తాత్కాలిక సచివాలయంలో కూలిన గోడ | Sakshi
Sakshi News home page

తాత్కాలిక సచివాలయంలో కూలిన గోడ

Published Mon, Jul 11 2016 11:42 PM

Wall collapse to temporary secretariat

సాక్షి, అమరావతి : తాత్కాలిక సచివాలయంలోని మొదటి భవనం మొదటి అంతస్తులో సైడ్ గోడ కూలి జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు కూలీలు గాయపడ్డారు. మొదటి అంతస్తు చివరి భాగం కుడి వైపున అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం సిమెంట్ ఇటుకలతో గోడ నిర్మిస్తుండగా ఉన్నట్లుండి కూలింది. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న దేవేందర్‌పై ఇటుకలు పడటంతో వెన్నెముక, కాలు విరిగింది. రామచంద్ర ఓకై కాలు, చెయ్యి విరగడంతో పాటు తలకు తీవ్రగాయమైంది. ధర్మేంద్ర, జాయరాం, కిషోర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. కాగా, తాత్కాలిక సచివాలయం నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి.

నిర్మాణ పనుల కోసం పశ్చిమబెంగాల్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చారు. మే నెలలో ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందడంతో పని ఒత్తిడి పెరిగిందని, భద్రత లేదని కూలీలంతా ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత మరో కూలీ మృతి చెందాడు. ఈ ప్రాంతం లూజ్ సాయిల్ కావడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలోనే మందడం గ్రామంలో నిర్మాణంలో ఉన్న గోపిరెడ్డి భవనం కుంగిపోవడం కలకలం రేపింది. ఆ తర్వాత తాత్కాలిక సచివాలయం రెండవ భవనం గ్రౌండ్‌ఫ్లోర్ కింది భాగం కుంగింది. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి మరమ్మతులు చేశారు.

Advertisement
 
Advertisement