అన్నంలో ఆరోగ్యాన్ని కలుపుకున్నట్లే!

Good food with Mesta - Sakshi

కాస్తంత ఎక్కువ పులుపు... కాస్త తక్కువ వగరు కలగలిసిన రుచితో గోంగూరను విడిగా వండుకోవచ్చు. అలాగే పప్పు, మాంసాహారాలు... దేనితో కలిపి వండినా రుచినిస్తుంది. అందుకే దీన్ని వంటల్లో విరివిగా వాడతారు. రుచిపరంగా తెలుగువారికి ఎంత ప్రియమో... ఆరోగ్యపరంగా అందరికీ అంత ప్రయోజనం. గోంగూరతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని.
గోంగూరులో విటమిన్‌–సి పాళ్లు చాలా ఎక్కువ. దాంతో ఇది మంచి రోగ నిరోధకశక్తిని సమకూర్చుతుంది. ఇందులో విటమిన్‌–ఏ కూడా ఎక్కువే. చాలా రకాల కంటి జబ్బులను నివారించడంతో పాటు చూపును దీర్ఘకాలం పదిలంగా కాపాడుతుంది.
 గోంగూరలో అన్నిటికంటే ఐరన్‌ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఇది రక్తహీనతను సమర్థంగా నివారిస్తుంది. అనీమియా వ్యాధిగ్రస్తులకు ఇది మంచి స్వాభావికమైన ఔషధం అని చెప్పవచ్చు.
♦  ఇందులో పీచుపదార్థాలు అధికం. అందుకే ఇది జీర్ణకోశం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పేగుల కదలికలు సమర్థంగా జరిగేలా చూస్తుంది. ఈ పీచుపదార్థాల కారణంగానే స్థూలకాయులు బరువు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
 గోంగూరలో పొటాషియమ్‌ కూడా ఎక్కువే. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి గోంగూర బాగా ఉపకరిస్తుంది.
♦  మెగ్నీషియమ్‌ వంటి ఖనిజలవణాల వల్ల మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మేని నిగారింపునకు, జుట్టు నిగనిగలాడటానికి కూడా గోంగూర సహాయం చేస్తుంది.
♦  గోంగూరలో చెడుకొవ్వును అరికట్టే శక్తి ఉంది. ఈ లక్షణంతో పాటు పొటాషియమ్‌తో రక్తపోటును అదుపు చేసే శక్తి కలగలసి... ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top