ట్రంప్‌ బెదిరింపు ధోరణి | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ బెదిరింపు ధోరణి

Published Sat, Aug 17 2019 1:32 AM

Witness editorial on Donald Trump financial actions - Sakshi

మన దేశాన్ని, చైనాను అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం డిమాండ్‌ చేశారు. ఆయన ఇలా అనడం వారం రోజుల వ్యవధిలో రెండోసారి. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను అడ్డం పెట్టుకుని ఈ రెండు దేశాలూ ‘అభివృద్ధి చెందుతున్న దేశాల’ ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయన్నది ఆయన ప్రధాన ఆరోపణ. డబ్ల్యూటీఓ లొసుగులతో ఎవరైనా లబ్ధిపొం దాలని చూస్తే ఊరుకోమని ఆయన హెచ్చరిస్తున్నారు.  చైనాతో ఆయన వాణిజ్యయుద్ధం మొదలు పెట్టి ఏడాది దాటింది. అది తీవ్ర స్థాయికి చేరుకుని ఈమధ్యే కుదుటపడిన సూచనలు కనిపించి నంతలోనే చైనా ఎగుమతులపై సెప్టెంబర్‌ మొదటివారంలో 30,000 కోట్ల డాలర్ల మేర సుంకాలు విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం ఆపేయాలని వెను వెంటనే తమ పబ్లిక్‌ రంగ సంస్థలకు చైనా సూచించింది. చైనా ప్రకటన వెలువడగానే అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా పడిపోయాయి. జరిగిన నష్టాన్ని గ్రహించి సుంకాల పెంపు ఇప్పట్లో ఉండ దని ట్రంప్‌ ప్రకటించవలసి వచ్చింది. ఇదిగాక ఆ రెండు దేశాల మధ్యా కరెన్సీ తగువు నడుస్తోంది. ఎగుమతులను పెంచుకోవడం కోసం చైనా తన కరెన్సీ విలువను కృత్రిమంగా తక్కువ స్థాయిలో ఉంచుతున్నదని, ఇది తమకు నష్టం తెస్తున్నదని అమెరికా ఆరోపిస్తోంది. ట్రంప్‌ కయ్యానికి కాలు దువ్వే ధోరణి అమెరికాతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్‌ కేవలం భారత్, చైనాలపై మాత్రమే కాదు... దక్షిణాఫ్రికా, ఇండొనేసియా దేశాలపైనా ఈ మాదిరే మాట్లా డుతున్నారు. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల ముసుగులో ప్రత్యేక సదుపాయాలు పొంది అమె రికాకు నష్టం కలిగిస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. 

అధికారంలోకొచ్చిన నాటినుంచీ ట్రంప్‌ ఎవరో ఒకరితో తగువు పడుతూనే ఉన్నారు. ఇరాన్‌తో అమెరికాతోసహా అయిదు దేశాలు, యూరప్‌ యూనియన్‌(ఈయూ) కుదుర్చుకున్న అణు ఒప్పం దానికి ఆయన స్వస్తి చెప్పారు. కొత్త ఒప్పందానికి సిద్ధపడాలని ఒత్తిడి తెస్తూ ఇరాన్‌పై కొత్త ఆంక్షలు విధించారు. తమ దేశంలో ఉత్పత్తయ్యే హార్లీ–డేవిడ్‌సన్‌ బైక్‌లపై విధించిన సుంకాలు తగ్గించాలని ఆయన భార™Œ ను డిమాండ్‌ చేయడం మొదలెట్టారు. తగ్గించినా అదింకా చాల్లేదని పేచీకి దిగారు. ఆ విషయంలో తన మాట విననందుకు ప్రతీకారంగా నిరుడు మన ఉక్కుపై 25శాతం, అల్యూ మినియం ఉత్పత్తులపై 10శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. మన దేశానికి అయిదు దశాబ్దా లుగా సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీఎస్‌పీ) కింద కల్పిస్తున్న వెసులుబాట్లు రద్దు చేయాలని కూడా అక్కడి ప్రతినిధుల సభకు ఆయన లేఖ రాశారు. మన దేశం ఇది సరికాదని పలుమార్లు చెప్పి చివరకు అమెరికా నుంచి మన దేశానికొచ్చే 29 వ్యవసాయ ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించింది. డబ్ల్యూటీఓ తీరుతెన్నులపై ట్రంప్‌ మొదటినుంచీ అసంతృప్తిగా ఉన్నారు. ఆ సంస్థలో అమెరికా సభ్య దేశంగా ఉండటం వల్ల తన ‘అమెరికా ఫస్ట్‌’ నినాదాన్ని సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నానని, దేశ ఆర్థిక వ్యవస్థను తాను అనుకున్న రీతిలో పటిష్టంగా తీర్చిదిద్దలేకపోతు న్నానని ట్రంప్‌ భావిస్తున్నారు. అందుకే గత నెలలో డబ్ల్యూటీఓపై ఆయన ధ్వజమెత్తారు. దేన్న యినా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించడానికి ఇప్పుడనుసరిస్తున్న విధానాలను మార్చ వలసిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న దేశమేదైనా ఈ నిబం ధనల కింద లబ్ధి పొందుతుంటే కఠిన చర్యలు తీసుకోవాలంటూ వెనువెంటనే లేఖ రాయాలని అమెరికా ప్రతినిధులను ఆదేశించారు.  

డబ్ల్యూటీఓపై ధ్వజమెత్తడం... భారత్, చైనాలను అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించాలని కోరడం వెనక ట్రంప్‌కు పెద్ద ప్రణాళికే ఉంది. వచ్చే ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థుల్ని నిర్ణయించే ప్రక్రియ మొదలైంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం రెండోసారి కూడా దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ట్రంప్‌ తాజాగా ఈ వివాదం రేకెత్తిం చారు. మరోపక్క దిగుమతులపై విధించే అదనపు సుంకాలతో అమెరికన్‌ కంపెనీల ఉత్పత్తులకు రక్షణ కల్పించి, దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉన్నట్టు చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందువల్ల దేశంలో తనకు అనుకూల వాతావరణం పెరిగి రిపబ్లికన్‌ పార్టీలో తిరుగు ఉండదని ఆయన భావిస్తున్నారు. కానీ ఇలాంటి వివాదాల పర్యవసానంగా అమెరికా వాణిజ్యం దేశ సరి హద్దులు దాటి విస్తరించడం అసాధ్యమవుతుందన్న సంగతిని ఆయన విస్మరిస్తున్నారు. ట్రంప్‌ పేచీ వెనక మరో ఉద్దేశం కూడా ఉంది. వచ్చే నెలలో మన దేశంతోపాటు చైనాతో కూడా వాణిజ్య అంశాలపై అమెరికా చర్చించాల్సి ఉంది. 2024నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవాలని మన దేశం ఆశిస్తోంది. అది సాధించాలంటే అమెరికాతో వాణిజ్యం సవ్యంగా ఉండా లని మోదీ ప్రభుత్వానికి తెలుసు.  తన ఆర్థిక పురోగతి యధావిధిగా సాగాలంటే అమెరికాతో వాణి జ్యానికి అవరోధాలుండకూడదని చైనాకు కూడా తెలుసు. మొన్న జూన్‌లో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ట్రంప్‌తో రెండు దేశాల అధినేతలూ చర్చించారు. వచ్చే నెలలో ఇరు దేశా లతో జరగబోయే చర్చలు దానికి కొనసాగింపే. ఈలోగా వాణిజ్య విభేదాల విషయంలో తాను పట్టుదలగా ఉన్నట్టు నిరూపించుకోవడం ట్రంప్‌కు అవసరం. అప్పుడు మాత్రమే ఈ రెండు దేశా లనూ దారికి తెచ్చుకోవడం సులభమవుతుందని ఆయననుకుంటున్నారు. ట్రంప్‌ తీరు వల్ల ఏర్ప డిన అనిశ్చితి కారణంగా అమెరికా తయారీ రంగంలో 4శాతం, ప్రైవేటు మదుపు 1.2 శాతం క్షీణిం చిందని తాజా సర్వే చెబుతోంది. కనుక దౌత్యంలోనైనా, వాణిజ్యంలోనైనా బెదిరింపు ధోరణి సత్ఫ లితాన్నివ్వబోదని, తమకూ నష్టం వాటిల్లుతుందని ట్రంప్‌ గ్రహించాలి. 

Advertisement
 
Advertisement
 
Advertisement