సౌరమానం

Astrologers view - Sakshi

జన్మనక్షత్రం తెలియదా?
నో ప్రాబ్లమ్‌! మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు) మీ రాశి ఫలితాలు

మేషం
(మార్చి 21 – ఏప్రిల్‌ 19)

కుజ బుధ గురు రాహు గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగానూ శని ప్రతికూలంగా ఉన్న కారణంగానూ సంఘంలో కీర్తిప్రతిష్ఠలూ పలుకుబడీ ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వాళ్ల ద్వారా ఏమేమో అద్భుతాలు జరిగిపోగలవనుకుంటూ మీరు మీ ప్రయత్నాల విషయంలో కొంత నిర్లక్ష్యాన్ని చూపించే అవకాశముంది. అది ఏమాత్రమూ సరికాదని గ్రహించండి.

ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే, వారు మీ ద్వారా ప్రయోజనాన్ని మరొకరి నుండి పొందదలిచి, మిమ్మల్ని ఓ దూత లేదా మధ్యవర్తిగా నిర్ణయించుకుని పరిచయాన్ని చేసుకుంటున్నారని భావించండి. కార్తీకంలో ఏర్పడే పరిచయాలు శాశ్వతంగా ఉండవు. విరోధంగాని ఏర్పడితే అది చాలాదూరం వెళ్లిపోతుంది. భారత యుద్ధ ప్రారంభం కార్తీకంలోనే.
మీ ప్రతిభకి గుర్తింపుగా మీ ఉద్యోగ సంస్థ గాని లేదా మీకు మీరే గాని వాహనాన్ని పొందే అవకాశముంది. చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మరింత ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చునేమో గాని, సంతృప్తికరంగా నడుస్తుంటాయి.

జరిగిన మూడు మాసాల కంటె మీ ఆర్థిక స్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది. శుభకార్యం ఒకటి ముందు నాటికి రాబోయే అవకాశముంది కాబట్టి ధనవ్యయాన్ని చేసేప్పుడు ఓ క్షణం ఆలోచించండి. ఓ పథకం ప్రకారం వెళ్లండి. కుటుంబ సభ్యులతో ఐకమత్యం బాగా ఉన్న కారణంగా మీరెంతో ఉత్సాహంగా ఉంటారు.

లౌకిక పరిహారం: అవకాశం చేసుకుని గోశాలలో ఉన్న ఒక ఆవుకి గడ్డిని పంపించండి. లేదా స్వయంగా అందివ్వండి.
అలౌకిక పరిహారం: సమీప శివాలయానికి వెళ్లి శంకరునికి అష్టోత్తర శతనామావళికి సరిపడేలా 108 పూలని సమర్పించండి. ఇంటి గుమ్మంలో సంధ్య దీపాన్ని వెలిగించి ఉంచండి.

మిధునం
(మే 21 – జూన్‌ 20)

 కుజ, గురు, శుక్ర, రాహు, కేతువులు అనుకూలురుగా ఉన్న కారణంగా ఏయే ముఖ్య కార్యాలని మున్ముందు చేయాలని భావిస్తున్నారో ఆ అన్నిటినీ ఒక క్రమంలో రాసుకుని, దేనికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలో, దేన్ని తర్వాత చెయ్యాలో ఆ తీరుగా ఒక పట్టికని ఏర్పాటు చేసుకోండి.

ఎవరో మీ వద్దకి వచ్చి ఏమీ చేయరు కాబట్టి మీకు మీరే బిడియాన్నీ వెనుకబాటుతనాన్నీ విడిచిపెట్టండి. ముఖ్యులైన వారితో పరిచయాన్ని చేసుకోండి. మీరు అడిగితే చాలు తగిన సహాయాన్ని చేయడానికి కొందరు మీకున్నారని గ్రహించి పరిచయం కోసం ప్రయత్నించండి ఈ వారంలో. విత్తనం నాటితే ఎప్పుడో ప్రయోజనం ఉంటుంది, ఇప్పుడు ఏమి లాభం అనుకోండి. ఇప్పుడు నాటితే తొందరలో ప్రయోజనం ఉండగలదు.

తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఎవరెవరికో ఋణాలిచ్చి ఉంటారు. వారందరినీ స్వయంగా కలిసి మీ డబ్బును తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేయండి. దూరాల్లో ఉండే వారికి తరచూ ఈ విషయాన్ని గుర్తుచేయండి. మనసులో ఆవేశం ఉన్నా దానిని మాటలో కనబడనివ్వకండి. సౌమ్యంగా మాట్లాడండి. తప్పక ఋణాలు వసూలవుతాయి. అనుకూల కాలం ఇది.

కొత్త ఉద్యోగం కాని, ఉన్న ఉద్యోగంలోనే అదనపు బాధ్యతలు కానీ కలగవచ్చు. మీకు సహజంగా ఓర్పూ నైపుణ్యం ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వచ్చిన ఉద్యోగాన్ని నచ్చిన తీరుగా చేయండి. మీ సమర్ధతకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రదేశం సుఖంగా ఉంటే కుంటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగపరంగా, కుటుంబపరంగా కూడా ముందుకి సాగిపోవడానికి ఇది మీకు అనువైన కాలం.

లౌకిక పరిహారం: కార్తీకం గోవులకు ప్రీతికరమైన మాసం కాబట్టి శివ విష్ణువులకి ఆనందదాయకం కాబట్టి ఓ గోవుకి సరిపడినంత తౌడుని సమర్పించి రండి లేదా పంపించండి.
అలౌకిక పరిహారం: వారంలో ఏదో ఒకరోజున శంకరునికి విభూతితో అభిషేకాన్ని చేయించండి. స్వయంగా చేసుకోగలిగితే మరీ మంచిది.

సింహం
(జూలై 23 – ఆగస్ట్‌ 22)

కుజ, బుధ, గురు, శుక్రులు అనుకూలంగా ఉన్న కారణంగా ఇప్పటికే ఒక వాహనాన్ని కొని ఉండి ఉండవచ్చు. పదిమందితో పరిచయం పెట్టుకుందామని మీరనుకుంటే మరో పదిమంది కూడా మీ పరిచయం కోసం వచ్చేవారు సిద్ధంగా ఉంటారు.

ఎదుటివారిని తమవారిగా తీర్చిదిద్దుకోవడంలో మంచి నైపుణ్య మున్న మీరు ప్రభుత్వ అధికారులతో మంచి స్నేహ సంబంధాలను పెట్టుకుంటారు. అయితే ఏ పరిచయమైనా ఎంతలో ఉండాలో అంతలో ఉండడమే మంచిదనే యదార్థాన్ని మరువకండి. ముఖ్యంగా వాళ్ల నుండి ఋణాలని తీసుకోవద్దు. వారు చేయలేని పనిని వారి ద్వారా మరొకరికి చెప్పించి చేయించుకోవాలనే ప్రయత్నం అసలు చేయవద్దు.

అది మంచిది కా(బో)దు. స్థలాల విషయంలో లేదా ఆస్తి అమ్మకపు విషయంలో ఏవైనా లోటుపాట్లు మీరు తెలిసి కానీ, తెలియక గాని చేసి ఉంటే వెంటనే ఆ కొన్నవారి దృష్టికి ధర్మబద్ధంగా తెలియజేయడం మంచిది. లేనిపక్షంలో అది ఒక న్యాయసంబంధ వ్యవహారంగా రూపుదిద్దుకుని మీకు మనశ్శాంతి లేకుండా చేయవచ్చు.

చర్మవ్యాధి గాని, శ్వాస సమస్యలు గాని వచ్చి ఉన్నా, రాబోయే సూచనలున్నాయని అన్పించినా వీలయినంత శీఘ్రంగా వాటిని పరిష్కరించుకోండి తప్ప అశ్రద్ధ చేయడం సరికాదు. తల్లితో గాని తండ్రితోగాని లేదా ఇద్దరితోనూ గాని ఏవైనా వ్యవహారాలుంటే నిజాయితీగా పరిష్కారాన్ని చేయించుకునే దిశగా ఈవారంలో ప్రయత్నిస్తే సమస్యలు విడిపోగలవు.

లౌకిక పరిహారం: కార్తీకం గోప్రీతికర మాసం కాబట్టి ఇతర గ్రహాల అనుకూలత కోసమూ గోశాలని ఓ రోజున స్వయంగా శుభ్రం చేయండి లేదా శుభ్రం చేయించండి.
అలౌకిక పరిహారం: ఉదయాస్తమయ కాలాల్లో ఉదయం శివుణ్ణీ సాయంత్రం విష్ణువునీ వారం రోజులపాటు వీలు చేసుకుని దర్శించండి. మనసుంటే మార్గం ఉంటుంది. వీలు కాదనుకోకండి. ఇది మీకోసమే కదా!

వృషభం
(ఏప్రిల్‌ 20 – మే 20)

రవి శని గ్రహాలు ప్రతికూలంగా ఉన్న కారణంగా సంతానం గురించిన విద్య, ఆరోగ్యం, అభివృద్ధి గురించి సక్రమంగా పట్టించుకోవడం లేదనే ఊహ మీకు వస్తుంది. నిజానికి మీరు అంతగా శ్రద్ధ చూపించడం లేదనేది కూడా యదార్థమే. కొద్దిగా పట్టించుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా పిల్లల విద్య, ప్రవర్తన విషయంలో మెత్తగా ఉండవద్దు. అలాగని కఠిన వైఖరి కూడా తగదు.

ఇంటికొచ్చిన బంధువులో లేక మీ కుటుంబంతో మరింత చనువుగా వుండే మిత్రుల ద్వారానో మీ ఇంట్లో చిన్నచిన్న మనస్పర్థలేర్పడే అవకాశముంది కాబట్టి ఎవరితో ఎంతలో ఉండాలో, ఎవరిని ఎంతలో ఉంచాలో మీ దంపతులు ఆలోచించుకుని ఓ నిర్ణయాన్ని చేసుకుని దాన్ని అమలు చేయడం మరింత అవసరం.

మీరు ఏదైనా ఓ ప్రత్యేక శాస్త్ర రంగానికి చెందిన వారయినట్లయితే (వైద్య, విజ్ఞానం, న్యాయం...) మీ కృషికి గుర్తింపు లభించే అవకాశముంది. కాబట్టి కృషిని మరింతగా చేయడం ఎంతైనా మంచిది. కుటుంబ సభ్యులంతా ఐకమత్యంతో ఉంటే కుటుంబ యజమాని లేదా యజమానురాలు మరింత ఎత్తుకి ఎదగగలుగుతారనే విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ ఓ చోట కూర్చోబెట్టి ఉదాహరణలతో సహా చెప్పండి.

ఒకప్పుడు సమష్టి కుటుంబాలుండే రోజుల్లో ఈ బాధ్యతని తాత బామ్మ అమ్మమ్మలు తీసుకుంటుండే వారు. ఈ కాలంలో కుటుంబంలో ఉన్న సభ్యుల్లో కూడా సమష్టి విధానం లోపిస్తుండడం వల్లే తరచూ సమస్యలు వస్తున్నాయి. ఆ పరిస్థితిని రానిచ్చుకోకండి.

లౌకిక పరిహారం: దగ్గరలో వుండే గోశాలకి వెళ్లి ఓ ఆవుకి కావలసిన వైద్య ఔషధాలని పంపించండి లేదా వ్యయాన్ని భరించండి.
అలౌకిక పరిహారం: రోజుకొక్కమారైనా శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించండి.ఇంటి గుమ్మంలో సంధ్యా దీపాన్ని వెలిగించి ఉంచండి.

కర్కాటకం
(జూన్‌ 21 – జూలై 22)

శని, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్న కారణంగా మిగిలిన గ్రహాల అనుకూలతలు తగినంతగా ఉన్నందువల్ల లోగడ చేసిన వివాహాది శుభకార్యాల ఫ్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. లౌక్యాన్ని ప్రదర్శించకుండా ఉన్నదున్నట్టుగా ధర్మబద్ధంగా వ్యవహారాన్ని నడిపించుకున్నట్లయితే అంతా ఆనందకరంగానే ఉంటుంది.

ఇష్టపూర్వకంగానూ ఎంతో కాలమైందనే ఉద్దేశ్యంతోనూ సమీప బంధువుల్ని హృదయపూర్వకంగా వెళ్లి కలుస్తారు. అది మీకు చక్కని ఫలితాలు ఇవ్వబోతోంది. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో పైకి ఎదిగేందుకై ఏవైనా పరీక్షలూ లేదా మెళకువలూ గాని ఉన్నట్లయితే ఆలసించకుండా ఆ ప్రయత్నాలను చేయండి. అవి లాభిస్తాయి.

మీకు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లోనే కాక వీటికంటె వేరైన మరో రకంలో కూడా కొత్తగా ప్రతిభని చూపించగల శక్తి ఉండి తీరుతుంది కాబట్టి, అలా గూఢంగా మరుగునపడిన మీలోని శక్తిని పైకి తీయండి. మెరుగులు దిద్దండి. పదిమందిని ఆకర్షించండి. సంఘం ద్వారా వచ్చే కొన్ని లౌకిక సమస్యలు, వ్యక్తులు మీకున్న పరిచయాలని గుర్తించిన కారణంగా సమస్యలు వాటంతట అవే పరిష్కరించుకుంటూ వెళ్లిపోతాయి. వ్యక్తులు మీ దాకా రానే రారు కూడ! మీ విషయంలో ధర్మబద్ధమైన అంశాన్ని చెప్పేటప్పుడు నాన్చకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఎంతైనా అవసరం.

