టి.నరసాపురం : మండలంలోని బొర్రంపాలెం నుంచి కూలిపనికి ఒరిస్సా వెళ్లిన కూలీలు కామెర్లతో బాధపడుతున్నారు. వీరిలో ఇద్దరు మరణించగా, ఐదుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఒరిస్సా వెళ్లిన వలస కూలీలకు కామెర్లు
Aug 3 2016 11:23 PM | Updated on Sep 4 2017 7:40 AM
టి.నరసాపురం : మండలంలోని బొర్రంపాలెం నుంచి కూలిపనికి ఒరిస్సా వెళ్లిన కూలీలు కామెర్లతో బాధపడుతున్నారు. వీరిలో ఇద్దరు మరణించగా, ఐదుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామం నుంచి 15 రోజుల క్రితం 15 మంది కూలీలు ఒరిస్సాకు జామాయిల్ మొక్కలు నాటే పనికి వెళ్లారు. మూడురోజులు అక్కడే ఉండి పని ముగించుకుని మళ్లీ వచ్చేశారు. తిరిగి ఐదు రోజుల క్రితం మరికొందరు ఒరిస్సాకు పనికి వెళ్లారు. ముందుసారి వెళ్లిన వారు జ్వరం, కామెర్లతో బాధపడుతున్నారు. రెండోసారి వెళ్లిన వారిలో కొందరు అస్వస్థతకు గురికావడంతో తిరుగుముఖం పట్టారు. వీరిలో ఇద్దరు రాయగడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలపర్తి కృష్ణ(29) విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. మూడురోజుల క్రితం గ్రామంలోనే గుండెవీరబాబు మరణించాడు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఆస్పత్రిలో చిన్ని ఏసుబాబు, కె.ఆదినారాయణ చికిత్స పొందుతున్నారు. గ్రామంలోనే ఇళ్ల వద్ద ఉండి వడ్లమూడి పుల్లారావు, వడ్లమూడి సుబ్బయ్య, సకలాబత్తుల భూషయ్య చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై స్థానిక వైద్యాధికారి రసూల్‌ను వివరణ కోరగా, కామెర్ల వ్యాధితో వలస కూలీలు బాధపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, గురువారం గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామని వివరించారు.
Advertisement
Advertisement