అందరిలా ఎందుకు? | Father of Indian nuclear program 'Homi Baba death anniversary today | Sakshi
Sakshi News home page

అందరిలా ఎందుకు?

Jan 24 2018 12:07 AM | Updated on Jan 24 2018 12:07 AM

Father of Indian nuclear program 'Homi Baba death anniversary today - Sakshi

పిల్లల్తో రోజూ కాసేపు కలసి కూర్చుంటే, కలసి మాట్లాడితే.. వాళ్లెంత భిన్నమైనవారో అర్థమౌతుంది.

హోమీ జహంగీర్‌ బాబా ప్రసిద్ధ అణు భౌతిక శాస్త్రవేత్త. చిన్నప్పుడు సరిగ్గా నిద్ర పోయేవాడు కాదు. చదువులో పడి నిద్రపోకపోవడం కాదు... ఆలోచనల్లో పడి నిద్ర పోకపోయేవాడు! ‘ఇక పడుకోరా..’ అంటే నిద్ర రావడం లేదనేవాడు! డాక్టర్లు సమస్యేం లేదనేవాళ్లు. చివరికి స్పెషలిస్టు ఒకాయన కనిపెట్టి చెప్పాడు.. ‘‘మీవాడి బ్రెయిన్‌ సూపర్‌ యాక్టివ్‌’గా పనిచేస్తోంది అని! అందుకే అదెప్పుడూ మేల్కొనే ఉంటోందనీ! హోమీకి సైన్స్‌ అంటే ఇష్టం. అతడివన్నీ సైన్స్‌ చుట్టూ తిరిగే ఆలోచనలే. పిల్లవాడి ఇష్టాన్ని గ్రహించి, ఏకంగా ఇంట్లోనే ఒక గ్రంథాలయం ఏర్పాటు చేశారు పేరెంట్స్‌! పిల్లల్ని మనం ఎప్పుడూ మిగతా పిల్లల్తో పోల్చుకుంటూ ఉంటాం. అందరు పిల్లలూ ఉన్నట్లు వీడెందుకు ఉండడు? అని మథన పడుతుంటాం. అందరు పిల్లలూ ఎలా ఉంటారు? ఎలాగైనా ఉంటారు. ఒకేలా మాత్రం ఉండరు. అయితే.. మనం ఒకేలా ఉండే పిల్లల్ని మాత్రమే చూస్తాం. చక్కగా చదువుకునే పిల్లలు; వేళకు చదువుకుని వేళకు నిద్రపోయే పిల్లలు, పెట్టింది వద్దన కుండా, వదిలిపెట్టకుండా తినే పిల్లలు.. వీళ్లతో మనవాళ్లను పోల్చి చూసుకుంటాం. అప్పుడు మన పిల్లవాడేదో వెనకబడిపోతున్నాడనీ, ఆరోగ్యంగా లేడనీ, వీడి భవిష్యత్తు ఏమిటోనని కలత చెందుతాం. అంతే తప్ప తక్కిన పిల్లలకీ, మన వాడికీ మధ్య ఉన్న తేడాలను మాత్రం గమనించం. తేడాలను గమనించకుండా, పోలికలను మాత్రమే చూసుకుంటే కలిగే ఇబ్బందే ఇది. 

హోమీ బాబా తల్లిదండ్రులు కూడా మొదట హోమీని ఇలాగే పోల్చి చూసుకున్నారు. డాక్టర్‌ చెప్పాక తేడాను గమనించి, పిల్లవాడిలోని ఆసక్తిని గమనించి అతడిని కావలసిన సదుపాయాలను అందించారు. హోమీ గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగాడు. పిల్లలు ఎదక్కుండా పోరు. మన ఇష్టాలకు తగ్గట్లు వాళ్లను ఎదిగేలా చేయాలన్న తపనే మన బాధకు, పిల్లవాడి కష్టానికి కారణం అవుతుంటుంది. పిల్లల్తో రోజూ కాసేపు కలసి కూర్చుంటే, కలసి మాట్లాడితే.. వాళ్లెంత భిన్నమైనవారో అర్థమౌతుంది. ఆ భిన్నత్వానికి భిన్నంగా మనమెలా ఆలోచించి వాళ్లపై ఒత్తిడి తెస్తున్నామో తెలుస్తుంది. 
(‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ హోమీ బాబా వర్ధంతి నేడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement