్పకూడదు. వంట కూడా ఒక మార్మిక కళ. 64 కళల్లో పాకశాస్త్రం ముఖ్యమైంది. వంటవాళ్లలో నలభీములు ముఖ్యులు...’’ఈ ప్రవాహం ఇలా సాగుతూ ఉండగా ఒక నిమ్మకాయతో సుబ్బారావు వస్తాడు.
 ‘‘చికెన్ కబాబైనా, రుబాబైనా, పత్తర్‌కి ఘోష్, కలాపత్తర్‌కి ఫిష్ అయినా నిమ్మ పిండితే ఆ టేస్టే వేరు. నిమ్మని రెండు రకాలుగా పిండొచ్చు. చేత్తో పిండితే గింజలు చెయ్యిజారిపోతాయి. అదే జ్యూసర్‌లో వేస్తే తొక్క తుక్కయిపోతుంది. నిమ్మ చెక్కయినా, తొక్కయినా...’’
 
సుందరి అడ్డుపడి, ‘‘నిమ్మకి పెద్దన్న దానిమ్మ. పెరుగన్నంలోకి దానిమ్మ వేస్తే...’’
 ‘‘నువ్వు కాస్తాగు. బాబాయిగారికి టమోటా టాంటాం గురించి చెబుతా. టమోటాని దీర్ఘ చతురస్రాకారంగా కోసి ఉప్పు చల్లి, ఉడికించి, మిరియాలు వేసి, ఆవాలు తిరగమోత పెట్టి...’’ అంటాడు సుబ్బారావు.
 ‘‘అసలు పాలకూర జావ తాగితే ఉంటుంది రుచి... పాలకూరని పద్దెనిమిదిసార్లు కడిగి, ఇరవై సార్లు జాడించి, పొయ్యి వెలిగించకముందే బాణలి పెట్టి...’’ సుందరి దెబ్బకి అతిథి పారిపోతాడు.
 ఆ తరువాత వీళ్లిద్దరూ కూచుని గోరంత పసుపు పొడితో కొండంత జబ్బులు ఎలా మాయమవుతాయో చర్చిస్తారు. ఒకసారి ఏదో పేపర్‌లో వంకాయలు కోసే విధానం గురించి తప్పుగా రాశారని, ఆ ఎడిటర్‌కి చేత్తో ఉత్తరం రాయడంతో పాటు, ఈమెయిల్ పంపి, ఫేస్‌బుక్‌లో డిబేట్ పెట్టారు. తమ వాదనని సమర్థించుకోవడానికి హోరాహోరీగా పోరాడారు.
 
ధమ్ బిరియాని గురించి సుబ్బారావు ఒక వ్యాసం రాస్తే, ధమ్మర్‌ధమ్ బిరియాని గురించి సుందరి ఇంకో వ్యాసం రాసింది. రెంటికి తేడా ఏంటో అర్థంకాక, పాఠకులు జుత్తు పీక్కుంటే ములక్కాయల రోస్ట్ తింటే జుత్తు ఏపుగా పెరుగుతుందని చిట్కా కూడా రాశారు.
 వంటల గురించి ఏళ్ల తరబడి యుద్ధం చేసిన ఈ దంపతులు వండగా చూసినవాళ్లు లేరు, తిన్నవాళ్లూ లేరు. వీళ్లను చూసి నవ్వినవాళ్లూ లేరు. జీవితమంతా ఆదర్శాలు, ఆశయాల గురించి కలవరిస్తూ, ఒక్కక్షణం కూడా ఆచరించకుండా జీవించేవాళ్లు కోట్లాది మంది ఉండగా, వీళ్లను చూసి నవ్వడమెందుకు? ఈ దంపతులు నిజంగా అమాయకులు.    
 - జి.ఆర్.మహర్షి

Advertisement
Advertisement