లౌకిక పరిహారం: కార్తీకమాసం గోప్రీతికరం కాబట్టి ఓ గోవుకి క్రిమికీటక మక్షికా (ఈగలు) బాధలు లేకుండా దోమతెరని కొని ఇవ్వండి. శునకాలకి రొట్టెలు తినిపించండి.
అలౌకిక పరిహారం: అరగదీసిన గంధపు చెక్క గంధాన్ని దేవాలయానికి వెళ్లి శ్రీహరికి సమర్పించి రండి. గంధపు చెక్క లేనిపక్షంలో పసుపుని అందించండి. గురువులను గౌరవించండి. వీలయితే వారికి మీకు చేతనయిన సేవ ఏదైనా చేసి, వారి ఆశీస్సులు అందుకోండి. గురుబలం ఉండటం అన్నివిధాలా క్షేమదాయకం.

కన్య
(ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)

రవి బుధులు మాత్రమే అనుకూలిస్తున్న కారణంగా తీవ్రంగా శ్రమించడానికి మీకు మీరే ముందుగా సిద్ధపడి ఉండండి. ఎంతో తేలికగా అయిపోతుందన్న ప్రతి పనీ, నిజానికి తేలికగా అయిపోయే పనీ కూడా శ్రమతో పూర్తవుతుంది. పూర్తయ్యేవరకూ మానసికాందోళన ఉంటుంది. అయితే ఆందోళన పడుతూ ఉండటం వల్ల పనులు నెరవేరవని గ్రహించండి. స్థిమితంగా ఉండి, ప్రశాంతంగా ఆలోచించడం మంచిది.

తప్పనిసరిగా స్వదేశంలోని వారు విదేశానికో, విదేశంలో ఉన్నవారు స్వదేశానికో అతి స్వల్పకాలం కోసం రావలసి ఉంటుంది. అశుభ కార్యక్రమం ఏదైనా ఉంటుందేమో అని సంశయించకండి. శుభకార్యం శుభ సంఘటన నిమిత్తంగా రావలసి లేదా పోవలసి ఉంటారు. ధన వ్యయం తప్పనిసరి. ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న ఉద్యోగానికి ఇప్పుడు పిలుపు రావచ్చును. ఏ ఉద్యోగం ఎంత జీతం అనుకుంటూ మీనమేషాలని చూడకుండా ఉన్నంతలో ఓ మార్పుని ఆనందంగా ఆహ్వానించండి.

తేలికపాటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. నిర్ణయాలని తీసుకోవడంలో కొద్ది వేగాన్ని చేయడం అవసరం. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయంలో మీరు ఇప్పుడేమీ పరిష్కరించలేరని గ్రహించి కొత్త సమస్యలు రాకుండా ఉండేలా చూసుకోండి.

ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నుల విషయంలో, అలాగే ఆస్తుల్ని కొన్న–అమ్మిన వాటి విషయంలో వచ్చిన సొమ్ము గురించిన పత్రాలూ లెక్కలూ భద్రపరచుకుని ఉండండి. వివాహాలు కావలసిన వారు గాని ఉంటే తొందరగా అనుకూల నిర్ణయం తీసుకోవలసిందే.

లౌకిక పరిహారం:  గోశాలకి వెళ్లి గోవుకి బియ్యాన్నీ, ఆకుకూరలనీ సమర్పించండి. గో ప్రదక్షిణ చేయండి.
అలౌకిక పరిహారం: రోజుకి ఓమారు శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించండి. వీలు చేసుకుని ఒకరోజున శ్రీమహావిష్ణువుకి పంచామృతాభిషేకాన్ని చేయించండి.
 

తుల
(సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)

శుక్ర కేతువులు శుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఆడంబరం కోసం, పదిమందిలో మీ గొప్పతనాన్ని చూపించుకోవాలనే దృష్టితోనూ ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు చేస్తారు. పదిమందీ మిమ్మల్ని గమనిస్తున్నారన్న ఆలోచన ఉండడం అవసరం.

ఉద్యోగంలో ఉన్నవారికి తాము అనుకున్న చోటుకు బదిలీ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. దీన్ని వ్యతిరేకిస్తూ అధికారుల్ని కలవడం, సిఫారసులు చేయించడం వల్ల కొత్తగా ఒరిగేదంటూ ఏమీ ఉండకపోవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే మీ పై అధికారులకు మాత్రం మీ మీద ఓ వ్యతిరేక దృష్టి పడే అవకాశం ఉంటుందని గ్రహించండి.

ఇష్టం లేకున్నా, కష్టమైనా, నిష్ఠూరమైనా జీతం కోసం జీవితాన్ని కొంత శ్రమకు గురి చేయక తప్పదని భావించండి. పరిస్థితి ఇలాగే ఉండదు. అంతా త్వరలో.. అంటే అతి శీఘ్రంగా మీ ప్రయత్నమేమీ లేకుండానే చక్కబడిపోతుంది. ఓ చిత్రాన్ని గీసి అలా చెరిపేసిన చందంగా.

మీకుండే ఆవేశం కారణంగా పై అధికారులతో కొంత వాగ్వివాదం చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. అలాగే మీ కింది వారిని తూలనాడాల్సిన సందర్భాలూ ఏర్పడవచ్చు. ‘ఎవరినీ కరవద్దు గానీ, బుస్సుమనకుండా ఉండమన్నానా’ అన్నట్లు పరిస్థితిని బట్టి విషయం దూరం వెళ్లకుండా ఉండేలా విచక్షణతో ప్రవర్తించండి. ఏ సందర్భంలోనూ రాతపూర్వకంగా తప్పుల్ని అంగీకరిస్తూ లొంగిపోవద్దు. తప్పులను తల మీద వేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం.

లౌకిక పరిహారం : గోవు ప్రీతికరమైన మాసం కార్తీ్తకం. ఈ మాసంలో గోవుకు పచ్చికూరల్నీ, అవి ఇష్టంగా తినే పండ్లనీ స్వయంగా సమర్పించండి.
అలౌకిక పరిహారం : శ్రీహరి హృదయస్థానంలో నిరంతరం ఉంటూ శ్రీహరిని నడిపించే లక్ష్మికి పుష్పాలు ముంచిన జలాలతో అభిషేకాన్ని చే(యి)స్తూ లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించండి.

ధనుస్సు
(నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)

గురుశుక్రులు అనుకూలిస్తూ రవి కుజ శనులు స్వల్ప అనుకూలతతో ఉన్నారు. ఈ కారణంగా మీరు అనుకున్నది తడవుగా పనులన్నీ తొందరగా పూర్తవుతాయి. దాంతో కొంత అహంకారం రావచ్చు. అది భార్య లేక భర్త విషయంలో కొంత అసంతృప్తికి కారణమూ కావచ్చు కాబట్టి తగినంతలో ఉండడం (కుటుంబ విషయంలో మాత్రమే) సరైన కర్తవ్యం.

నిర్మాణరంగంలో గాని ఉన్నా, లేక ఏదైనా ఇంటి మరమ్మతులూ గృహనిర్మాణాలూ మొదలైనవి చేపట్టినా, అవి సగంలో నిలుపుదల కావచ్చు. పనులు మందకొడిగా జరుగుతూ ఉండవచ్చు.

ప్రయాణాల సమయంలో వస్తువులూ ఇతర సామగ్రీ, అలాగే వాహనాలని నడిపేటప్పుడూ, ప్రయాణించేటప్పుడూ జాగ్రత్తతో వ్యవహరించడం అవసరం. నమ్మకంతోనూ ఎంతో కాలనుండీ పరిచయంతోనూ ఉన్న మిత్రులు రుణాన్ని కానీ అడిగినట్లయితే ఇవ్వడం మంచిది కాదు. ధననష్టం మాట అటుంచి విరోధం తప్పక వచ్చే అవకాశముంది. అలాగని మీరు హామీగా ఉండి ఇతరుల ద్వారా ఇప్పించడం మరింత తగని పని.

ఇదే సందర్భంలో వాగ్దానాలూ మంచిది కాదని గ్రహించుకోవాలి. మీ పరిచయాన్ని ఆధారం చేసుకుని మీకు ముఖ్యమైన వారి నుండి ఏదైనా సహాయాన్ని ఎవరైనా పొందుతూ ఉండవచ్చు. అలాంటి వారిని గమనించి వీరిని మందలించి ఆ ముఖ్యమైన వారికి విషయాన్ని వివరించి చెప్పండి. ఎక్కువ చనువునియ్యడం– కుటుంబ గోప్యత లేకపోవడమే దీనికి కారణమని గ్రహించండి.

లౌకిక పరిహారాలు: నిజమైన అర్హులైన వారిని గ్రహించి (సాధారణ గృహస్థులకి) వారికి చలి బాధ లేకుండా దుప్పట్లని ఇవ్వండి.
అలౌకిక పరిహారం: శనికి సంబంధించిన శ్లోకాన్ని రోజుకి 361 మార్లు పఠించడం ఎంతైనా సత్ఫలితాలనిస్తుంది. (నీలాంజన సమాభాసమ్‌ రవిపుత్రం యమాగ్రజమ్‌ ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్‌)

కుంభం
(జనవరి 20 – ఫిబ్రవరి 18)

బుధుడు అనుకూల దృష్టితో ఉండగా గురు శుక్ర శనులు స్వల్ప అనుకూలతతో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దాచుకున్న సొమ్మ మరింతగా పెరిగి (క్రయ విక్రయాల కారణంగా) ఆనందాన్నివ్వడమే కాకుండా సంతానానికి వివాహాది శుభకార్యాలు అనుకోకుండా కలిసొస్తాయి. ఉద్యోగ విరమణ చేసిన వారున్నట్లయితే రావలసిన బకాయిలు శీఘ్రంగా చేతికొస్తాయి.

వ్యవసాయదారులకి పంట బాగా వస్తుందనే నమ్మకంతో పాటు గిట్టుబాటు ధర లభించే కారణంగా రాబోయే ఆదాయం మరింత ఉత్సాహాన్ని కల్గిస్తుంది. అయితే తొందరపడి ఇల్లో పొలమో స్థలమో... కొనెయ్యద్దు.

ఏదేని కళారంగానికి చెందిన వాళ్లకి అనుకూలంగా ఉన్న కారణంగా విదేశీ ప్రయాణం చేయవలసిన అవసరం లేదా ఉన్న చోటనే మంచి కార్యక్రమానికి అవకాశం లభించే గ్రహస్థితీ కన్పిస్తోంది. గాత్ర సంగీతం కంటె వాద్యపరికరాల మీద స్పష్టమైన అధికారం మీకొస్తుంది. స్వదేశీయులు విదేశానికీ, విదేశీయులు స్వదేశానికీ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకుంటే విదేశానుమతి (వీసా)తప్పక లభిస్తుంది.

సంతానానికి చదువు, ప్రవర్తన బాగుంటాయి. పెద్ద పెద్ద చదువులు చదివిన పిల్లలున్నట్లయితే స్థానచలనం కలగవచ్చు. పోటీ పరీక్షల్లో అనుత్తీర్ణులయ్యుంటే ఈమారు విజయం తథ్యం.

లౌకిక పరిహారాలు: మీకు సమయం వృథా అయ్యే అవకాశం ఉన్నందువల్ల మిత్రులతో, సమీప బంధువులతో అనవసర కాలక్షేపాన్ని మానాల్సిందే. మొగమాటం వీడి మీ సమయానికి ఉన్న విలువని చెప్పండి.
అలౌకిక పరిహారాలు: విష్ణ్వాలయ ప్రాంగణంలో లేదా మీకు సమీపంగా ఉన్న ఏదేని గుడిలో శ్రీ విష్ణు సహస్ర నామాలని పఠించి ఒకరోజు ప్రసాదాన్ని చేయిం^è ండి. లేదా కనీసం మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని వీలయినన్ని మార్లు పఠిస్తూ, విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజించండి. శక్తిమేరకు ప్రసాదం తయారు చేసి, నివేదించి, మీరు తీసుకోవడంతోపాటు ఇతరులకు కూడా పంచండి.

వృశ్చికం
(అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)

రవి, బుధ, శుక్ర, రాహువులు అనుకూలురుగా ఉన్నారు. మిమ్మల్ని మీరు గాని గమనించుకుని చూస్తే మీలో మీకే ఎంత మార్పుందో ఆశ్చర్య పడతారు. ఒకప్పటి ఆవేశం, నా మాటే నెగ్గాలనే పట్టుదల, ఎదుటివాణ్ణి నిలదీసే తీరు.. అన్నీ పూర్తిగా తగ్గి ప్రశాంతమైన రుషిలాగా ధర్మం కోసం ఎదురుచూస్తూ నిలబడతారు జీవితం అనే అద్దం ముందు.

ఇది మీకు చాలా మంచి కాలం. జీవితంలో నిజమైన పాఠాన్ని అనుభవపూర్వకంగా తెలియజేసే గ్రహం శని. ఆయన శిక్షణలో మీరు 2013 వ సంవత్సరం నుండీ, మళ్లీ మాట్లాడితే 2010 నుండీ ఉన్నారు. ఇక మిమ్మల్ని ఇంతగా పరీక్షకు గురి చేసి మీలో అంతఃపరివర్తనని (మీకు మీరుగా మారే విధానాన్ని) పొందించగల గ్రహం మరొకటి లేదు.

