చిరంజీవి కుప్పిగంతులు | Chiranjeevi damned Re-Counting in mangalagiri | Sakshi
Sakshi News home page

చిరంజీవి కుప్పిగంతులు

May 19 2014 12:16 AM | Updated on May 29 2018 4:06 PM

చిరంజీవి కుప్పిగంతులు - Sakshi

చిరంజీవి కుప్పిగంతులు

మంగళగిరి ఎమ్మెల్యేగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) గెలుపును ఎన్నికల అధికారులు ప్రకటించేసినా, టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి తనకేదో అన్యాయం జరిగిపోయిందంటూ నానా హంగామా చేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో చిరంజీవి వర్గీయులు చేయాల్సిందంతా చేశారు.

 సాక్షి, గుంటూరు :మంగళగిరి ఎమ్మెల్యేగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) గెలుపును ఎన్నికల అధికారులు ప్రకటించేసినా, టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి తనకేదో అన్యాయం జరిగిపోయిందంటూ నానా హంగామా చేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో చిరంజీవి వర్గీయులు చేయాల్సిందంతా చేశారు. జిల్లా ఎన్నికల అధికారిపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చారు. మూడు సార్లు రీ కౌంటింగ్ చేసినా ఆర్కే గెలుపు ఖరారైంది. గంజి చిరంజీవిపై 12 ఓట్ల ఆధిక్యతతో ఆర్కే గెలుపొందారు. ఆర్కే గెలుపును జిల్లా ఎన్నికల అధికారి జోక్యంతో రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. సాక్షాత్తూ ఎన్నికల కమిషన్ ధ్రువీకరించి ఆర్కేకు డిక్లరేషన్ కూడా ఇచ్చింది. ఇదంతా కళ్లెదుట కనిపిస్తున్నా, చిరంజీవి తనకు అన్యాయం జరిగిపోయిందంటూ గంగవైలెత్తుతూ అటు మంగళగిరిలోనూ, ఇటు కౌంటింగ్ జరిగిన నాగార్జున యూనివర్సిటీలోనూ రాస్తారోకోలు, ధర్నాలంటూ హల్‌చల్ చేస్తున్నారు. వైఎ స్సార్‌సీపీ శ్రేణులపై విషం కక్కుతున్నారు.
 
 అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ళ వద్ద రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.  సానుభూతి కోసమే...ఇదంతా చిరంజీవి, ఆయన వర్గీయులు ఎందుకు చేస్తున్నారు? సానుభూతి ముసుగులో ముందున్న మునిసిపల్ ఛైర్మన్ గిరీ కోసమేనా? కచ్ఛితంగా అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఎందుకంటే మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం టీడీపీలో పోటీ నానాటికీ ఎక్కువవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం, కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు నడుమ మంగళగిరి వద్ద ఉంటుందని ప్రచారం జోరందుకోవడంతో మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడినా మున్సిపల్ ఛైర్మన్ పదవినైనా దక్కించుకునేందుకు చిరంజీవి కుప్పిగంతులేస్తూ అటు పార్టీ నేతలకు, ఇటు అధికార యంత్రాంగానికి చిక్కులు తెచ్చిపెడుతున్నారనే ప్రచారం ఇప్పుడు తారస్థాయికి చేరింది.
 
 ఛైర్మన్ గిరీ కోసం లాబీయింగ్... మంగళగిరి పట్టణంలో 33 వార్డులున్నాయి. టీడీపీ 14 , వైఎస్సార్‌సీపీ ఎనిమిది, సీపీఎం, సీపీఐ, బీజేపీ మూడేసి వార్డులు,  కాంగ్రెస్ ఒక్క వార్డు గెలుపొందాయి. మంగళగిరి పురపాలక సంఘాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో ఆ పార్టీలో ఛైర్మన్ గిరీ కోసం పోటీ తీవ్రమైంది. ఓ వార్డులో చేనేత వర్గం నుంచి గెలుపొందిన మహిళా అభ్యర్థిని ఛైర్మన్‌గా ఎంపిక చేస్తామని ఆమె వద్ద ఆర్థికంగా ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చేనేత వర్గం నుంచి కౌన్సిలర్లుగా ఆరుగురు ఎన్నికవడంతో వీరిలోనే పోటీ ఎక్కువగా ఉంది. మరో వైపు టీడీపీ నేతలతో సంబంధాలున్న ఓ వ్యాపార వేత్త ఛైర్మన్ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఎలాగైనా సరే ఛైర్మన్ పీఠం దక్కించుకోవడం కోసం టీడీపీలో మొదలైన వర్గ పోరు ఎటు దారితీస్తుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, చిరంజీవి కూడా తనదైన శైలిలో హల్‌చల్ చేస్తుండడాన్ని కొందరు నేతలు బాహాటంగానే తప్పుబడుతున్నారు. సానుభూతి ద్వారా మున్సిపల్ ఛైర్మన్ గిరీ కోసం ఆయన హైడ్రామా ఆడుతున్నారని సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement