సీడీల సిత్రాలు... | Sakshi
Sakshi News home page

సీడీల సిత్రాలు...

Published Thu, Oct 3 2013 1:28 AM

collfull diegning in CD'S

కంప్యూటర్లు వాడుకలోకి వచ్చాక సీడీల ఉపయోగం లెక్కకు మించి పెరిగింది. పాటలు వినాలన్నా, ఫొటోలు నిక్షిప్తం చేసుకోవాలన్నా, సినిమాలైనా, ప్రాజెక్ట్ వర్క్ అయినా, పరదేశీ విచిత్రాలైనా.. సీడీలలో పొందుపరుచుకోవడం మామూలైపోయింది. ఈ క్రమంలో పాడైపోయాయి అనుకున్న సీడీలను ఏం చేస్తారు? ‘చెత్తబుట్టలోకి చేర్చుతాం’ అనే సమాధానం మీదైతే ఇది మీకోసమే...!

 పనికి రావనుకున్న సిడీలకు మీదైన కొంత సృజనను జోడిస్తే చాలు ఇంటి అందాన్ని పెంచేవి, ఉపయుక్తమైన ఎన్నో వస్తువులను తయారుచేసుకోవచ్చు.
 
 లేసులున్న రెండు వరసల రిబ్బన్‌కు మూడు నాలుగు సీడీలను అతికించి, ఆ సీడీల భాగంలో మీ ఫొటోలను సెట్ చేయండి. అందమైన ఫొటో వాల్ హ్యాంగర్ ఆకట్టుకుంటుంది  
 
 రంగురంగుల వెల్వెట్ పేపర్‌ను సీడీలపై అతికించి చమ్కీ, అద్దకంతో మెరుపులు తీసుకువస్తే ముచ్చటగొలిపే సీనరీ సిద్ధమవుతుంది  
 
 సీడీ మధ్యలో వెడల్పాటి రంధ్రం ఉంటుంది. ఐరన్ రాడ్‌కి సీడీలను గుచ్చి, దుస్తులను తగిలించే హ్యాంగర్‌లా ఏర్పాటు చేసుకోవచ్చు   
 
 సీడీకి ఒకవైపు రంగుల కాగితాన్ని అతికిస్తే గ్లాసులు, కప్పులు ఉంచడానికి కోస్టర్స్ రెడీ  
 సీడీలే కాదు సీడీ కేస్‌లు కూడా ఖాళీగా పడుంటాయి. వీటి మధ్య భాగంలో నచ్చిన క్యాలెండర్ పేపర్‌ని సెట్ చేయాలి. టేబుల్ క్యాలెండర్‌గా వాడుకోవచ్చు   
 
 ఇంటి మధ్యలో పైకప్పుకు వేలాడదీయడానికి మార్కెట్లో రకరకాల హ్యాంగర్స్ కొనుగోలు చేస్తుంటారు. వాటికి బదులుగా రంగుల పేపర్‌తో సిద్ధం చేసుకున్న సీడీకి చివర్ల పూసల దారాలు జత చేస్తే చూడముచ్చటైన షాండ్లియర్ కనువిందుచేస్తుంది   భానుడు, గజాననుడు.. దేవుళ్ల రూపాలను సీడీలతో రూపొందించవచ్చు   మూడు సీడీలను తీసుకొని త్రికోణాకారంలో చివరలను జత చేయాలి. పైన కొలనులా వచ్చేలా పేపర్‌ను రకరకాలుగా మడిచి  అందమైన క్రాఫ్ట్‌ను తయారుచేయవచ్చు. పువ్వులతో షో పీస్ ఆకట్టుకుంటుంది   
 
 ఒక సీడీని తీసుకొని రంగురంగుల వస్త్రాలు, లేసులు ఉపయోగించి అందమైన సీనరీని రూపొందించవచ్చు పూల కుండీలు ప్లెయిన్‌గా ఉంటే అందంగా లేవా? అయితే విరిగిన సీడీలను మరిన్ని ముక్కలుగా కత్తిరించి కుండీలకు గట్టి గ్లూతో అతికించండి. ఎన్ని రంగులు కుండీ రిఫ్లెక్స్ చేస్తుందో చూడండి   
 
 సీడీ కేసులను నాలుగు కలిపి ఒక బాక్స్‌లా రూపొందించవచ్చు. దాన్ని పెన్‌హోల్డర్‌గానో, లేదా ఫొటో ఆల్బమ్స్ సెట్ చేసుకునే స్టాండ్‌గానో వాడుకోవచ్చు. పిల్లల ఫొటోలతో ఉండే సీడీ కేస్ టేబుల్ మీద పెడితే మరింత అందంగా ఉంటుంది   సీడీని వాల్ క్లాక్‌గానూ మార్చేయవచ్చు.
     
 పాత సీడీలతో ఇన్ని రకాల వస్తువులను తయారుచేయవచ్చు అని తెలిశాక వాటిని చెత్తబుట్ట పాల్జేయడం ఎందుకు? చక్కని ఇంటి అలంకరణ వస్తువులుగా మార్చడానికి ఇప్పుడే పనిని మొదలుపెట్టండి. సీడీలతో రకరకాల చిత్రాలు రూపొందించి ‘ఏమిటీ వి‘సిత్రం’ అని ముక్కున వేలేసుకునేలా చేయండి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement