పాత్రకు మౌల్డ్‌ అవుతున్నారు

The Character Is Being Molded With Makeup By Actress - Sakshi

ఒకప్పుడు మేకప్‌ మీద శ్రద్ధ దక్షిణాదిలో కమలహాసన్‌కే ఉండేది.సాగర సంగమంలో సహజమైన ముసలిరూపం చూపడానికి ఆయన మేకప్‌ శ్రద్ధే కారణం.భామనే సత్యభామనే, భారతీయుడు సినిమాలతో ఆయనే ప్రోస్థెటిక్‌ మేకప్‌ను ప్రవేశపెట్టాడు.ఇప్పుడు పాత్రను మౌల్డ్‌ చేయడానికి ప్రతి ఆర్టిస్ట్‌ మేకప్‌నుఆశ్రయిస్తున్నాడు. జనానికి నచ్చుతున్నాడు.

సినిమా అంటేనే ట్రిక్కు. ప్రేక్షకుడిని మాయ చేయడానికి ట్రిక్కీగా రకరకాల కథలు అల్లుతారు. రకరకాల పాత్రలు సృష్టిస్తారు. విచిత్రమైనవి. వీరోచితమైనవి. అందమైనవి. అందవిహీనమైనవి. ఈ పాత్రల్లోకి ప్రేక్షకుడిని లీనం చేయడానికి నటులు కొన్నిసార్లు సన్నబడతారు. పాత్ర బరువువైనది అయితే బరువు పెరుగుతారు. కుదరని పక్షంలో ‘ప్రోస్థెటిక్‌ మేకప్‌’ సాయం తీసుకుంటున్నారు. థియేటర్‌లో ప్రేక్షకుడిని సీట్‌లో నుంచి కదలనీయకుండా కూర్చోబెట్టడం కోసం, గంటల కొద్దీ మేకప్‌ చైర్‌లో కూర్చుని శ్రమిస్తున్నారు. ఈ ప్రోస్థెట్రిక్కులను ఉపయోగించే ‘భారతీయుడు’ లో కమల్‌హాసన్‌ వయసుని అమాంతం ఎనభైకి తీసుకెళ్లగలిగారు. ఈ ట్రిక్కే మొన్న ‘2.0’లో అక్షయ్‌ కుమార్‌ని పక్షిరాజాలా మార్చింది. ప్రస్తుతం ఈ ‘ప్రోస్థెట్రిక్‌’తో చాలామంది నటీనటులు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. ఆ మేకప్‌ మాయను తెలుసుకుందాం.

జయలా ఎలా?
జయలలిత చాలా ప్రఖ్యాత నటి, అంతే గొప్ప ప్రజానేత. కంగనా రనౌత్‌ సమర్థమైన నటి. అందుకే జయ బయోపిక్‌లో ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి తీసుకున్నారు చిత్రనిర్మాత విష్ణు ఇందూరి. అయితే కంగనా ఏ కోశానా జయలా ఉండరు. కొద్దిపాటి ప్రాక్టీస్‌తో కంగన జయలా నటించవచ్చు. కానీ కనిపించడమెలా? కంగారేం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్‌కే ప్రోస్థెటిక్‌ ఉంది.

జయలలితలా మారడానికి లాస్‌ ఏంజెల్స్‌లో ప్రోస్థెటిక్‌కి సంబంధించిన లుక్‌ టెస్ట్‌ చేయించుకున్నారు కంగనా. సినిమాలో నాలుగు గెటప్పుల్లో ఆమె కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రానికి ఏఎల్‌ విజయ్‌ దర్శకుడు. ‘‘ప్రోస్థెటిక్‌ మేకప్‌ను పూర్తి స్థాయిలో తొలిసారి ఉపయోగిస్తున్నాను. నా పాత్ర మీద, హావభావాల మీద ఈ మేకప్‌ ఎంత ప్రభావం చూపుతుందో తెలియదు. కానీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని లుక్‌ టెస్ట్‌ గురించి అన్నారు కంగనా.

