రణస్థలం మండలం కొవ్వాడలో నిర్మించనున్న అణువిద్యుత్ ప్లాంట్‌తో ఉత్తరాంధ్రకు ముప్పు తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి హెచ్చరించారు.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రణస్థలం మండలం కొవ్వాడలో నిర్మించనున్న అణువిద్యుత్ ప్లాంట్‌తో ఉత్తరాంధ్రకు ముప్పు తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి హెచ్చరించారు. అణువిద్యుత్ కర్మాగారం వల్ల తలెత్తే అనర్థాలు, ప్రమాదాలను వివరిస్తూ శ్రీకాకుళం పట్టణంలోని వైఎస్సార్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుప్లాంట్ ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమన్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించడంతో ప్రధానమంత్రి మోదీ అణుప్లాంట్ నిర్మాణాన్నివ్యతిరేకించారన్నారు. ఇప్పుడు అదే మోదీ శ్రీకాకుళం జిల్లాలో అణుప్లాంట్‌ను పెట్టి అమాయకులైన ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలను పణంగాపెడుతుంటే సీఎం చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీల జెండాల్లో రంగులు, గుర్తులు తేడా తప్ప విధానాల్లో మార్పులేదని గుర్తు చేశారు.
కొవ్వాడలో అణురియాక్టర్ల ఏర్పాటుకు రూ.2.80 లక్షల కోట్లు వెచ్చించి కాంట్రాక్టర్లు, పాలకులు జేబులు నింపుకోవడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం సమకూరదన్నారు. అణుప్లాంట్‌కి పెట్టే ఖర్చుతో రాష్ట్రంలో ప్రజలకు మౌలిక సదుపాయాల సమస్య తీర్చవచ్చన్నారు. అణుప్లాంట్ నిర్మాణాన్ని విరమించుకోవాలని ప్రపంచ దేశాలు చెబుతున్నా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు వినిపించుకోకపోవడం విచారకకరమన్నారు. ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాటాలే శరణ్యమన్నారు. ప్రజలంతా ఉద్యమానికి సన్నద్ధంకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు చౌదరి తేజేశ్వరరావు, రాష్ట్ర కమిటీ నాయకులు వీజీకే మూర్తి, కె.నారాయణరావు, ఎం.తిరుపతిరావు, వై.చలపతిరావు, టి.తిరుపతిరావు, కె.సూరమ్మ, కె.హేమసూధన్‌లు పాల్గొన్నారు.