బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం | take security to all flood victims said ajc ashok kumar | Sakshi
Sakshi News home page

బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం

Sep 26 2016 10:33 PM | Updated on Sep 4 2018 5:24 PM

కలెక్టరేట్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఇన్‌ఛార్జి ఏజేసీ అశోక్‌కుమార్‌ - Sakshi

కలెక్టరేట్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఇన్‌ఛార్జి ఏజేసీ అశోక్‌కుమార్‌

ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి ఏజేసీ అశోక్‌కుమార్‌ తెలిపారు

సాక్షి,సిటీబ్యూరో:  భారీ వర్షాలతో ఇళ్లలోకి వరదనీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి ఏజేసీ అశోక్‌కుమార్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో  బస్తీ ప్రజలిచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఇందులో పింఛన్లు, ఇళ్లు, ఉద్యోగాలు, ఆర్థిక సహాయానికి సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి.

ఆసీఫ్‌నగర్, షేక్‌పేట్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, అంబర్‌పేట్‌ మండలాల్లోని ముంపు బస్తీల్లో ప్రజలకు ఆహార పొట్లాలు, మంచినీటి పాకెట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ, భారత్‌ సేవా సంఘాల ద్వారా బిస్కెట్‌ ప్యాకెట్లతో పాటు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశామన్నారు.  వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను గుర్తించామని, సంబంధిత మండల తహశీల్దార్లు బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని ప్రాంతాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అశోక్‌కుమార్‌ తెలిపారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు తమ సిబ్బంది పూర్తి సమాచారాన్ని నిర్దేశించిన ప్రొఫార్మాలో ఆన్‌లైన్‌ ద్వారా పంపించటంతోపాటు హార్డ్‌ కాపీని కూడా కలెక్టరేట్‌లో అందజేయాలన్నారు.

ఎర్రగడ్డ తదితర ప్రాంతాలలో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా  విద్యార్థుల నుంచి అధిక పీజులు వసూలు చేస్తున్నారని పేరేంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వివరాలతో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లా శాఖల అధికారులు పాల్గోన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement