ఆఖరి  వేడ్కోలు

Compendium Of Spanish Story Tell Them Not To Kill Me - Sakshi

కథాసారం

‘‘నన్ను చంపొద్దని చెప్పురా, జస్టినో. పో, పోయి చెప్పు. దేవుడి మీదొట్టు, దయచేసి నన్ను చంపొద్దని చెప్పు.’’
‘‘నా వల్ల కాదు. అక్కడున్న హవల్దారు నీ గురించి వినడానికే సిద్ధంగాలేడు.’’
‘‘ఏదోటి చేసి నా గోడు చెప్పురా. నీ తెలివి వాడు. దేవుడా, నన్ను భయపెట్టింది చాలు.’’
‘‘నిన్ను భయపెట్టడానికని అనిపించట్లేదు. నిజంగానే నిన్ను చంపేటట్టున్నారు. నేను మళ్లీ పోయి అడగలేను.’’
‘‘బాబ్బాబు ఒకే ఒక్కసారి పోరా. ఏం చేయగలవో చూడు.’’
‘‘లేదు, నేను మళ్లీ మళ్లీ అడిగానంటే వాళ్లకు నేను నీ కొడుకునని తెలిసిపోతుంది. నన్ను కూడా కాల్చేసినా కాల్చేస్తారు.’’
‘‘జస్టినో, కాస్త నా మీద కనికరం చూపించమని అడగరా.’’
జస్టినో పళ్లు కొరుకుతూ తల అడ్డంగా ఊపుతూనే ఉన్నాడు.
‘‘ఆ హవల్దారును అడుగు ఓసారి కల్నల్‌ను కలుస్తానని. నేనెంత ముసలోన్ని అయిపోయానో చెప్పు. నన్ను చంపితే వాళ్లకు ఏమొస్తుంది? ఆయన ఆత్మగలవాడే అయివుంటాడు. అలాంటివాడికి ముక్తి ఎట్లా వస్తుంది?’’
కూర్చున్న రాళ్ల కుప్ప మీదినుంచి లేచి, పశువుల దొడ్డి వైపు నడుస్తున్నవాడల్లా వెనక్కి తిరిగి, ‘‘సరే, వెళ్తాను. కానీ వాళ్లు నన్ను కూడా కాల్చేశారనుకో నా భార్యా పిల్లల గతేం కాను?’’ అన్నాడు జస్టినో.
‘‘దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు. ముందైతే నువ్వు పో, ఏం చేయగలవో చూడు.’’

మబ్బుల్నే తెచ్చారతణ్ని. తెల్లారిపోయింది, అయినా అక్కడే స్తంభానికి కట్టేసివున్నాడు, ఎదురుచూస్తూ. నిటారుగా ఉండలేకపోతున్నాడు. శాంతపడటానికి కాసేపు నిద్రకు ప్రయత్నించాడు గానీ పట్టలేదు. ఆకలిగా కూడా లేదు. అతడికి కావాల్సిందల్లా బతికివుండటం. ఎప్పుడైతే వాళ్లు చంపేస్తారని నిశ్చయంగా తెలిసిందో అప్పటినుంచీ అదే కోరిక ఉధృతం అవుతోంది.

ఎప్పుడో ఎన్నో ఏళ్ల కింద కాలగర్భంలో కలిసిపోయిన సంగతి ఇలా మళ్లీ పైకి తేలుతుందని ఎవరు మాత్రం అనుకున్నారు? డాన్‌ లూప్‌ను చంపాల్సిన పరిస్థితి రావడం. కొందరు అనుకున్నట్టు ఎందుకూ కొరగాని విషయానికి. కానీ దానికి తనవైన కారణాలున్నాయి. అతడికి గుర్తే: ఆ ప్యూర్తా దె పియెద్రా యజమాని డాన్‌ లూప్‌ టెర్రెరోస్, అతడి సహచరుడు జువెన్సియో నావా, అంటే తనే, తన పశువుల్ని అతడు తన చేనులోకి రానివ్వకపోవడం. మొదట్లో ఇబ్బందేమీ లేదు. కానీ ఎప్పుడైతే కరువొచ్చిందో, గడ్డికి కడుపు మాడి జీవాలు ఒక్కోటీ వరుసగా చనిపోవడం మొదలైందో, అప్పుడు అతడు ఆ డొక్కలు పోయినవాటిని కంచె దాటించడం మొదలుపెట్టాడు. అది నచ్చని డాన్‌ లూప్‌ కంచెను బాగు చేయించాడు, కానీ జువెన్సియో నావా దాన్ని తిరిగి కత్తిరించాడు. పగలు ఆ కంచె బొక్క మూసుకుపోతుంది, రాత్రికేమో తెరుచుకుంటుంది. ఈ విషయం మీద డాన్‌ లూప్‌కూ తనకూ మాటా మాటా పెరిగింది. ఓసారి లూప్‌ గట్టిగానే హెచ్చరించాడు. ‘‘చూడు జువెన్సియో, ఇంకోసారి నీ మందలోంచి ఒక్కటి నా చెలకలోకి వచ్చినా దాన్ని చంపేస్తాను.’’

దానికి అతడు గట్టిగానే జవాబిచ్చాడు, ‘‘డాన్‌ లూప్, అవి నోరులేనివి, గడ్డికోసం వాటి దారి అవి వెతుక్కుంటున్నాయి, అది నా తప్పు కాదు. దేనికైనా ఏమన్నా అయితే మాత్రం నువ్వు తగిన ఖరీదు కట్టివ్వాలి.’’
అన్నట్టే అతడు రెండేళ్ల పశువును చంపేశాడు. ఇది ముప్పై ఐదేళ్ల క్రితం మార్చిలో జరిగింది, ఎందుకంటే ఏప్రిల్‌ కల్లా నేను కొండల్లోకి పారిపోయాను, నోటీసుల్ని తప్పించుకోవడానికి. న్యాయమూర్తికి ఇచ్చిన పది ఆవులూ, ఇంటిని వేలం వేసిన సొమ్మూ జైలుకు పోకుండా ఉండటానికి ఖర్చయింది. అయినా వాళ్లు మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉన్నారు. అప్పుడే నా కొడుకును తీసుకుని పాలో దె వెనాదో వైపు వచ్చాను. వాడు పెరిగాడు, ఇగ్నేసియాను పెళ్లి చేసుకున్నాడు, ఎనిమిది పిల్లలు కలిగారు వాళ్లకు. కాబట్టి ఆ సంగతి ఎప్పుడో పాతబడిపోయిందనుకున్నాను.

వంద పెసోలతో అంతా చక్కబడుతుందనుకున్నాను. చచ్చిపోయిన లూప్‌కు భార్యా ఇద్దరు  చిన్న పిల్లలూ ఉన్నారు. విధవరాలు వెంటనే చనిపోయింది, కొందరు బాధతో చనిపోయిందన్నారు. పిల్లల్ని దూరంగా వాళ్ల బంధువులెవరో తీసుకుపోయారు. ఇంక భయపడటానికి ఏమీలేదనుకున్నాను.

కానీ మిగతా జనం ఉంటారుకదా, నన్ను ఇంకా దోచుకోవడానికి, ఎవరో కొత్తవాళ్లు నీకోసం అడిగారని చెబుతూనే ఉన్నారు. గుట్టల్లో దాక్కుంటూ, అక్కడ దొరికిందేదో తింటూ రోజులు గడపాల్సి వచ్చేది. ఏదో అర్ధరాత్రి కుక్కలు వెంటపడుతుండగా ఇల్లు చేరాల్సి వచ్చేది. జీవితమంతా ఇలాగే. ఒక ఏడాదీ రెండేళ్లూ కాదు, యావజ్జీవితం.
కానీ మళ్లీ అతడికోసం వచ్చారు వాళ్లు, నిజంగానే అందరూ మరిచిపోయివుంటారని అతడికి నమ్మకం కుదిరాక. కనీసం చివరి రోజులైనా ప్రశాంతంగా బతుకుదామని అనుకున్నాడు.
భార్య తనను వదిలిపెట్టినా ఆమెను వెతకడానికి కూడా ప్రయత్నించలేదు. ఆమె కోసం మళ్లీ వెతకాలన్న ఆలోచన కూడా రాలేదు. ఆమె ఎవరితో పోయిందో కూడా పట్టించుకోలేదు. అన్నీ వదిలేసినట్టే ఆమెనీ వదిలేశాడు. పరుగెత్తీ పరుగెత్తీ అలసిపోయాక, దేహం ఉడిగిపోయాక ఇప్పుడొచ్చి వీళ్లు ఈ ముసలితనంలో పట్టుకుంటారని మాత్రం అతడు కలలో కూడా అనుకోలేదు.

కానీ పాలో దె వెనాదోకు వచ్చారు వాళ్లు. కట్టాల్సిన పని కూడా లేకపోయింది. మౌనంగా వాళ్లను అనుసరించాడు. అతడి కాళ్లు బరువుగా కదిలాయి, నోరు ఎండిపోయింది, కడుపులో సలపడం మొదలైంది, మృత్యువును తలుచుకోగానే అతడికి ఇన్నేళ్లనుంచీ అయినట్టు. అయినా వాళ్లు తనను చంపబోతున్నారనే ఆలోచనను అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. వాళ్లు తన కోసం కాకుండా ఇంకో జువెన్సియో నావా కోసం వెతుకుతున్నారు కావొచ్చు. నేనెవరినీ ఏమీ చేయలేదని తనను పట్టుకున్న మనుషులకు చెబుదామనుకున్నాడు. నోరు పెగల్లేదు. ఇంకొంత దూరం పోయాక చెబుదామనుకున్నాడు. వాళ్ల ముఖాలను అతడు చూడట్లేదు, వాళ్ల శరీరాలు కనబడుతున్నాయి. అతడు మాట్లాడటం మొదలుపెట్టాక వాళ్లు విన్నారో లేదో కూడా తెలీదు. వాళ్లు ఇతనివైపు చూడనేలేదు. ఆశ చాలించుకొని చేతులు వేలాడేసుకుని నడవటం మొదలుపెట్టాడు.