ముక్కు పిండే ఓనర్‌
‘గులాబో సితాబో’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ లుక్‌ చూస్తే ‘ముక్కు’న వేలేసుకోకుండా ఉండలేం. సుజిత్‌ సర్కార్‌ తెరకెక్కించిన చిత్రం ‘గులాబో సితాబో’. అమితాబ్, ఆయుష్మాన్‌ ఖురానా నటించారు. ఇంటిగల వాళ్లకి, ఇంట్లో అద్దెకు ఉండేవారికి మధ్య రోజూవారి సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ముక్కు పిండి అద్దె వసూళ్లు చేసే ఇంటి యజమాని పాత్రలో అమితాబ్‌ కనిపిస్తారు. ఈ సినిమాలో బారు ముక్కుతో కనిపిస్తారు అమితాబ్‌. ఇది ప్రోస్థెట్రిక్కే అని మనకు తెలిసిందే.

అమితాబ్‌ వయసు 76. ఈ వయసులో దాదాపు మూడు గంటలు కదలకుండా మేకప్‌ చేయించుకోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ ‘బిగ్‌ బి’ కదా.. ఆయనకు చిన్న విషయంగానే అనిపించింది. అన్నట్లు అమితాబ్‌ ప్రోస్థెటిక్‌ మేకప్‌ ఉపయోగించడం ఇది తొలిసారి కాదు. గతంలో పా, థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్, 102 నాట్‌ అవుట్‌ చిత్రాలకు కూడా వాడారు. ‘గులాబో సితాబో’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయనున్నారు.

ఆత్మస్థైర్యమే అందం
బాలీవుడ్‌ బ్యూటీక్వీన్‌ దీపికా పదుకోన్‌. స్టార్‌ హీరోల్లానే బాక్సాఫీస్‌ దగ్గర టికెట్లు తెంచగలిగే ఫాలోయింగ్‌ ఉన్న స్టార్‌ ఆమె. ఇప్పటివరకూ అందమైన పాత్రలను అద్భుతంగా పోషించిన దీపిక, ఇప్పుడు ఆత్మస్థైర్యాన్ని స్క్రీన్‌ మీద చూపించడానికి సిద్ధపడ్డారు. ఢిల్లీ యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా రూపొందిన ‘చెప్పాక్‌’లో ఆమె నటించారు. మేఘన గుల్జార్‌ దర్శకురాలు. యాసిడ్‌ శరీరాన్ని కాల్చిందేమో కానీ ఆత్మస్థైర్యాన్ని కాదని ప్రేరణగా నిలిచిన లక్ష్మీగా దీపిక నటించారు. ఈ పాత్ర కోసం ప్రోస్థెటిక్‌ మేకప్‌ను ఉపయోగించి ఆ లుక్‌ తీసుకువచ్చారు. మేకప్‌కే దగ్గర దగ్గర నాలుగు గంటలు పట్టేదట. తీయడం కూడా అంత సులువు కాదు. గంటకు పైనే పట్టేదట. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం రిలీజ్‌.

సేనాపతి ఈజ్‌ బ్యాక్‌
ప్రోస్థెటిక్‌ను పూర్తి స్థాయిలో పాపులర్‌ చేసింది ‘భారతీయుడు’ (1996) సినిమా అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో కమల్‌హాసన్, సుకన్య పాత్రలను వృద్ధులుగా హాలీవుడ్‌ టెక్నీషియన్లతో నమ్మించారు. ఆ సినిమాలో క్రాఫ్‌ని కుడి చేత్తో వెనక్కి దువ్వే సేనాపతి మనకు గుర్తే. ఇప్పుడు మళ్లీ  ఆ పాత్రను తిరిగి తీసుకొస్తున్నారు శంకర్‌. 23 ఏళ్ల తర్వాత కమల్‌ – శంకర్‌ కాంబినేషన్‌లో ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌ రూపొందుతోంది. ఈ సినిమాలోనూ కమల్‌ వృద్ధుడిగా నటిస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్, రకుల్, సిద్ధార్థ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2021లో సినిమా రిలీజ్‌ కానుంది. 

గురి తప్పరు
టాప్‌ ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు ముద్దు ముద్దుగా ఉండే పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ వయసు మళ్లిన పాత్రలు చేయడానికి సాహసించరు. అయితే తాప్సీ, భూమీ పెడ్నేకర్‌ ఈ రిస్క్‌
తీసుకున్నారు. ‘సాండ్‌కీ ఆంఖ్‌’ చిత్రంలో ఎనభై ఏళ్ల వృద్ధురాళ్ల పాత్రలో నటించారు తాప్సీ, భూమి పెడ్నేకర్‌. అరవై ఏళ్లు పైబడిన తర్వాత గన్‌ షూటింగ్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించి షార్ప్‌ షూటర్స్‌గా పేరు పొందారు ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్‌. వారి జీవితం ఆధారంగా ‘సాండ్‌కీ ఆంఖ్‌’ చిత్రం రూపొందింది. ఇందులో ప్రకాషీగా తాప్సీ, చంద్రో పాత్రను భూమి చేశారు. అక్టోబర్‌ 25న థియేటర్స్‌లోకి రావడం వీళ్ల టార్గెట్‌. 

బాలా.. జుట్టు గోల
విభిన్న స్క్రిప్టులు ఎంచుకోవడం ఆయుష్మాన్‌ స్టయిల్‌. రోజూవారీ మనం తరచూ చూసే సమస్యలే ఆయన సినిమాల్లోని కథలు. అవే ఆయన వరుస సక్సెస్‌లకు కారణాలు. తాజాగా బట్టతలకు సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను తన సినిమాకు ఎంచుకున్నారు ఆయుష్మాన్‌. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల సమస్యలను ఎదుర్కొంటున్నారు చాలామంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో ‘బాలా’ సినిమా తెరకెక్కుతోంది. ఆయుష్మాన్‌ ఖురానా బట్టతల ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. నవంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించారు.
– గౌతమ్‌ మల్లాది

ప్రోస్థెటిక్‌ మేకప్‌ విధానం ఏంటి?
ప్రోస్థెటిక్‌ మేకప్‌ని స్పెషల్‌ మేకప్‌ ఎఫెక్ట్‌ అని కూడా అంటారు. దీని కోసం నటుని శరీర కొలతలను ప్రోస్థెటిక్‌కి వాడే పదార్థాలతో తీసుకుంటారు. ఆ మౌల్డ్‌ ఆధారంగా కావాల్సిన రూపురేఖలను తయారు చేస్తారు. కావాల్సిన సన్నివేశాల్లో ఈ మాస్క్‌ను ధరించి నటీనటులు నటిస్తారు. ఈ మేకప్‌ కొలతలు ఇవ్వడానికి కొన్ని గంటల పాటు ఏ పనీ చేయకుండా అలా మేకప్‌ సీట్లో కూర్చుని ఉండాల్సిందే. షూటింగ్‌లో ఈ మేకప్‌ ద్వారా ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

సినిమాలో ఆ పాత్ర నిడివి బట్టి ప్రతిరోజూ రెండుమూడు గంటలు మేకప్‌కే కేటాయించాలి.  మేకప్‌ వేసుకున్న తర్వాత తినటానికి వీలుండదు. ప్యాకప్‌ చెప్పాక కూడా మేకప్‌ తీయడానికి రెండు మూడు గంటలు టైమ్‌ పడుతుంది. వీళ్లింత కష్టపడి ఆ కుర్చీల్లో గంటల తరబడి కూర్చునేది థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి వినోదం అందించడానికే. మేకప్‌తో నటీనటులు మారిపోతారు. వాళ్లను చూసి ప్రేక్షకులు మైమరిచిపోతారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top