కొన్ని సందర్భాలలో రుణదాతల నుండి తీవ్రమైన ఒత్తిడులను, కొన్ని సందర్భాలలో దంపతులు వేర్వేరుగా ఉండే పరిస్థితినీ, ఇంకా కొన్ని సందర్భాల్లో రక్షక భటుల వద్దకు వెళ్లి సమాధానాన్ని నిలబడి చెప్పవలసిన అగత్యాన్నీ, మరికొన్ని సందర్భాల్లో న్యాయ స్థానంలో ముద్దాయిగా అందరిముందూ కన్పించవలసిన ధోరణినీ నిష్కాణంగానూ, నిజంగా మీరు తప్పు చేయకుండానూ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటివి ఉంటే ధర్మబద్ధంగానే ఉండండి.

సముద్రపు అలకు తలొంచితే ఎలా ఒక్కసారి దూసుకుని కెరటం వెళ్లిపోతుందో అలా ఒడ్డుకు చేరే అవకాశం దగ్గరకొస్తోంది. తల్లీ, తండ్రీ లేదా ఇద్దరి ఆరోగ్యాలను ఒకమారు జాగ్రత్తగా ఉండేలా చూసుకోమని చెప్పడం, లేదా పరీక్ష చేయించడం చెయ్యండి. ఏ భయమూ లేదని గ్రహించండి.

లౌకిక పరిహారం : కుష్టువ్యాధిగ్రస్తులకు ఆహారం నింపిన పొట్లాలను పంచండి.
అలౌకిక పరిహారం : శనికి తైలాభిషేకాన్ని నువ్వులతో అర్చించి ఆ నువ్వుల్నీ, నూనెనీ పాత ఇనుప వస్తువు (బూర్లె మూకుడు వంటివి)తో పాటు శనివారం నాడు బ్రాహ్మణునికి దక్షిణతో దానం చెయ్యండి. శని శ్లోకాన్ని 19 మార్లు పఠిస్తూ 19 ప్రదక్షిణల్ని నవగ్రహాలకు చెయ్యండి.

మకరం
(డిసెంబర్‌ 22 – జనవరి 19)

శుక్రుడు అనుకూలునిగా ఉన్న కారణంగా ఉన్న పళంగా తీర్థయాత్రలకో విహార యాత్రలకో వినోద పర్యటనలకో వెళ్లాలనే నిర్ణయానికొచ్చి వెంటనే ప్రయాణాలు చేస్తారు. అనుకున్న దానికి మించి ధనవ్యయాన్ని చేస్తారు.

కొత్త వస్తువులను కొంటారు. ధనవ్యయం అయిందనే ఆందోళన కంటే, అరుదైన వస్తువులను తెచ్చుకోగలిగామన్న ఆనందమే ఎక్కువగా కనిపిస్తుంది మీలో. బంధుమిత్రులు... చాటున మీ గురించి మరోలా అనుకుంటూ, మీ ముందు మాత్రం ప్రశంసిస్తూ ఉంటారు. వారి మాటలు నమ్మి మీరు మరింతగా ధననష్టాన్ని చేసుకుంటారు. ఈ పద్ధతిని విడనాడి తీరాలని గ్రహించండి.

దుర్జన మైత్రి కలిగే అవకాశం ఉంది. దాంతో జూదాలలో ధనాన్ని పెట్టే అలవాటు రాబోతోంది. మీరు ఆ ఉచ్చులో పడకండి. మీ కుటుంబ సభ్యులకి ఇలాటి పరిస్థితి రాబోతోందని చెప్పి మిమ్మల్ని ఆ జూదానికి ఆకర్షితులు కాకుండా చేయవలసిందని చెప్పుకోండి. జూదం మీకు రాని పక్షంలో పందాలు కాయడంలో ఆసక్తి చూపించే ప్రమాదం పొంచి ఉంది. మరోమారు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవలసిన కాలం ఇది.

భార్య లేదా అత్తగారి ఆరోగ్యం కొంత దెబ్బతినే అవకాశం ఉంది కుజ బుధ శని రాహుకేతువుల అననుకూలత కారణంగా. సరైన కాలంలో ప్రతిస్పందిస్తే వైద్యవ్యయం తక్కువ అవుతుంది. మనశ్శాంతి శీఘ్రంగా కలుగుతుందని గుర్తించి వీలైనంత తొందరలో వారికి ఆరోగ్యపరీక్షలని నిర్వహింప చేయండి.

