సెంట్రల్ బ్లడ్‌ప్రషర్ అంటే...? | Blood pressure Counseling | Sakshi
Sakshi News home page

సెంట్రల్ బ్లడ్‌ప్రషర్ అంటే...?

Jul 28 2015 11:52 PM | Updated on Apr 3 2019 4:37 PM

సెంట్రల్ బ్లడ్‌ప్రషర్ అంటే...? - Sakshi

సెంట్రల్ బ్లడ్‌ప్రషర్ అంటే...?

సాధారణంగా మనం బ్లడ్ ప్రెషర్‌ను బీపీ ఆపరేటస్‌తో కొలుస్తుంటాం...

బ్లడ్‌ప్రషర్ కౌన్సెలింగ్
ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు మామూలు బీపీ చూడడంతో పాటు ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ కూడా చూశారు. ఈమాట వినడమే కొత్త! సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? దీనికీ, మామూలుగా కొలిచే బ్లడ్ ప్రెషర్‌కూ తేడా ఏమిటి?
- సుహాసిని, చెన్నై

 
సాధారణంగా మనం బ్లడ్ ప్రెషర్‌ను బీపీ ఆపరేటస్‌తో కొలుస్తుంటాం. ఇందులో ఒక పట్టాలాంటి దాన్ని చేతికి కట్టులా కట్టి, దాన్ని గాలితో నింపి, బిగిసేలాచేసి, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు వేగాన్ని కొలుస్తాం. దీన్నే బీపీ అంటారు.
 
రక్తపోటును గుండె దగ్గరే కొలిస్తే... ఆ విలువ సరైనది అని వైద్యనిపుణులు అభిప్రాయం. అలా నేరుగా గుండె స్పందించినప్పుడు అక్కడి రక్తనాళాల్లో రక్తపీడనాన్ని కొలుస్తారు. ఇలా నేరుగా తీసుకున్న గుండెదగ్గరి రక్తనాళాల్లోని రక్తపు పీడనాన్ని ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ అంటారు.
 
ఇటీవల ఈ విధమైన సెంట్రల్ బ్లడ్‌ప్రెషర్‌ను కొలవడానికి ఒక పెన్ వంటి సాధనాన్ని రూపొందించారు. దీని కొనను మణికట్టు (రిస్ట్) వద్ద ఉండే నాడి దగ్గర మృదువుగా ఆనించి, ఆ వచ్చిన కొలతలను కంప్యూటర్‌కు అనుసంధానిస్తారు. ఆ ‘పల్స్ వేవ్’ విలువలను కంప్యూటర్ గణించి, నేరుగా గుండెదగ్గరి రక్తనాళాల్లో రక్తపోటు ఎంత ఉందో లెక్కలు వేస్తుంది. దీని ఆధారంగా మనం గుండెదగ్గరి రక్తపోటును తెలుసుకుంటామన్నమాట.
 
ఇలా నేరుగా గుండెదగ్గర అది స్పందించినప్పుడు రక్తం తొలుత గురైన పీడనాన్నీ అంటే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్‌నూ, సాధారణంగా చేతి దగ్గర పట్టా చుట్టి, అందులో గాలి నింపి తీసుకునే సాధారణ బ్లడ్ ప్రషర్‌నూ తెలుసుకుంటూ ఇంకా ఈ విలువలను సరిపోల్చి చూస్తున్నారు. మామూలుగా మనం చేతి దగ్గర తీసే బ్లడ్‌ప్రెషర్‌ను కొన్ని కోట్లమందిలో అనేకసార్లు గణించి సాధారణ రక్తపోటు ప్రమాణాన్ని ‘120/80’గా నిర్ణయించాం. కానీ సెంట్రల్ బ్లడ్‌ప్రెషర్‌తో తీసే విలువలకు ఇంకా నిర్ణీత ప్రమాణాలను రూపొందించలేదు. ఎందుకంటే మన రక్తపోటు క్షణక్షణానికీ మారిపోతూ ఉంటుంది. అంతేగానీ స్థిరంగా ఉండదు.

కాబట్టి ఒక స్థిరమైన నార్మల్ విలువ వచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంకా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. త్వరలోనే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్‌కూ ‘ప్రమాణాలను’ రూపొందిస్తే అప్పుడు మామూలు బ్లడ్‌ప్రెషర్ స్థానాన్ని ఆధునికంగా తీసే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ విలువలు ఆక్రమించడం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ల అంచనా. ప్రస్తుతానికి ఈ సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ కొలవడం ఇంకా అన్నిచోట్లా అందుబాటులోకి రాలేదు కాబట్టి అప్పటివరకూ సాంప్రదాయికంగా మనం కొలిచే సాధారణ రక్తపోటు విలువలనే ఇంకా తీసుకుంటున్నాం.
 
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్,
లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement