
నేను మర్చిపోలేనంతగా మనస్సులో నిలిచిపోయిన పుస్తకం ‘ఎలుకలొస్తున్నాయ్! జాగ్రత్త’. రచయిత ఎన్.ఆర్.నంది. కథావస్తువును ఎన్నుకోవటంలో గానీ, శైలిలో గానీ, ఇది ఎంతో ఉన్నత ప్రమాణాలతో ఉండటం చేత పాఠకులకు ఈ నవల ఆసక్తిని కలిగిస్తుంది. తెలుగు సాహితీ జగత్తులో ఇదో కొత్త ప్రయోగం అని చెప్పవచ్చు.
కథ విషయానికి వస్తే... ఒక లైబ్రరీలో కాపురం ఉండే ఎలుకల జంట ఈ నవల్లోని ముఖ్య పాత్రలు. మగ ఎలుక పేరు మూషిక రాజు (హీరో). ఇది మనుషుల్లాగా మాట్లాడగలదు. లైబ్రరీలోని ఎన్నో పుస్తకాల రుచి (తిని) చూసి ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తుంది. అదే క్రమంలో తన భార్య మూషిక రాణికి లోకం పోకడ వివరిస్తుంది. మానవ సమాజంలోని కుళ్లును, అవినీతిని చూపిస్తుంది. దీని ప్రభావంతో మూషిక రాణి కూడా పుస్తకాల రుచి చూసి, రచనలు చేయటం, మనుషుల్లా మాట్లాడటం అనే దశకు ఎదుగుతుంది.
ఈ నేపథ్యంలో లైబ్రేరియన్, మూషిక రాణి రచనకు వచ్చినటువంటి పారితోషికాన్ని కొట్టేయడం, తిరిగి మూషిక రాణి తను ఆ డబ్బును కొట్టేయడం వల్ల పోలీసులు మూషిక రాణిపై దొంగతనం నేరం మోపడం, మూషిక రాణి మాట్లాడుతుంటే ప్రజలు భయపడటం, ప్రభుత్వం మాట్లాడే ఎలుకను, మూషిక రాణిని, మానవ సమాజ ఉద్ధరణ నిమిత్తం ప్రయోగం కోసం ఎన్నుకోవడం, మూషిక రాజు దీనికి ప్రతిఘటించడం, ఒక లాయరు ఈ ఎలుకల తరుపున న్యాయం కోసం కోర్టులో వాదించడం, మూషిక రాజు, ప్రభుత్వ లాయర్లతో ఎన్నో విషయాలపై మేధావుల స్థాయిలో వాదించడం ఈ నవలకే హైలైట్. చివరకు నవల ముగింపు కూడా ఆలోచింపజేస్తుంది.
ఈ నవల్లోని ఎలుకలు, అణగదొక్కబడుతున్న వర్గాలకు ప్రతీక! మానవులు తమ స్వార్థం కొరకు ఏ విషయాన్నైనా తమకు అనుకూలంగా ఎలా మలుచుకుంటారో రచయిత కళ్లకు కట్టినట్టు వివరించారు.
ఈ నవల చదివిన తరువాత, మన స్వార్థానికి బలయ్యే ప్రతి ఒక్క జీవిపైన సానుభూతి కలుగక మానదు.
మామిడి మహేంద్ర