‘‘కల్నల్, ఆ మనిషిని తెచ్చాం.’’
ఒక ఇంటిముందు ఆగారు వాళ్లు. అందులోంచి వచ్చే మనిషి కోసం అతడు గౌరవంగా టోపీ తీసి నిలబడ్డాడు. మనిషి రాలేదు, గొంతు వినబడింది. ‘‘ఏ మనిషి?’’
‘‘అదే, పాలో దె వెనాదో నుంచి కల్నల్‌.’’
‘‘అతడు అలిమాలో ఎప్పుడైనా ఉన్నాడో అడగండి?’’
అడిగారు. చెప్పాడు.
‘‘అతడికి గ్వాడలూప్‌ టెర్రెరోస్‌ తెలుసేమో అడగండి.’’
‘‘డాన్‌ లూప్‌? అవును, నాకు తెలుసు. అతడు చనిపోయాడు.’’
ఇంట్లోంచి గొంతు మారింది. ‘‘ఆయన చనిపోయాడని నాకు తెలుసు.’’ అవతలి ఒడ్డున ఉండి మాట్లాడుతున్నట్టుగా అతడు సంభాషిస్తున్నాడు.
‘‘గ్వాడలూప్‌ టెర్రెరోస్‌ మా నాన్న. నేను పెరిగి పెద్దయ్యాక నాన్న ఏడని అడిగితే చచ్చిపోయాడని చెప్పారు. మేము ఏ వేళ్లనుంచైతే ప్రాణం పోసుకోవాలో ఆ వేరే చనిపోయిందని తెలిసి బతకాల్సిరావడం దుర్భరం. కొన్నేళ్ల తర్వాత ఆయన్ని ముందు కత్తితో నరికి, అటుపై ముల్లుగర్రతో కడుపులో గుచ్చి చంపేశారని తెలిసింది. ఆయన రెండ్రోజుల పాటు వాగులో పడివున్నాడు, చివరగా ఆయన్ని చూసినవాళ్లతో తన కుటుంబాన్ని ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడ్డాడు.
కాలం గడిచినకొద్దీ నువ్వు ఇది మరిచిపోయుంటావు. కానీ ఇదంతా చేసినవాడు ఇంకా బతికేవున్నాడనే విషయాన్ని నేను మరిచిపోలేను. ఆయనెవరో తెలియకపోయినా కూడా నేను క్షమించలేను. నువ్వు అసలు ఈ భూమ్మీదే పుట్టకుండా ఉండాల్సింది.’’
ఇదంతా చెప్పాక ముసలాయన్ని తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు. ముసలయాన బతిమాలాడు.  జీవితాంతం తను చేసిన తప్పుకు మూల్యం చెల్లిస్తునే ఉన్నాననీ, ఏ క్షణమైనా తనను చంపుతారనే భయంతోనే ఇన్నేళ్లూ బతికాననీ, ఇంత నికృష్టమైన చావుకు తాను అర్హుడిని కాననీ...
లోపల్నుంచి ఒకటే మాట వచ్చింది, ‘‘అతణ్ని కట్టేయండి, కాల్పులు బాధించకుండా ఉండటానికి ఏమైనా తాగించండి.’’

ఎట్టకేలకు అతడు మూగబోయాడు. స్తంభం పాదాల దగ్గరికి వాలిపోయాడు. తండ్రి శవం రోడ్డు దగ్గరి గోతిలోకి జారకుండా పైకి లాగాడు జస్టినో. మరీ బాగుండదని ముఖాన్ని గోనెసంచిలో దాచాడు. గాడిద మీద శవాన్ని వేసుకుని పాలో దె వెనాదో వైపు దౌడు తీశాడు, మరీ చీకటిపడితే రాత్రి శవాన్ని కాపలా కాయడానికి మనిషెవరూ దొరకరు.
‘‘నీ కోడలు, నీ మనవలు నువ్వు లేవని తెలిస్తే ఏమంటారో. నీ ముఖాన్ని చూసి నువ్వని మాత్రం నమ్మరు వాళ్లు. నీ ముఖం మీద తగిలిన బుల్లెట్‌ రంధ్రాలను చూసి ఏదైనా అడవి కుక్క నీ ముఖాన్ని తినేసిందని అనుకుంటారు.’’ 

క్వాన్‌ రూసో (1917–86) స్పానిష్‌ కథ ‘టెల్‌ దెమ్‌ నాట్‌ టు కిల్‌ మి’కి సంక్షిప్త రూపం ఇది. అనువాదం: సాహిత్యం డెస్క్‌. రచనా కాలం: 1951. తక్కువ కథలు, ఒక నవలికతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న క్వాన్‌ రూసో మెక్సికోలో జన్మించాడు. ఆయన కథల్లో ఇది ప్రసిద్ధం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top