దుమ్మెత్తిపోస్తున్న వాహనాలు | Sakshi
Sakshi News home page

దుమ్మెత్తిపోస్తున్న వాహనాలు

Published Mon, Feb 20 2017 10:18 PM

దుమ్మెత్తిపోస్తున్న వాహనాలు - Sakshi

► శాపంగా మారినరహదారి విస్తరణ పనులు
► ఆగ్రహంతో టిప్పర్లు అడ్డుకున్న గ్రామస్తులు


కాల్వశ్రీరాంపూర్‌: సుల్తానాబాద్‌ నుంచి కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి నుంచి గంగారం బ్రాడ్జిక్రాస్‌ రోడ్డు వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులతో వాహనాలు వెదజల్లుతున్న దుమ్ముతో ప్రయాణికులు, గ్రామీణ ప్రాంత ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా అస్తమా పేషెంట్లు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు తేడాలేకుండా దుమ్ముతో ఊపిరాడక ఇబ్బందులపాలవుతున్నారు. ఊపిరితిత్తుల్లో దుమ్ముచేరి ఆస్పత్రులకు పరుగులుతీస్తున్నారు. రహదారి విస్తరణలో భాగంగా రోడ్లపై నీరు చల్లాల్సి ఉన్నా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దుమ్ములేస్తూ ఇళ్లపైనే కాకుండా, ఆరేసిన దుస్తులపై, వండుకున్న వంటలపైకి చేరడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతోంది.

మరమ్మతు పనుల్లో జాప్యం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో మండలంలోని పెగడపల్లిలోని దళితకాలనీ వాసులు రోడ్డు పనుల కోసం కంకర తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ప్రయాణికులు, గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టిన రోడ్లపై దుమ్ములేవకుండా ప్రతీరోజూ మూడుపూటలా నీళ్లుచల్లించాలని వేడుకుంటున్నారు.  

చాలా రోజుల నుంచి ఇదే వరుస
చాలారోజుల నుంచి ఇదే వరుస. దుమ్ములేస్తూ ఇళ్లపైనే కాకుండా ఆరేసిన బట్టలపై, ఇంట్లో వండుకున్న వంటలపై దుమ్ము పడుతుంది. టిప్పర్లు కంకర, మొరం, తారు  చేరవేస్తుండటంతో దుమ్ము లేచి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది.
– కుమార్, వార్డు సభ్యుడు, పెగడపల్లి

దమ్ము రోగం వత్తాంది

రోడ్లు పనులు ఎప్పుడు పూర్తయితవో కానీ ఇప్పడు రోజూ మాప్రాణాలు పోతున్నయి. పిల్లలకు, పెద్దోలకు ఊపిరాడత లేదు. దవాఖాన్లకు పోతే మిషన్  పెట్టి ఊపిరితిత్తుల్లో పేరుకు పోయిన దుమ్ము తీస్తున్నామని ఫీజు గుంజుతున్నరు. దుమ్ముతో దమ్మురోగం వత్తాంది.
– స్వామి, సర్వారాంపల్లి

 
Advertisement
 
Advertisement