ఉద్యోగం విడిచి ప్రకృతి సేద్యంలోకి..

Chandra Venkateshwar Rao Nature Farming - Sakshi

ఆత్మసంతృప్తి నివ్వని పనిని, అది ఎంత ఎక్కువ ఆదాయాన్నిచ్చే పని అయినప్పటికీ, మనసు చంపుకొని కొనిసాగించడంలో అర్థం ఏముంది? వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చండ్రా వెంకటేశ్వర్‌రావు మదిలో ఇదే ప్రశ్న మెదిలింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట ఆయన స్వగ్రామం. సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరి వివిధ రాష్ట్రాల్లో పనిచేశారు. వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకూ వస్తున్నప్పటికీ ఉద్యోగంలో పూర్తి సంతృప్తి లేదు. మనసంతా ప్రకృతి వ్యవసాయంపైనే ఉంది. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు. డాక్టర్‌ చో హన్‌ క్యు, పాలేకర్‌ సేద్య పద్ధతుల్లో శిక్షణ తీసుకొని తన పొలంలో ప్రకృతి సేద్యం ప్రారంభించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

‘రసాయన ఎరువులకు అలవాటు పడిన భూముల్లో ప్రకృతి సాగు ప్రారంభిస్తే మొదటి సంవత్సరం ఇబ్బందులు తప్పలేదు. భూమిని సారవంతం చేసుకుంటూ ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండున్నర ఎకరాల్లో చెరకు, మూడున్నర ఎకరాల్లో కాకర, బీర, సొర, దోసతో పాటు చిక్కుడు వంటి పందిరి జాతి కూరగాయలను సాగు చేస్తున్నా. దిగుబడులు సంతృప్తికరంగా ఉన్నాయి. నీటి నిల్వ కోసం 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి కుంటను ఏర్పాటు చేసుకున్నా. పొలంలో ఉన్న నాలుగు బోర్లను వాన నీటితో రీచార్జ్‌ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశా. పొలం ఎగువ భాగంలో చెక్‌ డ్యాం నిర్మించా. ఇంతవరకు నీటి సమస్య లేదు. గతంలో కంటే భూగర్భ జలమట్టం పెరిగింది.

నాలుగు దేశీ ఆవులను కొనుగోలు చేసి వాటి మూత్రం, పేడతోనే మొత్తం 10 ఎకరాల పంటకు కావాల్సిన సహజ ఎరువులు, ద్రావణాలను తయారు చేసుకుంటున్నా. నత్రజని కోసం జీవామృతం, వర్మీవాష్‌ తయారు చేస్తున్నా. జీవామృతం వడకట్టడం కోసం తక్కువ ఖర్చుతో ఫిల్టర్‌ యూనిట్‌ను సొంతంగా తయారు చేశా. డ్రిప్‌ ద్వారా పంటలకు అందిస్తున్నాం. వాగుల్లో సేకరించిన గవ్వలు, కోడిగుడ్ల పెంకులను నానబెట్టి కాల్షియం కోసం ఎరువును తయారు చేస్తున్నా. పొటాష్‌ కోసం పొగాకు కాడల ద్రావణాన్ని పంటలకు అందిస్తున్నా. పూత దశలో ఫిష్‌ అమినో యాసిడ్‌ పిచికారీ చేయడం ద్వారా పంటల దిగుబడితో పాటు నాణ్యత పెరుగుతోంది. బియ్యం కడిగిన నీటితో లాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా తయారు చేస్తున్నా. వరి గడ్డి, చెత్త, కల్లం తుత్తడి, రోడ్డు వెంట ఉండే మొక్కలను తీసుకు వచ్చి ఆచ్ఛాదనగా వాడుతున్నా.

మా పొలంలో సుగంధ సాంబ వరి రకం ఈత దశకు వచ్చింది. 5 అడుగులు పెరగడం విశేషం. రాష్ట్రం అంతటా వరిలో దోమపోటు, అగ్గితెగులు, ఆకుచుట్ట, సుడిదోమ వంటి తెగుళ్లతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే.. మా వరి పొలంలో తెగుళ్లు లేవు. గత సంవత్సరం తెలంగాణ సోన రకం వరి సాగు చేసి ఎకరాకు 25 బస్తాల ధాన్యం     దిగుబడి సాధించా. బియ్యం పట్టించి కేజీ రూ.50కు నేరుగా వినియోగదారులకు అమ్మాను. చెరకు మొక్కల మధ్య అడుగు, సాళ్ల మధ్య 3 అడుగుల దూరంలో సాగు చేస్తున్నా. అధిక సంఖ్యలో పిలకలు వేసి ఏపుగా పెరుగుతోంది. వేసవి నాటికి చెరకు పక్వానికి వస్తుంది. జ్యూస్‌ సెంటర్‌లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా..’ అని వెంకటేశ్వర్‌రావు వివరించారు.

రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వ్యవసాయంలో వాడుతున్నందున వాతావరణ సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. భూమి సారాన్ని కోల్పోయి పంటలు విపరీతమైన తెగుళ్ల బారిన పడుతున్నాయి. తమ ప్రాంత రైతులను ప్రకృతి సేద్యంపై చైతన్య పరిచేందుకు కృషి చేస్తానని వెంకటేశ్వర్‌రావు (96521 11343)  తెలిపారు.

– మేకపోతుల వెంకటేశ్వర్లు, సాక్షి,
కోదాడ రూరల్, సూర్యాపేట జిల్లా 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top