‘పైరసీ’ సైట్లను బ్లాక్ చేస్తాం | The acceptance of the Internet service providers | Sakshi
Sakshi News home page

‘పైరసీ’ సైట్లను బ్లాక్ చేస్తాం

Oct 29 2015 4:44 AM | Updated on Aug 30 2019 8:24 PM

‘పైరసీ’ సైట్లను బ్లాక్ చేస్తాం - Sakshi

‘పైరసీ’ సైట్లను బ్లాక్ చేస్తాం

పైరసీ బారి నుంచి సినిమా పరిశ్రమను కాపాడేందుకు తెలంగాణ ఐటీ శాఖ పలు చర్యలకు శ్రీకారం చుట్టింది.

♦ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల అంగీకారం
♦ ప్రభుత్వం ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి
♦ అవసరమైతే కేంద్రానికీ లేఖ: కేటీఆర్
♦ సినీ ప్రముఖులు, నెట్ ప్రొవైడర్లతో సమీక్ష సమావేశం
 
 సాక్షి, హైదరాబాద్: పైరసీ బారి నుంచి సినిమా పరిశ్రమను కాపాడేందుకు తెలంగాణ ఐటీ శాఖ పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. తెలుగు సినిమా పరిశ్రమ, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖల అధికారులతో బుధవారం సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పైరసీకి పాల్పడుతున్న వెయ్యి వెబ్‌సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లను సినీ ప్రముఖులు ఈ సందర్భంగా కోరారు. ప్రతి సినిమాకు కోర్టుల నుంచి ఆదేశాలు తీసుకుని, పైరసీ సైట్లను ఆపేయాలని కోరడం తమకు కష్టంగా మారిందన్నారు.

సర్వీసు ప్రొవైడర్లు స్పందిస్తూ, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు తాము మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. పైరసీని అరికట్టేందుకు సహకరిస్తామని ముక్త కంఠంతో చెప్పారు. పైరసీకి పాల్పడుతున్న వెబ్‌సైట్లను బ్లాక్ చేసేందుకు అంగీకరించారు. అయితే అందుకు అనుగుణంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పైరసీని అడ్డుకునే చర్యల్లో భాగంగా అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తామని కేటీఆర్ తెలిపారు. ‘‘ఇది తెలుగుకే పరిమితం కాదు. సినీ పరిశ్రమంతా ఎదుర్కొంటున్న సమస్య. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న సినీ రంగానికి, దానిపై ఆధారపడ్డ వర్గాల భవిష్యత్తుకు పైరసీతో ఎంతో నష్టం.

అందుకే దీనికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలూ చేపడతాం’’ అని ఆయన ప్రకటించారు. పైరసీకి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, సినిమాకు ముందు ప్రత్యేక ప్రకటన ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. దేశంలోనే రెండో అతి పెద్ద సినీ పరిశ్రమ తెలుగేనని, పైరసీతో వందల కోట్ల నష్టం జరుగుతోందని సినీ పరిశ్రమ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. యూరప్ దేశాల్లో అమలు చేస్తున్న యాంటీ పైరసీ విధానాలను ఆయన దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు సినీ నిర్మాతలు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement