తెరపైకి సీరోలు మండలం | Sakshi
Sakshi News home page

తెరపైకి సీరోలు మండలం

Published Fri, Sep 30 2016 12:47 AM

తెరపైకి సీరోలు మండలం

  • వద్దంటూ నాలుగు పంచాయతీల తీర్మానం 
  • అంగీకరించిన కాంపల్లి, సీరోలు గ్రామస్తులు
  • డోర్నకల్‌/కురవి : నియోజకవర్గంలో కొత్త మండలం పేరు పైకి వచ్చింది. సీరోలును మండలంగా ఏర్పాటు కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు గురువారం డోర్నకల్‌ మండలంలోని ఆరు, కురవి మండలంలోని ఆరు, మరిపెడ మండలంలో మూడు గ్రామాల్లో కలిపి 15 గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఇప్పటివరకు చిన్నగూడూరు, దంతాలపల్లి, ఎల్లంపేటను మండలాలుగా ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనలు చేపట్టగా, తాజాగా సీరోలు పేరు తెరపైకి వచ్చింది. సీరోలు మండలం ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం డోర్నకల్‌ మండలం పెరుమాళ్లసంకీస, మన్నెగూడెం, రాయిగూడెం, చిలుకొయ్యలపాడు, అందనాలపాడు, ముల్కలపల్లి, కురవి మండలం సీరోలు, కాంపల్లి, చింతపల్లి, కొత్తూరు (సి), ఉప్పరిగూడెం, తాళ్లసంకీస, మరిపెడ మండలంలోని ఎడ్జర్ల, తండధర్మారం, బాలిన ధర్మారంలో గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభలపై ప్రచారం జరగకపోవడంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాలేదు. మూడు నెలల క్రితం సీరోలును మండలంగా ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగి నా ఎవరూ నోరు విప్పలేదు. మాజీ ఎమ్మెల్సీ ఏ.వెంకట్‌రెడ్డి స్వగ్రామం సీరోలు కాగా, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి తేజావత్‌ రాంచంద్రునాయక్‌ ఇదే గ్రామపంచాయ తీ పరిధిలోని రూప్లాతండా. సీరోలులో పోలీస్‌స్టేషన్‌, ఆంధ్రాబ్యాంక్, పీహెచ్‌సీ నిర్వహణకు సరిపడ ఆరోగ్య ఉపకేంద్ర భవనం, ఆర్టీసీ బస్టాండ్‌ ఉన్నాయి.
     
    వ్యతిరేకిస్తున్న ప్రజలు
    డోర్నకల్‌ మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో సీరోలు కు సమీపంలో ఉన్న మన్నెగూడెం, అందనాలపాడు, చిలుకొయ్యలపాడు గ్రామస్తులు సీరోలు మండలంలో కలి పేందుకు అనుకూలంగా తీర్మానం చేయగా, ముల్కలపల్లి, పెరుమాళ్లసంకీస, రాయిగూడెం ప్రజలు తమ గ్రామాలను డోర్నకల్‌లోనే కొనసాగించాలని తీర్మానం చేశారు. కురవి మండలంలోని సీరోలు, కాంపెల్లి గ్రామాలకు చెందిన వారు అనుకూలంగా తీర్మానం చేయగా, చింతపల్లి, కొత్తూరు (సి), ఉప్పరిగూడెం, తాళ్లసంకీస ప్రజలు కురవి మండలం లోనే కొనసాగించాలని తీర్మానం చేశారు. మరిపెడ మండలంలోని ఎడ్జర్ల, తండధర్మారం, బాలినధర్మారం గ్రామాల వారు కూడా మరిపెడ మండలంలోనే కొనసాగించాలని తీర్మానం చేశారు. తహసీల్దార్‌ సంజీవ, ఈఓపీఆర్‌డీ విజయలక్ష్మి, డీటీ శేషగిరిస్వామి, ఆర్‌ఐ ఫిరోజ్, సర్పంచ్‌లు కాబు, మంగమ్మ, పద్మ, ఉమారాణి, కురాకుల రమణ, ఉపసర్పంచ్‌ కొంపెల్లి సతీష్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement