జనం క్షమించరు

once again AP special status issue raised in Parliament - Sakshi

కొత్త సంవత్సరం ప్రారంభమయ్యాక జరిగే పార్లమెంటు తొలి సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఆనవాయితీ. అంతకన్నా ముందు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం కూడా ఆచారంగా వస్తున్నదే. కేంద్ర కేబినెట్‌ చర్చించి ఖరారు చేసే ఆ ప్రసంగంలో గడిచిన ఏడాది ప్రభుత్వం సాధించిన విజయాలు, రాగల సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఉంటాయి. సారాంశంలో అది ప్రభుత్వ విధాన పత్రం. కనుకనే అందులోగానీ, ఆ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోగానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇచ్చిన హామీల ఊసు లేదేమని ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు నిలదీశారు. అటు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంటున్న తెలుగుదేశం సభ్యులు కూడా విపక్ష సభ్యుల్లా హడావుడి చేయడం జాతీయ మీడియాను సైతం విస్మయపరిచింది.

ఆ సంగతలా ఉంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ జవాబిచ్చిన తీరు, ఆయన ప్రసంగిస్తుండగా లోక్‌సభ నినాదాలతో హోరెత్తడం, వాటిని ఖాతరు చేయకుండా మోదీ గంటన్నరపాటు సుదీర్ఘ ప్రసంగం చేయడం వంటివి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించాయి. ప్రసంగం పొడవునా ప్రత్యర్థులపై పిడుగులు కురిపించి వారిని గుక్కతిప్పుకోకుండా చేయడంలో మోదీకెవరూ సాటిరారని తెలిసిందే. ఈసారి ప్రసంగంలో సైతం అలాంటివి దండిగానే ఉన్నాయి. అంతకుమించి అదొక భారీ బహిరంగసభను ద్దేశించి చేసిన ప్రసంగాన్ని తలపించింది. కేవలం ఆయన స్వరం పెంచి మాట్లా డటం వల్ల మాత్రమే కాదు... అందులో స్వాతంత్య్రోద్యమం నాటినుంచీ ఇంత వరకూ కాంగ్రెస్‌ వల్ల జరిగిన తప్పుల్ని ఏకరువు పెట్టడం వల్ల కూడా అది బహిరంగ సభ ప్రసంగాన్నే గుర్తుకు తెచ్చింది. గుజరాత్‌ ఎన్నికలు, రాజస్థాన్‌ ఉప ఎన్నికలలో వెలువడిన ఫలితాలు, మరికొన్ని నెలల్లో జరగబోయే కర్ణాటక ఎన్నికలు అలాంటి ప్రసంగం చేయడానికి కారణం కావొచ్చు. కానీ ప్రధాని నుంచి దేశ ప్రజలు... మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎంతో ఆశగా, ఆత్రుతగా ఎదురుచూసింది ఈ మాదిరి ప్రసంగం కోసం కాదు.

ప్రధాని ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన బాగానే వచ్చింది.  రాజీవ్‌గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు సొంత పార్టీ ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించడం, అది తెలుగుదేశం ఆవిర్భావానికి కారణం కావడంతో మొదలుపెట్టి రాష్ట్ర విభజన వరకూ జరిగినవి ఆయన గుర్తు చేశారు. అది ఏక పక్షంగా జరి గిందని, లోక్‌సభ తలుపులు మూసి ఆ తీర్మానం ఆమోదించారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకూ విభజన ఇప్పుడు గతించిన అంశం. ఆ సమయంలో ఏం జరిగిందో, ఎవరి పాత్రేమిటో రాష్ట్ర ప్రజలకు కొత్తగా ఎవరూ చెప్పనవసరం లేదు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఏకం కావడం వల్లే ఆ విభజన సాధ్యమైంది. రాజ్యసభలో విభజన బిల్లు వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ విపక్షంలో ఉండి అప్పటి యూపీఏ ప్రభుత్వం నుంచి రాబట్టిన ప్రత్యేక హోదా హామీని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మర్చిపోలేదు. వాటినే నెరవేర్చమని ప్రజలు అడుగుతున్నారు. నాలుగేళ్లు కావస్తున్నా వాటి అతీగతీ లేకపోవడాన్ని నిరసిస్తున్నారు.

తమకు అధికారం అప్పగిస్తే రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇస్తామని ఎన్నికల ప్రచార సభలో తిరుపతి వెంకన్న సాక్షిగా బీజేపీ, టీడీపీలు చెప్పిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఆ పార్టీల మేనిఫెస్టోల్లో ప్రత్యేక హోదా అంశం ప్రముఖంగా ఉన్న సంగతిని జ్ఞాపకం తెచ్చు కోమంటున్నారు. కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని నరేంద్రమోదీ చెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇప్పుడు ఒరిగేదేమీ లేదు. అందుకు బదులు పునర్విభజన చట్టం అమలుకు దాదాపు ఈ నాలుగేళ్ల కాలంలోనూ వచ్చిపడిన అడ్డంకులేమిటో, ఆ విషయంలో ఎందుకు విఫ లమయ్యారో మోదీ చెప్పాలి. ప్రత్యేక హోదా సంగ తేమి చేశారో వివరించాలి. దానికి సమానమైన స్థాయిలో ‘ప్రత్యేక ప్యాకేజీ’ ఇచ్చామని, హోదా గతించిన అంశమని ఇన్నాళ్లుగా బీజేపీ, టీడీపీలు చెబుతున్నాయి. కానీ అది చెల్లదు. ఆ అరకొర ‘ప్యాకేజీ’ సైతం ఏమీ అమలు కాలేదని కేంద్ర బడ్జెట్‌ సాక్షిగా ఇప్పుడు రుజువైంది.

విభజన సమయంలో ఆడిన కపటనాటకాలను తెలుగుదేశం ఇప్పుడు కూడా పునరావృతం చేసి జనాగ్రహం నుంచి తప్పించుకుందామని ప్రయత్నిస్తోంది. పాలక ఎన్‌డీఏలో భాగస్వామిగా కొనసాగుతూ అదే ప్రభుత్వంపై ఆందోళన సాగిం చడం అనైతికమని ఆ పార్టీకి తోచలేదు. దాన్నయినా చిత్తశుద్ధితో చేస్తే వేరే విషయం. బడ్జెట్‌పై తొలుత కేంద్ర కేబినెట్‌లో చర్చ జరుగుతుంది. అక్కడ ఆమోదం పొందాకే దాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతారు. గత మూడు బడ్జెట్‌ల మాదిరే ఈసారి కూడా కొత్త బడ్జెట్‌లో రాష్ట్రానికిచ్చింది ఏమీ లేదని కేబినెట్‌ భేటీ సమయంలోనే టీడీపీకి అర్ధమై ఉండాలి. ఆ క్షణంలోనే నిరసన తెలిపి, ప్రభుత్వం నుంచి బయటకు రావాలి. అది చేయలేదు సరిగదా... వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆందోళనకు పూనుకొనేసరికి ఎక్కడ వెనకబడిపోతామోనన్న ఆత్రుతతో సభలోనూ, సభ వెలుపలా డ్రామాలాడటం ఎవరి కళ్లు కప్పడానికి?

పోనీ ఆ ఆందోళన నిజమైందే అనుకుంటే జైట్లీ హామీకి సంతృప్తిపడి దాన్ని కాస్తా విరమించిన వారు 24 గంటలు గడవకుండానే ప్రధాని ప్రసంగం సమయంలో దాన్ని మళ్లీ ప్రారంభించడం, మధ్యలో విరమించడంలోని ఔచిత్యమేమిటి? ఒకపక్క ఢిల్లీలో ఇలా బహు పాత్రాభినయం చేస్తూ, రాష్ట్రంలో గురువారం బంద్‌ తలపెట్టిన ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపడం నీతిమాలినతనం కాదా? ఇప్పుడు టీడీపీ, బీజేపీలు రెండూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన స్థితిలో పడ్డాయి. వాటిలో ఒక పార్టీ నిరసన నాటకాన్ని నడిపించి, మరో పార్టీ మౌనం పాటించి తప్పించుకోలేవు. తక్షణం విభజన చట్టంలోని హామీల అమలు ప్రారంభించడం, ప్రత్యేక హోదా ప్రకటించడం మినహా మరేవీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను సంతృప్తి  పరచలేవు. రెండు పార్టీలూ ఆ సంగతి గుర్తించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top