లౌకిక పరిహారం: ప్రవహించే నీటిలో బియ్యపు పిండినీ, అరటిపండు గుజ్జునీ జలచరాలకి వేయండి. నది, ఏరు, వాగువంకలు అందుబాటులో లేకపోతే సరస్సులు, చెరువుల్లో వేయవచ్చు.
అలౌకిక పరిహారాలు: ఒక దేవాలయ పురోహితుణ్ణి లేదా పండితుడిని సాదరంగా ఇంటికి ఆహ్వానించి మీ శ్రీమతితోనే వంట చేయించి సంతృప్తికరంగా భోజనాన్ని పెట్టి చక్కని దక్షిణ ఇచ్చి పంపండి. భోజనం పెట్టేటప్పుడు ‘త్రిమూర్తి స్వరూపాయ సద్గురవే నమః’ అని చెప్పండి.

మీనం
(ఫిబ్రవరి 19 – మార్చి 20)

రవి శుక్ర రాహువులు అనుకూలురై ఉన్న కారణంగా ఎప్పుడో మీరు వేసుకున్న ఓ ప్రణాళికని ఇప్పుడు అమలు చే సే అవకాశం రాబోతోంది. దాన్ని సక్రమంగానూ, అహంకారం లేకుండానూ గాని ఆచరణలో పెడితే చెప్పలేని ఆనందం, దానితోబాటు చక్కని ధనాదాయం లభిస్తుంది. సంతృప్తికరంగా జీవించే అవకాశం లభిస్తుంది.

కొత్త ఇల్లు లేదా కొత్త పొలానికి తగిన వసతులని ఏర్పాటు చేయడంలో నిమగ్నులవుతారు. ఏవో కొన్ని కారణాలతో ఇంతకుముందు తమకి తామే శత్రువులైనవారు తమ శత్రుత్వాన్ని విడిచి మీ వద్దకి వారే వస్తారు. వచ్చినంత మాత్రాన వారు మీకు అనుకూలమై పోయారని భావించకుండా తగుమాత్రపు దూరాన్ని పాటిస్తూనే ఉండడం మంచిది.

అనారోగ్యం ఏ మాత్రమూ లేదుగదా అనే ఆనందంతో ఆహార విహారాల పట్ల అశ్రద్ధ ఏమాత్రమూ సరికాదు. ఆహారవిహారాదులు క్రమం తప్పితే ఆరోగ్యం పాడవడానికి ఎంతోకాలం పట్టదని మర్చిపోవద్దు. ప్రశంస(ల)కి లొంగిపోతే అకాల నిద్ర అకాల భోజనం అనే స్థితికి వెళ్లిపోతారు. మొహమాటం లేకుండా ఈ తిండి నిద్రల విషయంలో స్పష్టమైన ఆదేశాలని పొందండి.

జరిగిన 3, 4 నెలలకింద ఏదో ఒక చక్కటి ఉద్యోగం లేదా ఆస్తీ మీకు సంక్రమించి ఉండవచ్చు. దాని విషయంలో నిర్లక్ష్యాన్ని, అశ్రద్ధనీ చూపకండి. ఇప్పటి ఈ ఆస్తి మీకు జీవితంలో పెద్ద విలువని కలిగి ఉన్న ఆస్తిగా మారిపోబోతోంది. ఎంత ఒత్తిడికి గురి చేసినా ఉద్యోగం– వృత్తి– వ్యాపారం... అనే వీటిని మారడం ఏ విధంగానూ సమంజసం కాదు.

లౌకిక పరిహారాలు: ఇతరుల విషయాల్లో ‘తీర్పరి’గా ఉండం ఏమాత్రమూ సరికాదు.
అలౌకిక పరిహారాలు: అవకాశం ఉంటే సంకట హర గణపతి స్తోత్రం రోజుకు నాలుగుమార్లు చదువుకోండి. అది కుదరకపోతే వినాయకునికి గరికతో పూజించండి. గణపతికి సంబంధించిన మంత్రాలు లేదా స్తోత్రాలని చదువుతూ పూజ నిర్వహించండి. ఉదాహరణకి ‘ఓం గం గణపతయే నమః’ 32 అరటిపండ్లని లేదా 32 చిన్న ఉండ్రాళ్లని గణపతికి నివేదన చేయండి.

– డా‘‘ మైలవరపు శ్రీనివాసరావు , జ్యోతిష్య పండితులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top